AI Usage In India: కంప్యూటర్ కోడింగ్‌ల నుంచి విద్యార్థులు, వైద్యుల సందేహాలను నివృత్తి చేయడం వరకు నేటి టెక్ యుగంలో ఏఐ (Artificial Intelligence) వినియోగం అన్ని రంగాలకూ విస్తరించింది. విద్యార్థులు, సైబర్ సెక్యూరిటీ నిపుణులతో పాటు వ్యవసాయం, ఎంటర్‌టైన్‌మెంట్, మీడియా, మార్కెటింగ్, అడ్వర్టైజ్‌మెంట్, ఆటోమోటివ్, మాన్యుఫ్యాక్చరింగ్, రిటైల్, ఈ-కామర్స్, ఫైనాన్స్, హెల్త్‌కేర్.. ఇలా ఒకటా రెండా దాదాపు అన్ని రంగాలకు చెందినవారూ ఏఐ టూల్స్‌ను తమ రోజువారీ కార్యకలాపాల్లో విరివిగా ఉపయోగించడం సర్వసాధారణంగా మారిపోయింది. ఇంకా చెప్పాలంటే ఏఐ ఒక నిశ్శబ్ద విప్లవాన్ని సృష్టిస్తోంది. ఆలోచనలను, సృజనాత్మకతలను కొత్త పుంతలు తొక్కిస్తోంది. ఏ రంగానికి చెందినవారైనా సరే తమ ప్రశ్నను అడిగితే చాలు చిటికలో సమాధానాలు వచ్చేస్తున్నాయి. అంతుచిక్కని ఎన్నో సమస్యలకు పరిష్కారాలు కూడా లభిస్తున్నాయి. మరి, ఏఐ టూల్స్ వినియోగంలో ఏ దేశాలు ముందున్నాయో ఒక తాజా సర్వే తేల్చిచెప్పింది. అవేంటే చూద్దాం..
ఏఐ టూల్స్ వినియోగంలో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. అభివృద్ధి చెందిన పాశ్చాత్త్యా దేశాలైన అమెరికా, యూకేలను కూడా అధిగమించిందని ‘స్టాటిస్టా కన్స్యూమర్ ఇన్‌సైట్స్’ (Statista Consumer Insights) సర్వే వెల్లడించింది. భారతీయుల్లో ఇంచుమించుగా 41 శాతం మంది తమ రోజువారీ కార్యకలాపాల్లో ఏఐ టూల్స్‌ను ఉపయోగిస్తున్నట్టు సర్వేలో తేలింది. భారత్ తర్వాత బ్రెజిల్ రెండవ స్థానంలో నిలిచింది. బ్రెజిల్ జనాభాలో దాదాపు 33 శాతం మంది ప్రతిరోజూ ఏఐ టూల్స్‌ను ఉపయోగిస్తున్నారు. మూడో స్థానంలో మెక్సికో (24 శాతం), నాలుగో స్థానంలో జర్మనీ(21 శాతం) నిలిచింది. ఇక, అగ్రరాజ్యం అమెరికా 5వ స్థానంలో నిలవగా, ఈ దేశంలోని జనాభాలో 20 శాతం మంది ఏఐ టెక్నాలజీగా విరివిగా వాడుతున్నారు.
మరిన్ని ఆసక్తికర విషయాలు ఏంటంటే..
ఈ సర్వేను గతేడాది ఆగస్టు నుంచి సెప్టెంబర్ వరకు నిర్వహించినట్టు స్టాటిస్టా కన్స్యూమర్ ఇన్‌సైట్స్ వెల్లడించింది. ప్రతి దేశంలో 18-64 ఏళ్ల వయస్సు గల 1,250 మందిని ప్రశ్నించినట్టు పేర్కొంది. ఇక, 2024 నాటికి ఏఐతో ముడిపడిన వ్యాపార విలువ 3.7 ట్రిలియన్ డాలర్లకు పెరిగిందని ‘గార్టెనర్ రిపోర్ట్’ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 8.1 బిలియన్ గంటల కార్మికుల శ్రమను తగ్గించిందని లెక్కగట్టింది. రాబోయే 2 నుంచి 5 ఏళ్లలో ఏఐ టూల్స్ వినియోగించే భారతీయుల సంఖ్య 67 శాతానికి చేరే అవకాశం ఉంటుందని ‘ఎల్సెవియర్స్ ఇన్‌సైట్స్’ రిపోర్ట్ అంచనా వేసింది. ‘ఇండియా పెర్స్పెక్టివ్’ నివేదిక ప్రకారం, భారతదేశంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో ఏఐ ప్రధానంగా ఆధునీకరణ పునర్నిర్మాణం జరుగుతోందని పేర్కొంది. ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకునే విషయంలో ప్రభుత్వం, బ్యాంకింగ్, టెలికం రంగాలు ముందంజలో ఉన్నాయి. ఈ రంగాలలో ముందుగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. డేటా భాగస్వామ్యం, వినియోగదారులకు సేవలు అందించేందుకు ఈ సేవలను వినియోగిస్తున్నారు. అయితే, ఈ సేవలు దీర్ఘకాలికంగా కొనసాగాలంటే మాత్రం భద్రతపై భరోసా ఉండాలని, దీర్ఘకాలంపాటు స్థిరంగా కొనసాగుతాయని నిర్ధారించే నిర్మాణాత్మక మార్పులు అవసరమని ‘ఇండియా పర్స్పెక్టివ్’ నివేదిక పేర్కొంది. ప్రస్తుత పరిస్థితి ఏవిధంగా ఉన్నా, యూజర్లకు వేగవంతమైన, సమర్థవంత పరిష్కారాలను అందించేందుకు భారతీయ వ్యాపార సంస్థలు చిన్నస్థాయి, మల్టీమోడల్ ఏఐ మోడల్స్‌ను వేగంగా అందిపుచ్చుకుంటున్నాయని ‘డెలాయిట్’ నివేదిక తెలిపింది.