Hydraa: ప్రజలు సర్కారు ఆస్తులైన చెరువులు కుంటలు నాళాలను కాపాడేందుకు హైడ్రా మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. చెరువుల్లో మట్టి, నిర్మాణ వ్యర్థాలు పోస్తే కఠిన చర్యలుంటాయని హైడ్రా శనివారం వార్నింగ్ జారీ చేసింది. అర్ధరాత్రి అందరి కళ్ళు కప్పి చెరువుల్లో కుంటల్లో నాలాల్లో నిర్మాణ వ్యర్ధాలు, చెత్తాచెదారం వేసే బిల్డర్లకు షాక్ ఇచ్చేలా ప్రకటన చేసింది.
చెరువులపై నిరంతరం నిఘా ఉంటుందని, మట్టిపోసిన వారిని సాక్ష్యాధారాలతో పట్టుకుని వారిపై క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ సంస్థలు, బిల్డర్లు, ట్రాన్స్‌పోర్టర్లతో పాటు ఆయా సంఘాల ప్రతినిధులతో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో హైడ్రా పలు సూచనలు చేసింది. ప్రకృతి సమతుల్యతకు చెరువుల పరిరక్షణ ఎంతో అవసరమని, ఆ దిశగా హైడ్రా పనిచేస్తోందని కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు.
Also read: Ponnam Prabhakar: వివక్షకు తావులేకుండా.. పారదర్శకంగా ఇండ్ల కేటాయింపు..
బిల్డర్లు, ట్రాన్స్‌పోర్టర్లు కలసి మట్టిని ఎక్కడ పోయాలో ముందుగానే ఒక అవగాహనకు రావాలని సూచించారు. అలా కాకుండా, ఎవరికి వారుగా మట్టిని తరలించే పని కాంట్రాక్టర్‌కు అప్పగించామని, ఆయన ఎక్కడ పోస్తే మాకేంటి ? అనేట్టు బిల్డర్లు వ్యవహరిస్తే అందరిపైనా కేసులు పెడతామని హెచ్చరించారు.
ట్రాన్స్‌పోర్టు ఖర్చులు మిగులుతాయని దగ్గర లోని చెరువుల ఒడ్డున పడేస్తామంటే, వారి వాహనాలను సీజ్ చేయడంతో పాటు డ్రైవర్, వాహన యజమాని, మట్టిని ఎక్కడి నుంచి తెస్తున్నారో ? సదరు నిర్మాణ సంస్థ యజమానిపై కూడా క్రిమినల్ కేసులు పెడతామన్నారు.
శిఖం భూములలో కూడా మట్టి వేయరాదని కమిషనర్ సూచించారు. హైడ్రా పోలీసు స్టేషన్ కూడా అందుబాటులోకి వచ్చిందని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఇందులో కేసులు నమోదు చేస్తామని, చెరువుల వద్ద కూడా 24 గంటలూ నిఘా ఉందని కమిషనర్ రంగనాథ్ గుర్తు చేశారు.
Also read: Mlc Kavitha: జాగృతి కన్వీనర్ల నియామకం.. ప్రకటించిన కవిత!
అక్రమంగా మట్టి పోస్తే..
చెరువుల్లో మట్టిపోసి నింపుతున్న వారి సమాచారాన్నివ్వాలని నగర ప్రజలను హైడ్రా కోరింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఫోన్ నెంబర్ 9000113667 కు ఫోన్ చేయొచ్చు అని హైడ్రా కమిషనర్ సూచించారు. హైడ్రా ట్విట్టర్ అకౌంట్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చునని పేర్కొంది.
అలాగే చెరువులో మట్టి పోస్తున్న లారీలు, టిప్పర్లు, ట్రాక్టర్లు, మట్టిని సర్దుతున్న జేసీబీల వీడియోలను కూడా పంపించాలని సూచించింది. కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులతో పాటు కళాశాలల విద్యార్థులు, స్వచ్చంద సంస్థలు ఇలా అందరూ భాగస్వాములు కావాలని హైడ్రా కోరింది.