GHMC: రాష్ట్రంలోని అత్యధిక జనాభాకు అభివృద్దితో పాటు అత్యవసర సేవలందించే జీహెచ్ఎంసీలో కార్మిక చట్టాలు అమలవుతున్నాయా? అన్న ప్రశ్నకు లేదు? అన్న సమాధానమే విన్పిస్తుంది. పన్ను వసూలు, నిర్మాణ అనుమతుల జారీ, నిబంధనల ప్రకారం ఎలాంటి డీవియేషన్స్ లేకుండా నిర్మించినా అక్యుపెన్సీ సర్టిఫికేట్ జారీ చేసేందుకు లంచాలు డిమాండ్ చేసే జీహెచ్ఎంసీలో వేలాది మంది కార్మికులు ఔట్ సోర్స్, కాంట్రాక్టు ప్రాతిపదికన పని చేస్తున్నా, కనీస కార్మిక చట్టాలు అమలు కావటం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జీహెచ్ఎంసీలో ఔట్ సోర్స్, కాంట్రాక్టు, గ్రూప్ ల ప్రాతిపదికన మొత్తం 28 వేల మంది విధులు నిర్వహిస్తున్నా, వీరిలో దాదాపు 20 వేల మందికి ఒక్క క్యాజువల్ లీవ్ లేకుండా పని చేస్తున్నట్లు సమాచారం. 650 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కల్గిన జీహెచ్ఎంసీలోని దాదాపు 9 వేల కిలోమీటర్ల పొడువున ఉన్న బీటీ, సీసీ రోడ్లను ప్రతి రోజు ఊడ్చేందుకు శానిటేషన్ విభాగంలో 18 వేల మంది కార్మికులుండగా, వీరిలో దాదాపు 15 వేల పై చిలుకు స్వీపర్లు మహిళలే.
Also read: Tamannaah Bhatia: సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న తమన్నా.. ఫోటోలు వైరల్.. ఇది నిజమేనా?
వీరికి వారం మొత్తం గైర్హాజరు లేకుండా పని చేస్తే తప్పా, వీక్ ఆఫ్ అమలు కావటం లేదు. వీరి అటెండెన్స్ లో పారదర్శకత కోసం వీరికి ఫేషియల్ రికగ్నేషన్ సిస్టమ్ (ఎఫ్ఆర్ఎస్)ను అమలు చేస్తున్నారు. క్షేత్ర స్థాయిలో వీందరి పని తీరు పర్యవేక్షణ, అటెండెన్స్ సేకరణ కోసం సుమారు 960 మంది శానిటరీ ఫీల్డు అసిస్టెంట్ (ఎస్ఎఫ్ఏ)లు విధులు నిర్వహిస్తున్నారు. వీరికి కూడా క్యాజువల్ లీవ్ లేకుండానే విధులు నిర్వహిస్తున్నట్లు తెలిసింది.
వీరితో పాటు దోమల నివారణ కోసం ఏర్పాటు చేసిన ఎంటమాలజీ విభాగంలో దాదాపు 2200 మంది ఎంటమాలజీ ఫీల్డు అసిస్టెంట్లు, ఎంటమాలజీ పీల్డు వర్కర్లుగా విధులు నిర్వహిస్తున్నారు. వీరికి కూడా ఒక్క క్యాజువల్ లీవ్ అమలు కావటం లేదు. అంతంతమాత్రం జీతాలకు తన ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న ఈ కార్మికులకు నెలకు ఒక్కటైనా క్యాజువల్ లీవ్ అమలు చేయటంలో అధికారులు ఏ మాత్రం చొరవ చూపటం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం థర్డ్ పార్టీ ద్వారా విధులు నిర్వహిస్తున్న కంప్యూటర్ ఆపరేటర్లకు మాత్రమే ప్రస్తుతం నెలకు ఓ క్యాజువల్ లీవ్ అమల్లో ఉన్నట్లు సమాచారం.
ఎందుకీ వివక్ష
జీహెచ్ఎంసీలో ప్రస్తుతం పర్మినెంట్, ఔట్ సోర్స్, కాంట్రాక్టు, గ్రూప్ ప్రాతిపదికన దాదాపు 28 వేల మంది వివిధ రకాల విభాగాల్లో విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో పర్మినెంట్ ఉద్యోగులు నాలుగు వేలకు పై చిలుకు కాగా, మిగిలిన వారంతా ఔట్ సోర్స్, కాంట్రాక్టు, గ్రూప్ ల ప్రాతిపదికన పని చేస్తున్నారు.
అదే పర్మినెంట్ ఉద్యోగుల్లో మహిళా ఉద్యోగులకు క్యాజువల్ లీవ్, ఇతర సెలవులతో పాటు ప్రసవానికి సంబంధించిన 180 రోజుల మెటర్నిటీ లీవ్ లు అమలు చేస్తుండగా, అతి తక్కువ జీతాలకు రూడ్లపై ఉదయాన్నే దుమ్మూ, ధూళి పీల్చుతూ, అర్థరాత్రి వేళ నడి రోడ్డుపై స్వీపింగ్ విధులు నిర్వహిస్తున్న మహిళా కార్మికులకు కనీసం నెలకోరోజైనా క్యాజువల్ లీవ్ అమలు చేయకపోవటం ముమ్మాటికీ వివక్షేనంటూ ఉద్యోగ, కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి.
లీవ్ కోసం పదేళ్ల పోరాటం
జీహెచ్ఎంసీలో ఔట్ సోర్స్ కార్మికులుగా విధులు నిర్వహిస్తున్న వారికి నెలకోరోజు క్యాజువల్ లీవ్ అమలు చేయాలంటూ పదేళ్ల నుంచి భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్) పోరాటం చేస్తూనే ఉంది. 2014లో ఎస్ఎఫ్ఏలు, ఎంటమాలజీ ఔట్ సోర్స్ సిబ్బందికి నెలకు ఒక రోజు క్యాజువల్ లీవ్ అమలు చేయాలంటూ కార్మిక శాఖ నుంచి మంజూరీ పొందినా, అధికారులు అమలు చేయటంలో నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్నట్లు విమర్శలున్నాయి.
Samantha: ఈ ఫొటో చూస్తుంటే.. సమంత లైఫ్‌లోనూ ‘శుభం’ జరగబోతున్నట్టే ఉంది కదా!
పదేళ్ల క్రితం చేసిన మంజూరీ కుదరదని అధికారులు తేల్చి చెప్పటంతో బీఎంఎస్ యూనియన్ తాజాగా ఇదే సంవత్సరం మరోసారి కార్మిక శాఖ నుంచి క్యాజువల్ లీవ్ అమలు చేసుకొచ్చింది. ఈ ఆదేశాలపై శానిటేషన్ అదనపు కమిషనర్ ఎస్ఎఫ్ఏలకు క్యాజువల్ లీవ్ అమలు చేయాలని ఆదేశాలిచ్చినా, అమలు చేయకుండా బుట్టదాఖలు చేసినట్లు సమాచారం.