Hyderabad City: ఇతర ప్రాంతాల నుంచి తరలివెళ్లి మెట్రోనగరాల్లో జీవించడం అంత తేలిక కాదు. అద్దె కష్టాల నుంచి అక్కడ ఉపాధి అవకాశాల లభ్యత రూపంలో పెనుసవాళ్లు ఎదురవుతుంటాయి. వాటిని ఎదుర్కోలేకుంటే తట్టాబుట్టా సర్దుకొని ఇంటికి పోవాల్సి ఉంటుంది. అందుకే, మెట్రోనగరాల్లో కెరీర్‌ను అన్వేషించే వ్యక్తులు లేదా కంపెనీలు ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంటుంది. అయితే, దేశంలోని మిగతా నగరాలకు భిన్నంగా మన భాగ్యనగరం హైదరాబాద్ (Hyderabad) అన్ని వర్గాలవారూ జీవించడానికి అత్యంత అనువైన నగరంగా మారిపోయింది. ఐటీ ఉద్యోగుల నుంచి పెట్టుబడిదారుల వరకు అన్ని రంగాలవారినీ రారమ్మంటూ అక్కున చేర్చుకుంటోంది. గ్లోబల్ టెక్ దిగ్గజ కంపెనీలు మాత్రమే కాకుండా, ఔత్సాహిక వ్యవస్థాపకులు, ప్రపంచస్థాయి వ్యాపార సంస్థలు సైతం హైదరాబాద్ వైపే మొగ్గుచూపుతున్నాయి. మొత్తంగా అన్ని వర్గాలకు ఒక ‘బెస్ట్ డెస్టినేషన్ సిటీ’గా భాగ్యనగర ఖ్యాతి పెరిగిపోతోంది. ప్రపంచస్థాయిలో అత్యద్భుత మౌలిక సౌకర్యాలు, గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ల (జీసీసీ), అత్యున్నతస్థాయి డిజిటల్ సౌకర్యాలు, రాష్ట్ర ప్రభుత్వం రూపొందిస్తున్న చక్కటి విధానాలు, ఇవన్నీ హైదరాబాద్ నగర ఆకర్షణను పెంచుతున్నాయి. గత దశాబ్దకాలంలో ఎంతో పురోగతి సాధించిన హైదరాబాద్ నగరం, ఈ వేగాన్ని చూస్తుంటే, త్వరలోనే ఇండియన్ సిలికాన్ వ్యాలీగా పిలుచుకునే బెంగళూరు సిటీని కూడా అధిగమించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి, ‘మెర్సర్ గ్లోబల్ ర్యాంకింగ్స్’ ప్రకారం, జీవించడానికి అత్యంత అనుకూలమైన నగరంగా వరుసగా ఏడో ఏడాది కూడా హైదరాబాద్ నగరం నిలువడానికి కారణాలు ఏంటో ఒకసారి పరిశీలిద్దాం.
ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు
హైదరాబాద్ నగరంలో మౌలిక సదుపాయాలు ప్రస్తుతం ప్రపంచస్థాయిలో ఉన్నాయి. నగరంలోని ఐటీ కారిడార్ ప్రాంతాలైనా గచ్చిబౌలి లేదా హైటెక్ సిటీకి వెళ్లి చూస్తే, ఆ ప్రాంతాల్లో కనిపించే ఆకాశహర్మ్యాలు, మౌలిక సదుపాయాలు సింగపూర్‌లో ఉన్నామా? లేక, టోక్యో నగరంలో ఉన్నామా? అనే ఫీలింగ్‌ను కలిగిస్తాయి. ఇదేదో హైదరాబాగ్ నగరాన్ని పొగిడే ప్రయత్నమని భావించకండి. హైదరాబాద్ నగరం నిజంగానే ఆ స్థాయిలో మారిపోయింది. విశాలమైన రోడ్లు, స్కైవేలు, మెట్రో వంటి ఆధునిక రవాణా వ్యవస్థలు, కేవలం టెక్ జోన్ కోసమే సైబరాబాద్, ఇతర మౌలిక సదుపాయాలు ఒకరేంజ్‌లో అభివృద్ధి చెందాయి. మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్, యాపిల్, మెటా వంటి గ్లోబల్ కంపెనీలు అమెరికాకు వెలుపల హైదరాబాద్‌లోనే తమ అతిపెద్ద క్యాంపస్‌లను ఏర్పాటు చేశాయంటే ఇక్కడ పరిస్థితులు ఎంతసానుకూలంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మరెన్నో కంపెనీలు కూడా ఇక్కడ కొలువయ్యాయి.
Also Read FM symbol in Railway: రైల్వే ట్రాక్ పక్కనే ఉండే ‘ఎఫ్ఎం’ గుర్తు గురించి తెలుసా?
ఉద్యోగుల లభ్యత
ఆవిష్కరణలకు అడ్డాగా మారిన హైదరాబాద్‌లో ఉద్యోగుల లభ్యత ఒక సానుకూల అంశంగా కనిపిస్తోంది. ఇంకా చెప్పాలంటే హైదరాబాద్ ప్రజలే నగరానికి ఒక సానుకూల అంశమని నిపుణులు చెబుతున్నారు. అవకాశాలు, నాణ్యతతో కూడిన జీవనాన్ని గడిపే అవకాశం ఉండడంతో టెకీలు ఇక్కడ పెద్ద సంఖ్యలో లభ్యమవుతున్నారు. టాప్ ఇంజనీరింగ్ కాలేజీలు, రీసెర్చ్ ఇన్‌స్టిట్యూషన్లు ఉండడంతో అత్యున్నత నైపుణ్యం కలిగిన ఉద్యోగులు కూడా కంపెనీలక లభిస్తున్నారు. ఇతర నగరాలతో పోల్చితే హైదరాబాద్‌లో ఖర్చులు తక్కువగా ఉండడం కూడా ఒక కారణంగా ఉంది. రియల్ ఎస్టేట్ ధరలు కూడా ఇతర నగరాలతో పోల్చితే హైదరాబాద్ 10 శాతం తక్కువగా కనిపిస్తున్నాయి.
హైదరాబాద్‌లో అద్దెలు తక్కువ
బెంగళూరు నగరంతో పోల్చితే హైదరాబాద్‌లో అద్దెలు కాస్త చౌకగా ఉంటాయి. బెంగళూరులో అంతకంతకూ పెరిగిపోతున్నప్పటికీ, హైదరాబాద్‌లో మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. కమర్షియల్ రియల్ ఎస్టేట్ ధరలు కూడా కాస్త తక్కువగా కనిపిస్తున్నాయి. యువ ఉద్యోగుల ఏ రకమైన నివాసం కోరుకున్నా నగరంలో లభిస్తోంది. కోరుకుంటే గేటెడ్ కమ్యూనిటీల నుంచి విల్లాల వరకు అన్ని ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.
ఆకర్షణీయ ప్రభుత్వ విధానాలు
తెలంగాణ ప్రభుత్వం పారిశ్రామిక ఫ్రెండ్ విధానాలను తీసుకొస్తుండడం హైదరాబాద్ నగరాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతోంది. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ అన్ని కేటగిరీల్లోనూ హైదరాబాద్ నగర అభివృద్ధికి బాటలు వేస్తోంది. టెక్ హబ్‌లపరంగా చూస్తే ఇప్పటికే నగరంలో పెద్ద సంఖ్యలో నెలకొల్పిన గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ల (జీసీసీ) ఫలితంగా పెద్ద సంఖ్యంలో ఉద్యోగాల సృష్టి జరుగుతోంది. విదేశాలు కూడా వెళ్లకుండానే ఆ స్థాయి ఉద్యోగాలను ఇక్కడ పొందుతున్నారు.
ఆవిష్కరణలకు కేంద్ర బిందువు
పాత టెక్ హబ్‌ల మాదిరిగా కాకుండా ప్రస్తుతం హైదరాబాద్‌లో బయోటెక్, ఫార్మా, సెమీకండక్టర్లు, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్, ఏఐ, ఫిన్‌టెక్ ఇలా అన్ని రంగాలలోనూ ఆవిష్కరణలు కొనసాగుతున్నాయి. క్వాల్‌కామ్, ఉబర్, ఏఎండీ, నోవార్టిస్ వంటి ప్రపంచ స్థాయి సంస్థలు ఇక్కడ కంపెనీలను ఏర్పాటు చేయడమే కాకుండా ఐపీని (ఇంటిలెక్చువల్ ప్రొపర్టీ) నిర్మిస్తున్నాయి. సువిశాలమైన ఆఫీసులు, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు మొదలుకొని, తక్కువ నిర్వహణా వ్యయాలు, నైపుణ్యాలు కలిగివున్న ఉద్యోగులు అందరూ అన్ని అంశాలూ సానుకూలంగా మారి హైదరాబాద్‌కు ఒక ఆకర్షణీయంగా మారింది.
Also Read India Vs Pakistan: సరిహద్దులో పాకిస్థాన్ బరితెగింపు