Shamshabad: ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor) కొనసాగుతున్నది. పాక్ (Pakistan) దుశ్చర్యలపై మూడోరోజు కూడా భారత అధికారులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరించారు. సరిహద్దుల్లో కాల్పులు, డ్రోన్లు, క్షిపణులతో చేసిన పాక్ చర్యలను ప్రపంచానికి తెలియజేశారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశంలోని మిగిలిన రాష్ట్రాల్లో హై అలర్ట్ కొనసాగుతున్నది. ఇలాంటి సమయంలో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు రావడం చర్చనీయాంశమైంది.
శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు
శుక్రవారం సాయంత్రం శంషాబాద్ (Shamshabad) ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపులు వచ్చాయి. గుర్తు తెలియని వ్యక్తి మెయిల్ పంపించి, విమానాశ్రయంలో బాంబు పెట్టానని పేర్కొన్నాడు. వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. ఎయిర్ పోర్టు మొత్తాన్ని జల్లెడ పట్టారు. అంతా క్షుణ్ణంగా పరిశీలించారు. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా మిస్ వరల్డ్ పోటీలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ముందు నుంచీ భద్రత పెంచారు. ఇప్పటికే ఆ ప్రాంతం సీఐఎస్ఎఫ్ బలగాల ఆధీనంలో ఉన్నది. 24 గంటలపాటు డేగ కళ్లతో వారు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ప్రయాణికులను కూడా తనిఖీలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో కలకలం రేగింది.
Read Also- Operation Sindoor: సిందూర్ 3.0.. పాక్ డ్రోన్లు, ఫైటెర్ జెట్స్ స్మాష్.. సైన్యం వెల్లడి
మిస్ వరల్డ్ పోటీలు ఉంటాయా?
యుద్ధ వాతావరణం నేపథ్యంలో హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ 2025 (Miss World 2025) పోటీలు జరుగుతాయా లేదా? అనేది సస్పెన్స్‌గా మారింది. షెడ్యూల్ ప్రకారం అధికారులు అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. పోటీ దారులు ఇప్పటికే చాలామంది చేరుకోగా, శుక్రవారం 2024 మిస్ వరల్డ్ క్రిస్టినా పిజ్కోవా(చెక్ రిపబ్లిక్) రాగా, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం స్వాగతం పలికారు. మిస్ వరల్డ్ పోటీదారులు బస చేస్తున్న హోటల్ దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు. అయితే, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పోటీలు పెద్ద సవాలుగా మారినట్టు సమాచారం. కేంద్రం అభిప్రాయం తీసుకుని ముందుకు వెళ్లాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తున్నది.
శాంతి భద్రలతపై కీలక సమావేశం
మరోవైపు, రాష్ట్రంలో శాంతి భద్రతలపై అంబేద్కర్ సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో కీలక సమావేశం జరుగుతున్నది. మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ఇందులో పాల్గొన్నారు. అలాగే, సీఎస్ రామకృష్ణ రావు, డీజీపీ జితేందర్, మూడు కమిషనరేట్ల సీపీలు, ఇతర అధికారులు హాజరయ్యారు. మిస్ వరల్డ్ ఈవెంట్ శనివారం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. సమావేశం అనంతరం ప్రభుత్వం కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నది.
మిస్ వరల్డ్ పోటీలకు ప్రత్యేక ఏర్పాట్లు
మిస్ వరల్డ్ పోటీల కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. దాదాపు 116 దేశాల నుంచి కంటెస్టెంట్లు, వారి వెంట మీడియా ప్రతినిధులు, వివిధ రంగాల ప్రముఖులు ఇందులో పాల్గొనబోతున్నారు. ఈ పోటీల్లో మన కట్టు, బోట్టు భాష, సంసృతి, సంప్రాదాయంతో పాటు మన చరిత్ర, కట్టడాలు, పర్యాటకం విశ్వవ్యాప్తం అయ్యేలా ప్రణాళికలు రచించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అందరి కళ్లు తెలంగాణవైపే ఉన్నాయి. శనివారం గచ్చిబౌలి స్టేడియంలో మిస్ వరల్డ్ పోటీలను ప్రారంభమవుతాయి. దాదాపు 1500 మంది కళాకారులతో కళా ప్రదర్శనలు ఇవ్వనున్నారు. తెలంగాణ సంస్కృతి తెలిసేలా జానపద కళాకృతులు డప్పు, డోలు, కొమ్మకోయ, గుస్సాడి, కోలాటంతో పాటు వివిధ రకాల సంప్రదాయ నృత్యాలు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలువనున్నాయి.
Read Also- Pawan Kalyan: అవ్వ అంతులేని అభిమానం.. పవన్ కళ్యాణ్ జీవితంలో మరిచిపోరేమో..