India Vs Pakistan: సరిహద్దులో పాకిస్థాన్ బరితెగింపు
Image Credit (Image Source AI)
జాతీయం

India Vs Pakistan: సరిహద్దులో పాకిస్థాన్ బరితెగింపు

India Vs Pakistan: న్యూఢిల్లీ, స్వేచ్ఛ: జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రదాడి, అనంతరం భారత్ విధించిన ఆంక్షల తర్వాత సరిహద్దులో పాకిస్థాన్ బరితెగింపు చర్యలకు పాల్పడుతోంది. పదేపదే కాల్పులకు పాల్పడుతూ, కవ్వింపు చర్యల ద్వారా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తోంది. పాకిస్థాన్ ఆర్మీ ఈ వారం రోజుల వ్యవధిలోనే ఏకంగా 17 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఇండియన్ ఆర్మీ వర్గాలు తెలిపాయి. జమ్మూ కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి ఈ రెచ్చగొట్టే చర్యలకు దిగిందని వివరించింది. కుప్వారా, ఉరీ, అఖ్నూర్ సెక్టార్లలో కాల్పులకు పాల్పడినట్టు తెలిపింది. ఈ దాడులను ఇండియన్ ఆర్మీ కూడా తగిన రీతిలో తిప్పికొడుతోందని తెలిపింది. వరుసగా ఏడవ రోజు రాత్రి కూడా కాల్పులు కొనసాగించినట్టు వివరించాయి. వేర్వేరు ప్రాంతాల్లో పాక్ ఆర్మీ రేంజర్లు కాల్పులు జరిపినట్టు వివరించారు. పాకిస్థాన్ కవ్వింపు చర్యలతో సరిహద్దులో పరిస్థితులు మరింత ఉద్రిక్తకరంగా మారాయని ఓ అధికారి ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘ ఏప్రిల్ 30 నుంచి మే 1 రాత్రి సమయంలో పాకిస్థాన్ ఆర్మీ పోస్టులు చిన్నసైజు ఆయుధాలతో కాల్పులు జరుపుతూ రెచ్చగొడుతున్నారు. కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ కశ్మీర్‌లోని కుప్వారా, ఉరీ, అఖ్నార్ ప్రాంతాలలోని నియంత్రణ రేఖ వెంబడి ఈ కాల్పులు జరుగుతాయి. ఇండియన్ ఆర్మీ ధీటుగా ఎదుర్కొంటోంది’’ అని జమ్మూ కశ్మీర్‌లోని ఉత్తర కమాండ్ రక్షణ ప్రతినిధి, లెఫ్ట్‌నెంట్ కల్నల్ సునీల్ భర్త్వాల్ వెల్లడించారు. సరిహద్దులో కాల్పుల విరమణపై భారత్, పాకిస్థాన్‌కు చెందిన డైరెక్టరేట్ జనరల్స్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజీఎంవో) సంప్రదింపులు జరుపుతున్న సమయంలో కూడా కాల్పులు కొనసాగుతున్నట్టు ఆర్మీ వర్గాలు చెబుతున్నాయి.

Also Read Pahalgam terrorist attack: తీవ్ర ఉద్రిక్తత వేళ.. అమెరికా నుంచి భారత్‌కు ఫోన్

పహల్గామ్‌ చేరుకున్న ఎన్ఐఏ డైరెక్టర్ జనరల్
ఏకంగా 26 మంది అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన పహల్గామ్ ఉగ్రదాడి ఘటనా స్థలాన్ని జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) డైరెక్టర్ జనరల్ సదానంద్ డేటే గురువారం పరిశీలించారు. ఈ మేరకు గురువారం అక్కడికి వెళ్లారు.ఆయనతో పాటు పలువురు సీనియర్ ఎన్ఐఏ అధికారులు కూడా ఉన్నారు. ఉగ్రవాదులు మారణకాండ జరిపిన తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఉగ్రవాదులు ఎటువైపుగా పారిపోయారు, కౌంటర్ ఆపరేషన్ చేయలేకపోవడానికి కారణాలను ఆయన విశ్లేషించారు.

అరేబియా సముద్రంలో నేవీ గస్తీ ముమ్మరం
ఏదైనా అసాధారణ పరిస్థితులు ఏర్పడి యుద్ధం చేయాల్సి వస్తే, అందుకు సన్నద్ధంగా ఉండేందుకు అరేబియా సముద్రంలో భారత నావికాదళం విన్యాసాలు నిర్వహిస్తోంది. గస్తీని కూడా ముమ్మరం చేసింది. గుజరాత్ తీరంలోని అంతర్జాతీయ సముద్ర సరిహద్దుకు సమీపంలోని ప్రాంతాలలో భారత కోస్ట్ గార్డ్ నౌకలను నేవీ అధికారులు మోహరించారు. కీలకమైన ఈ ప్రాంతంలో భారత నావికాదళం ప్రాబల్యాన్ని క్రమక్రమంగా పెంచుతోంది.

అమృత్‌సర్‌లో ఉగ్రకుట్ర భగ్నం
పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో భారీ ఉగ్రకుట్రను పంజాబ్ పోలీసుల సహకారంతో బీఎస్‌ఎఫ్ దళాలు భగ్నం చేశాయి. అమృత్‌సర్ జిల్లాలోని భరోపాల్ గ్రామం సమీపంలో పెద్ద సంఖ్యలో ఆయుధాలు, మందుగుండు సామగ్రి, గ్రెనేడ్‌లను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. దాడికి పాల్పడేందుకు సిద్ధం చేసుకున్న పేలుడు పదార్థాలను గుర్తించడంతో పెనుప్రమాదం తప్పింది.

Also Read AI Usage In India: అగ్రస్థానానికి భారత్.. వెనుకబడిన అమెరికా, యూకే

Just In

01

Overdraft vs Personal Loan: ఓవర్‌డ్రాఫ్ట్ vs పర్సనల్ లోన్.. మీ డబ్బు అవసరంలో ఏది సరైన ఎంపిక?

MLC Kavitha: గులాబీ నాయకులకు కవిత గుబులు.. ఎవరి అవినీతిని బయట పడుతుందో అని కీలక నేతల్లో టెన్షన్!

Akhanda2: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రశంసలు పొందిన బాలయ్య ‘అఖండ 2 తాండవం’..

Gold Rates: ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయంటే?

Chiranjeevi Movie: ‘మనశంకరవరప్రసాద్ గారు’ షూటింగ్ పూర్తి.. ఎమోషన్ అయిన దర్శకుడు..