Ponnam Prabhakar: పేదల సంక్షేమమే ధ్యేయంగా వివక్షకు తావు లేకుండా అర్హతను బట్టి పారదర్శకంగా పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయిస్తున్నామని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి, హైదరాబాద్ జిల్లా ఇన్ ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నాంపల్లి నియోజకవర్గంలోని బోజగుట్ట కు చెందిన 515 మంది డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులకు నాంపల్లి శాసనసభ్యులు మాజీద్ హుస్సేన్ ,రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తో కలసి లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ నిష్పక్షపాతంగా ఎక్కడ రాజీ పడకుండా అర్హులైన అందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అందిస్తున్నామని, లబ్దిదారుల ఎంపిక కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టాఫ్ట్ వేర్ తో ర్యాండమైజేషన్ ప్రక్రియతో లబ్దిదారులను ఎంపిక చేస్తున్నామని, వీరిలో వికలాంగులు, ఒంటరి మహిళలకు కింది ఫ్లోర్ లలో ఇండ్లను కేటాయిస్తున్నట్లు ఆయన వివరించారు.
ఇళ్ల పట్టాలకు సంబంధించి రాండమైజేషన్ జరిగిందని తెలుపుతూ, అర్హతలు, క్యాటగిరి బట్టి ఇండ్లు లబ్ధిదారులకు అందుతాయన్నారు. అదే విధంగా బోజగుట్ట లో ఇళ్లు పొందిన వారు అందరికీ అవగాహన కల్పించడం తో పాటు , ఆ ప్రాంత ప్రజలలో కూడా లబ్ధిదారులు అవగాహన కల్పించాలని సూచించారు. పట్టాలు అందుకున్న ప్రతి ఒక్కరికి ఆరు నెలల్లోనే 73 బ్లాక్ లను నిర్మించి, 1800 మందికి ఇండ్లను అప్పగిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
Also read: Allu Aravind: అల్లు అరవింద్‌కు ముగ్గురు కాదు.. నలుగురు కుమారులని తెలుసా?
ఆ ప్రాంతంలోని కొంతమంది ఇళ్ల నిర్మాణం చేపట్టకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని మంత్రి దృష్టికి రాగా, ఇబ్బందులు సృష్టిస్తే ప్రభుత్వం కఠినంగా వ్యవహరించక తప్పదని హెచ్చరించారు.
హైదరాబాద్ నగరంలో జీహెచ్ఎంసీ లోకల్ బాడీ ఎమ్మెల్సీ స్థానం ఎన్నిక సందర్భంగా సన్న బియ్యం పంపిణీ ప్రక్రియ చేపట్టలేకపోయామని, ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే పంపిణీ ప్రక్రియ చేపట్టామని, సన్న బియ్యం లబ్ధిదారు ఇండ్లలో తాము కూడా భోజనం చేసినట్లు మంత్రి వివరించారు.
అంగన్ వాడీ కేంద్రాల్లో కూలీలు, బీపీఎల్ కుటుంబాల పిల్లలకు అల్పాహారం ఇచ్చేలా కార్యక్రమం కూడా ప్రభుత్వ పరిశీలన ఉందని, కూలి పని చేసుకునే వారి పిల్లలకు అంగన్ వాడి కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందించనున్నట్లు, పిల్లల బాగోగులు కేంద్రాలే చూసుకుంటాయని మంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
తెలంగాణలో అర్హత కలిగిన ప్రతి యువతకు బాసటగా నిలవడమే ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశలో భాగంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఉద్యోగ, ఉపాధి రంగాల్లో అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 18 నెలలలో 60 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చామని వివరించారు. పెండింగ్ లో ఉన్న 26 వేల ఇళ్లను నిర్మించటంతో పాటు హైదరాబాద్ నగరంలో మున్ముందు అనేక ఇండ్లను నిర్మించే బాధ్యత ప్రభుత్వం తీసుకుందన్నారు.
Also read: Mlc Kavitha: జాగృతి కన్వీనర్ల నియామకం.. ప్రకటించిన కవిత!
హైదరాబాద్ లో ఉన్న వారికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలంటే స్థలాలు లేకపోవడంతో రెండు పడకల గదుల ఇళ్లకు ప్రాధాన్యత పెరిగిందని మంత్రి పేర్కొన్నారు. పేదల పక్షాన అండగా నిలబడాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని నిర్లక్ష్యంగా వ్యవహరించే వారి పట్ల కఠినంగానే వ్యవహరిస్తామని మంత్రి హెచ్చరించారు. బోజగుట్ట లో శాంతి భద్రతల సమస్య లేకుండా సమస్యను పరిష్కారించటంతో పాటు పాటు పేదలను ఆదుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.
అర్హత గల పేదలు అందరికీ కొత్తగా రేషన్ కార్డులు అందిస్తుందని అలాగే యూనిట్ల సంఖ్య పెంచనున్నట్లు ఆయన తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఒక విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టి తెలంగాణ ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేస్తుందన్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500 కే గ్యాస్ సిలెండర్ తో పాటు ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.