Revenue Department: ఇక నుంచి భూ రిజిస్ట్రేషన్, మ్యూటేషన్లకు మ్యాప్ తప్పనిసరిగా ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. పక్కా వివరాలతో మ్యాప్ ఉంటేనే ఈ ప్రాసెస్ లు జరగనున్నాయి. భూమి విస్తీర్ణం, హద్దులు వంటి వివరాలతో మ్యాప్ ఉండాలి. అప్పుడే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ జరగనున్నది. లేకుంటే సదరు అప్లికేషన్ ను పెండింగ్ లో పెట్టనున్నారు. ఇందుకోసం గ్రామ స్థాయిలో సర్వేయర్లు భూమికి కొలతలు వేసి, మ్యాప్ ను తయారు చేయనున్నారు.
ధరణి పోర్టల్ రాకముందువరకు ఈ విధానం స్పష్టంగా అమలైంది. ఆ తర్వాత మ్యాప్ ల విధానం లేదు. కేవలం భూ విక్రయదారుడు, కొనుగోలు దారుల వివరాలు సమర్పిస్తే, రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఆటోమెటిక్ గా ప్రాసెస్ పూర్తి చేశారు. పైగా ఆ భూమి ఎక్కడ్నుంచి వచ్చింది? ఎలా వచ్చింది? పట్టా మార్పిడి ఎన్ని సార్లు జరిగింది? వంటి తదితర విధానాలన్నీ ధరణి పోర్టల్ రాకముందు వరకు రికార్డులలోకి ఎంట్రీ అయ్యేవి. ధరణి వచ్చిన తర్వాత పూర్తి స్థాయి డీటెయిల్స్ లేకున్నా..రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్లు జరిగిపోయాయి. దీంతో భూ సమస్యలు, వివాదాలు పెరిగిపోయాయి. ఇదే అంశంపై ధరణి కమిటీ పలుమార్లు గ్రామాల్లో అధ్యయనం చేసి మ్యాప్ ను తప్పనిసరి చేయాలని ప్రభుత్వానికి రిపోర్టు ఇచ్చింది. దీంతో తాజాగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.
Also Read: RV Karnan: ప్రజావాణి ఆర్జీలను వెంటనే పరిష్కరించాలి.. అధికారులకు కర్ణన్ కీలక ఆదేశాలు!
డబుల్ రిజిస్ట్రేషన్, దొంగ డాక్యుమెంట్లకు చెక్….
డిజిటల్ మ్యాప్ లను ఎక్కడినుంచైనా సులభంగా యాక్సెస్ చేయవచ్చని, మాన్యువల్ పద్ధతుల కంటే వేగంగా, తక్కువ ఖర్చుతో ఖచ్చితమైన సమాచారం పొందవచ్చని అధికారులు చెప్తున్నారు. డిజిటల్ మ్యాపింగ్ ద్వారా భూక్షేత్రాల పరిమాణం, ఆకృతి వంటి వివరాలు ఖచ్చితంగా పొందవచ్చన్నారు .ప్రభుత్వ సేవల్లో పారదర్శకత పెరగడంతో పాటు మ్యుటేషన్ ప్రక్రియ వేగవంతం అవుతుందన్నారు. పునరుద్ధరణ ,భద్రత డిజిటల్ రూపంలో భద్రంగా నిల్వ చేయడంతో పాటు కాలానుగుణంగా అప్డేట్ చేయవచ్చని ఓ అధికారి తెలిపారు.
ఇదిలా ఉండగా, ఊదాహరణకు యాదాద్రి జిల్లాలో ఓ వ్యక్తి తన రెండెకరాలు భూమిని విక్రయించాడు. కొనుగోలు దారుడు రిజిస్ట్రేషన్ కూడా పూర్తి చేసుకున్నారు. కొద్ది రోజుల తర్వాత ఆ భూమి ధర పెరగడంతో తన భూమి తనకు కావాల్సిందేనని విక్రయదారుడు పట్టుబట్టాడు. అవసరమైతే కోర్టుకు వెళ్తానంటూ బెదిరించాడు. ధరణి లో ఉన్న తప్పిదాలతో తొలుత భూమి అమ్మిన వ్యక్తి భూమిని తీసుకునేందుకు ప్రెజర్ చేశాడు.
దీంతో చేసేదేమీ లేక సదరు వ్యక్తి తాను కొనుగోలు చేసే సమయంలో ఇచ్చిన డబ్బును తీసుకొని, ఆ భూమిని తిరిగి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి కొన్ని చోట్ల డబుల్ రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇంకొన్ని ప్రాంతాల్లో హద్దుల వద్ద తప్పుడు లెక్కలతో డిజిటల్ ఎంట్రీ చేయించుకున్నారు. దీంతో సరిహద్దు భూ వివాదాలు తీవ్రతరం అయ్యాయి.
ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు ధరణి కమిటీ సభ్యులు కోదండరెడ్డి, సునీల్ కుమార్ లు కర్ణాటక వెళ్లి, అక్కడి రెవెన్యూ చట్టాలను అధ్యయనం చేశారు. అక్కడ అనుసరిస్తున్న విధానాలపై స్టడీ చేసి మ్యాపింగ్ నిర్ణయాన్ని తీసుకున్నాయి. వాస్తవానికి తెలంగాణలో 1936లో భూముల సర్వే జరిగింది. ఆ సమయంలో నిర్ణయించిన భూమి హద్దుల ఆధారంగానే ఇప్పటికీ రికార్డులు కొనసాగడం గమనార్హం. కంటిన్యూగా తప్పిదాలు, వివాదాలు నెలకొనడంతో సర్వే, మ్యాప్ లు తప్పనిసరి అంటూ ప్రభుత్వం సూచించింది.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు