Hydra: తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ : కాలుష్యం, పర్యావరణ సమతుల్యత దెబ్బతినడం వంటి ఇతరత్రా కారణాలతో చిన్నపాటి వర్షాలకే నగరం అతలాకుతలం కావల్సిన దుస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో వర్షాకాలం వరద ముప్పు తప్పించడానికి తీసుకోవాల్సిన చర్యలపై హైడ్రా కసరత్తు ప్రారంభించింది. మూసీనది సరిహద్దు గుర్తింపు, ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న నాలా నెట్‌వర్క్‌తో పాటు వెడల్పుల నిర్థారణ అనే అంశంపై హైడ్రా ఓ సదస్సును నిర్వహించింది. మూసీ సుందరీకరణ ప్రాజెక్టుతో ఎలాంటి సంబంధం హైడ్రాకు లేనప్పటికీ మూసీ ఆక్రమణలపై హైడ్రాకు అందుతున్న ఫిర్యాదుల నేపథ్యంలో అసలు ఆ నది సరిహద్దుల నిర్ధారణ ఎలా చేపట్టాలనే విషయంపై హైడ్రా దృష్టి సారించింది.
చెరువుల ఫుల్ ట్యాంక్ లెవెల్ (ఎఫ్‌టీఎల్)ను గుర్తించిన విధంగానే మూసీ నది ఎంఎఫ్‌ఎల్(మాగ్జిమమ్ ఫ్లడ్ లెవెల్)ను గుర్తించేందుకు గ్రామ, రెవెన్యూ రికార్డులను దృష్టిలో పెట్టుకుని సరిహద్దులు నిర్ధారించాలని కొంతమంది సూచించారు. మూసీ పరివాహక ప్రాంతం హైడ్రాలజీ నివేధికలు, ఎన్‌ఆర్‌ఎస్‌సీ శాటిలైట్ ఇమేజీలు, సర్వే ఆఫ్ ఇండియా రికార్దులను కూడా పరిశీలించి, మూసీ హద్దులను నిర్ధారించి నిర్మాణాలు జరగకుండా చూడాలని మరి కొందరు నిపుణలు సదస్సులో హైడ్రాకు సూచించారు. నగరంలో 1908, 1954, 2000, 2008 సంవత్సరాల్లో కురిసిన భారీ వర్షాలు, అప్పటి పరిణామాలను చర్చించి మూసీ నదీ పరివాహక ప్రాంతంలో ఎక్కడా ఆటంకాల్లేకుండా చూడాలన్న సూచనలు, సలహాలను కూడా మరికొందరు అందించారు.
Also Read: YS Jagan: ప్చ్.. సొంత జిల్లాలో పరువు పోగొట్టుకున్న వైఎస్ జగన్!
నాలాల్లో ప్రవాహానికి ఆటంకం లేకుండా
నగరంలో నాలాలు కుంచించుకుపోకుండా చూడాలని పలువురు సదస్సులో హైడ్రాకు సూచించారు. జీహెచ్ఎంసీ పరిధిలో 940 ప్రాంతాల్లో కల్వర్టులున్నాయని, అక్కడ చెత్త పేరుకుపోవడంతో వర్షపు నీరు సాధారణంగా ప్రవహించకుండా అడ్డంకులు ఏర్పడినట్లు మరి కొందరు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పలు చోట్ల నాలాల లింకు కట్ అయ్యందని, దానిని పునరుద్ధరించాలన్నారు. కొన్నిచోట్ల కుంచించుకుపోయాయని, అక్కడ నిర్మాణాలకు ఎలాంటి ముప్పు లేకుండా, కుదిరితే విస్తరణ లేదంటే మళ్లింపు పనులు చేపట్టాలని కొందరు నిపుణలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. నగరభివృద్ధికి ప్రణాళికలు రూపొందించినప్పడు రహదారుల వెడల్పు విషయంలో ఎలాంటి ఆలోచన చేస్తున్నామో నాలాల నిర్మాణంలో కూడా అదే పాటించాలని పలువురు సూచించారు. నాలాల తీరుతెన్నులపై సమగ్ర సర్వే చేసి సరైన ప్రణాళికలు సూచించాలని పలువురు పేర్కొన్నారు.
Also Read: Hari Hara Veera Mallu: అధికారిక ప్రకటన వచ్చేసింది.. ఇక సర్దుకోండమ్మా!