GHMC: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఔత్సాహిక క్రీడారులను ప్రోత్సహించేందుకు జీహెచ్ఎంసీ స్పెషల్ గా స్పోర్ట్స్ వింగ్ ను ఏర్పాటు చేసి పలు క్రీడా మైదానాలు, ఓపెన్ జిమ్స్, 135 మాడ్రన్ జిమ్స్ ను కూడా ఏర్పాటు చేసింది. కానీ గడిచిన కొద్ది సంవత్సరాల నుంచి జీహెచ్ఎంసీ పరిధిలోని పార్కులు, రోడ్ల పక్కన, బస్ స్టాప్ లకు సమీపంలో ఏర్పాటు చేసిన 132 ఓపెన్ జిమ్స్, ఒక్కో మున్సిపల్ డివిజన్ కు ఒక చొప్పున ఏర్పాటు చేయాలన్న సంకల్పంతో గ్రేటర్ వ్యాప్తంగా నెలకొల్పిన 135 మాడ్రన్ జిమ్స్ తో పాటు 23 స్పోర్ట్స్ కాంప్లెక్సులు స్పోర్ట్స్ వింగ్ పరిధిలో కాకుండా ఇంజనీరింగ్ విభాగం ఆధీనంలో ఉన్నట్లు గుర్తించిన కమిషనర్ ఆర్. వి. కర్ణన్ వీటిని ఇంజనీరింగ్ విభాగం నుంచి తప్పించి, స్పోర్ట్స్ విభాగం పరిధిలోకి తీసుకురావాలని క్రీడల విభాగానికి ఆదేశాలిచ్చినట్లు సమాచారం.
2022 నుంచి ఇంజనీరింగ్ వింగ్ ఆధీనంలో ఉన్న ఈ ఓపెన్ జిమ్స్, మాడ్రన్ జిమ్స్, స్పోర్ట్స్ కాంప్లెక్సుల నిర్వహణ అధ్వాన్నంగా మారటంతో కమిషనర్ పరిశీలనలో తేలినట్లు సమాచారం. ముఖ్యంగా క్రీడల పట్ల ఇంజనీరింగ్ విభాగానికి అవగాహన ఉంటుందా? వారు ఎలా మెయింటనెన్స్ చేస్తారంటూ కమిషనర్ కర్ణన్ అధికారులతో వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఈ రకంగా ఏర్పాటు చేసిన ఓపెన్స్ జిమ్స్, మాడ్రన్ జిమ్స్ లలో ఎక్కువ శాతం జిమ్స్ లోని సామాగ్రి మూలన పడేసి ఉన్నట్లు, ఎల్బీనగర్ జోన్ లో తుప్పు పడి ఉన్నట్లు కమిషనర్ గుర్తించి, ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీనికి తోడు గ్రేటర్ లోని 30 సర్కిళ్లలో ఉన్న 912 క్రీడా మైదానాల పనితీరు, అక్కడ నిర్వహిస్తున్న క్రీడాంశాల శిక్షణ వంటి అంశాలపై కూడా కమిషనర్ నివేదికలను కోరినట్లు తెలిసింది.
Also Read: Star choreographer: నా భర్త ” గే ” అంటూ.. నమ్మలేని నిజాలు బయట పెట్టిన ఆ స్టార్ నటి!
క్రీడామైదానాల లీజుపై కమిషనర్ నజర్
ఇప్పటి వరకు జీహెచ్ఎంసీకి చెందిన క్రీడా మైదానాల లీజుపై కూడా కమిషనర్ ఆరా తీసినట్లు సమాచారం. ఇప్పటి వరకు లీజుకిచ్చిన మూడు క్రీడా మైదానాల తీరు, అక్కడ శిక్షణనిస్తున్న అంశాలతో పాటు లీజు ఛార్జీల చెల్లింపు వంటి అంశాలతో పాటు కొత్తగా లీజుకు ఇవ్వాల్సిన క్రీడా మైదానాలపై కూడా కమిషనర్ ఆర్. వి. కర్ణన్ ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు సమాచారం. జీహెచ్ఎంసీ నిబంధనల ప్రకారం ఏటా రూ.25 వేల వరకు అద్దె చెల్లిస్తూ ఏడాది పాటు లీజుకిచ్చే పవర్ కమిషనర్ కు ఉంది. అలాగే మూడేళ్ల లీజు కాలంతో పాటు ఏటా రూ.25 వేలకు మంచి అద్దె చెల్లించే క్రీడా మైదానాలను లీజుకు ఇవ్వాలంటే స్టాండింగ్ కమిటీ ఆమోదం తీసుకోల్సి ఉంటుంది. ప్రస్తుతం కొందరు వ్యక్తులు, సంస్థలు పలు క్రీడా మైదానాలను లీజుకు అడుగుతూ కమిషనర్ కు దరఖాస్తులు పెట్టుకున్న నేపథ్యంలో ఆ మైదానాల జాబితాను త్వరలో జరగనున్న స్టాండింగ్ కమిటీ ముందుంచాలని కమిషనర్ నిర్ణయించినట్లు సమాచారం.
Also Read: Alekhya Chitti Pickles: రూట్ మార్చిన అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య.. సెలబ్రిటీలతో చట్టాపట్టాలు