Khammam Commissionerate: పశువుల అక్రమ రవాణాను అరికట్టడానికి ఖమ్మం కమిషనరేట్ పరిధిలోని జిల్లా, రాష్ట్రాల సరిహద్దులో ఏడు చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ పోలీస్ కమిషనర్ సునీల్ దత్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ 24×7 నిరంతర పర్యవేక్షణలో ఉండే విధంగా జిల్లా, రాష్ట్రాల సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక చెక్ పోస్టులలో పోలీసు, పశుసంవర్ధక శాఖ సిబ్బందితో షిఫ్ట్ ల వారిగా సమన్వయంతో పనిచేస్తాయన్నారు. పశువులను అక్రమంగా తరలిస్తే కేసులు నమోదు చేస్తారని తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం ముందస్తు చర్యలలో భాగంగా పశువుల రవాణా విషయంలో వివాదాలు తలెత్తకుండా ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ముఖ్యంగా జంతువుల అక్రమ రవాణా, గోవధ విషయంలో నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పదని హెచ్చరించారు. ప్రధానంగా బక్రీద్ పండుగ సందర్భంగా పశువుల రవాణా విషయంలో అవసరమైన అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని, చట్టవిరుద్ధంగా ఆవులు, దూడలను రవాణా చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు ఆదేశించారు. పశువులను రవాణాచేసే ప్రతి వాహనానికి తగు నిర్థారిత ప్రమాణిక పత్రాలు (వాలిడ్ డాక్యుమెంట్స్) ఉండాలని స్పష్టం చేశారు.
Also Read: KTR on CM Revanth: పదివేల కోట్ల స్కాం.. రేవంత్ రెడ్డికి శిక్ష తప్పదు.. కేటీఆర్ హెచ్చరిక!
సరిహద్దు రాష్ట్రాల నుండి రవాణా అయ్యే పశువుల విషయంలోనూ నియమ, నిబంధనలను క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు. సరైన పత్రాలు వారి వెంట ఉన్నాయనే విషయాన్ని పరిశీలించి అనుమతించాలని, అక్రమ రవాణా చేస్తే చర్యలు తీసుకోవాలని చెప్పారు. పండుగల సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో సామాజిక మాధ్యమాల ద్వారా మత సామరస్యానికి భంగం కలిగించే విధంగా విద్వేషాలు, రెచ్చగొట్టే, అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు మీడియా మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
అదేవిధంగా మతపెద్దలతో శాంతి సమీక్షా సమావేశాలు నిర్వహించి, భద్రతా పరంగా ఎలాంటి సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటామని తెలిపారు. పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా, మత సామరస్యంతో జరుపుకునేలా అవసరమైన చోట్ల ముందస్తుగా పటిష్టమైన పోలీసు బందోబస్తు, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అక్రమ రవాణా నియంత్రించేందుకు నిఘా విభాగం అప్రమత్తంగా వుంటుందని, చెక్ పోస్టుల తనిఖీలే కాకుండా జిల్లా కేంద్రంలో సైతం ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తారని అన్నారు. ఎవరైనా అక్రమ రవాణా చేస్తూ పట్టుబడితే వారి వాహనాలు సీజ్ చేస్తారని అన్నారు.
సరిహద్దు చెక్ పోస్టులు
పాలడుగు (వైరా), భస్వాపూరం క్రాస్ రోడ్డు (కొణిజర్ల ), హనుమాన్ తండా (కల్లూరు ), వెంకటగిరి క్రాస్ రోడ్డు (ఖమ్మం రూరల్), సుబ్లేడ్ క్రాస్ రోడ్డు (తిరుమలాయపాలెం ), పాలేరు సింగరేణిపల్లి ప్లాజా (కూసుమంచి), వల్లభి (ముదిగొండ )లలో చెక్పోస్టులను ఏర్పాటు చేసినట్లు సిపి సునీల్ దత్ వివరించారు.
Also Read: Hyderabad Fire Accident: సిద్దిఅంబర్ గోల్ మసీదు ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం..!