PG Medical Courses: హైదరాబాద్ తార్నాకలోని టీజీఎస్ఆర్టీసీ ఆసుపత్రిలో డిప్లొమేట్ ఆఫ్ నేషనల్ బోర్డ్ (డీఎన్‌బీ) పీజీ మెడికల్ కోర్సులకు అనుమతి వచ్చింది. 3 విభాగాల్లో ఏడు సీట్లను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్(ఎన్‌బీఈఎంఎస్) మంజూరు చేసింది. ఆర్టీసీ ఉద్యోగులకు మెరుగైన, నాణ్యమైన వైద్యం అందించేందుకు తమ ఆసుపత్రిలో పీజీ మెడికల్ కోర్సులకు అక్రిడిటేషన్ ఇవ్వాలని ఎన్‌బీఈఎంఎస్‌కు టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం కోరింది.
ఈ దరఖాస్తును సమగ్రంగా పరిశీలించిన ఎన్‌బీఈఎంఎస్.. జనరల్ మెడిసిన్ 3 సీట్లను, జనరల్ సర్జరీ 2 సీట్లను, ఆర్థోపెడిక్ సర్జరీ 2 సీట్లను మంజూరు చేసింది. 3ఏళ్ల పీజీ కోర్సులకు నీట్ ఆధారంగా, 2 ఏళ్ల డిప్లొమా కోర్సులకు డీఎన్‌బీ-పీడీసీఈటీ ద్వారా ప్రవేశాలు జరుగుతాయి. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఈ కోర్సులు ప్రారంభం కానున్నాయి. డీఎన్‌బీ పీజీ మెడికల్ కోర్సులకు అనుమతి లభించడంపై టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం సోమవారం హర్షం వ్యక్తం చేసింది.
Also Read: Ex MLA Putta Madhukar: కాళేశ్వరం పై అసత్య ప్రచారం బాధాకరం.. మాజీ ప్రజా ప్రతినిధులు!
ఈ డీఎన్‌బీ పీజీ కోర్సులకు అనుమతి లభించడంతో ఆసుపత్రిలో వైద్య సేవలు మరింతగా బలోపేతమవుతాయని సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కోర్సుల వల్ల నాణ్యమైన వైద్యులు ఆసుపత్రిలో ప్రాక్టిస్ చేస్తారని, ఇది ఆర్టీసీ ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొన్నారు. ఉద్యోగులకు మెరుగైన వైద్యసేవలను అందించి సంపూర్ణ ఆరోగ్య ఆర్టీసీగా మార్చేందుకు యాజమాన్యం కృతనిశ్చయంతో ఉందని వివరించారు.
కోర్సులకు అనుమతి తీసుకురావడంలో కీలకపాత్ర పోషించిన వారిని బస్ భవన్ లో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ శ్రీనివాస్, మాజీ ఓఎస్‌డీ డాక్టర్ సైది రెడ్డి, డాక్టర్లు సుస్మిత, ప్రమోద్ కుమార్, ప్రదీప్ కుమార్, రాజ్ కుమార్, ఈడీ మునిశేఖర్, సీపీఎం ఉషాదేవి, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శైలజామూర్తి, తదితరులు పాల్గొన్నారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు