Bangladesh Ex President: బంగ్లాదేశ్ రాజకీయాలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మాజీ ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina) నేతృత్వంలోని అవామీ లీగ్ (Awami League) ప్రభుత్వం పతనమయ్యాక ఆ పార్టీ నాయకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో హత్య కేసు ఆరోపణలు ఎదుర్కొంటున్న బంగ్లాదేశ్ మాజీ అధ్యక్షుడు మహ్మద్ అబ్దుల్ హమీద్ (Mohammad Abdul Hamid) దేశం విడిచి పారిపోయారన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. ఆయన తెల్లవారుజామున 3 గంటల సమయంలో థాయ్‌లాండ్ విమానం ఎక్కినట్లు సమాచారం అందడంతో తాత్కాలిక ప్రభుత్వం దీనిపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించింది.
అప్పుడు ప్రధాని.. ఇప్పుడు అధ్యక్షుడు
గత వారం ఢాకా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 81 ఏళ్ల అబ్దుల్ హమీద్ థాయ్ ఎయిర్‌వేస్ విమానంలో ప్రయాణించినట్లు బంగ్లాదేశ్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఆయన వెంట సోదరుడు, బావ కూడా ఉన్నట్లు సమాచారం. తెల్లవారుజామున 3 గంటల సమయంలో హమీద్ లుంగీ ధరించి విమానాశ్రయానికి వచ్చినట్లుగా ఉన్న దృశ్యాలు కూడా బయటకు వచ్చాయి. కాగా ప్రజల తిరుగుబాటు నేపథ్యంలో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని హసీనా భారత్ కు వచ్చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె భారత్ లోనే ఉంటోంది. ఇప్పుడు మాజీ అధ్యక్షుడు కూడా దేశం విడిచి వెళ్లిపోవడం ప్రపంచ దేశాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
హత్య కేసు ఎందుకుంటే?
బంగ్లాదేశ్ లోని కిషోర్ గంజ్ సదర్ పోలీసు స్టేషన్ లో జనవరి 14న హత్య కేసు నమోదైంది. అందులో బంగ్లాదేశ్ మాజీ అధ్యక్షుడు అబ్దుల్ హమీద్ నిందితుడిగా ఉన్నాడు. అతడితో పాటు మాజీ ప్రధాని షేక్ హసీనా కుటుంబ సభ్యులు షేక్ రెహానా, సజీబ్ వాజెద్ జాయ్, సైమా వాజెద్ పుతుల్ కూడా సహా నిందితులుగా ఉన్నట్లు బంగ్లాదేశ్ కు చెందిన ఢాకా ట్రిబ్యూన్ మీడియా సంస్థ పేర్కొంది. అయితే దీనిపై ముహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వం విద్యా సలహాదారు సీఆర్ అబ్రార్ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసిందని వార్తలు వచ్చాయి.
Also Read: AP Liquor Scam: లిక్కర్ స్కామ్‌లో గోవిందప్ప అరెస్ట్.. వైసీపీలో టెన్షన్
పారిపోయారా? చికిత్స కోసం వెళ్లారా?
అయితే బంగ్లాదేశ్ మాజీ అధ్యక్షుడు అబ్దుల్ హమీద్ దేశం విడిచి పారిపోలేదని ఆయన మద్దతుదారులు స్పష్టం చేస్తున్నారు. అబ్దుల్ హమీద్.. కుటుంబ సభ్యులతో కలిసి వైద్య చికిత్స కోసం థాయిలాండ్ వెళ్లారని చెబుతున్నారు. కానీ ఆయన రాజకీయ ప్రత్యర్థులు మాత్రం విచారణ నుంచి తప్పించుకోవడానికి పారిపోయారని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడుతున్నారు. కాగా అబ్దుల్ హమీద్ 2013-2023 మధ్య రెండు పర్యాయాలు బంగ్లాదేశ్ అధ్యక్షుడిగా వ్యవహరించారు. 2024లో బంగ్లాలో పెద్ద ఎత్తున జరిగిన ఆందోళన తర్వాత ఆయన తన పదవిని కోల్పోయారు.