Pahalgam terrorist attack: న్యూఢిల్లీ, స్వేచ్ఛ: పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తకర పరిస్థితులు నెలకొన్నాయి. ఉగ్రపన్నాగానికి పాల్పడ్డ ముష్కర మూకకు గట్టి బుద్ధి చెప్పేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఇప్పటికే సాయుధ త్రివిధ దళాలకు ‘ఆపరేషనల్’ స్వేచ్ఛ ఇచ్చింది. టార్గెట్, టైమింగ్, ఏ విధంగా దాడి చేసే అంశాలను బలగాల ఇష్టానికే ప్రధాని మోదీ వదిలేశారు. భారత్ ఏ క్షణంలో దాడి చేస్తుందోనన్న భయంతో పాకిస్థాన్ కలవరపడుతోంది. ప్రతిఘటించేందుకుగానూ సరిహద్దులో ఇప్పటికే బలగాలను కూడా పెద్ద సంఖ్యలో మోహరించింది. యుద్ధ విమానాలను కూడా సిద్ధం చేసుకుంది. ఈ పరిణామాలు అంతర్జాతీయ సమాజాన్ని ఆందోళనకు గురిచేస్తున్న క్రమంలో, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో శాంతి సందేశం అందించారు. భారత్, పాకిస్థాన్ ప్రభుత్వాలతో గురువారం ఆయన ఫోన్‌లో మాట్లాడారు. ఉద్రిక్త పరిస్థితులకు దూరంగా ఉండాలని ఇరుదేశాలను కోరారు. భారత విదేశాంగమంత్రి జైశంకర్‌తో రూబియో మాట్లాడుతూ, యుద్ధ పరిస్థితుల నుంచి వెనక్కి తగ్గాలని సూచించారు.
Also Read-AI Usage In India: అగ్రస్థానానికి భారత్.. వెనుకబడిన అమెరికా, యూకే
శాంతించండి.. భారత్‌కు అమెరికా సూచన
26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన హేయమైన పహల్గామ్ ఉగ్రవాద దాడి ఘటనపై ఆయన విచారం వ్యక్తం చేశారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారతదేశానికి సహకరించేందుకు అమెరికా కట్టుబడి ఉందని రూబియో హామీ ఇచ్చారు. అయితే, పాకిస్థాన్‌తో ఉద్రిక్త పరిస్థితులను తగ్గించేందుకు భారత్ కృషి చేయాలని కోరారు. దక్షిణాసియాలో శాంతి, భద్రతల కోసం పాకిస్థాన్‌తో కలిసి పనిచేయాలని రూబియో సూచించినట్టు అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ బ్రూస్ ప్రకటించారు. అమెరికా విదేశాంగమంత్రి రూబియోతో ఫోన్ కాల్ సంభాషణపై భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కూడా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి గురించి మార్కో రూబియోతో చర్చించానంటూ వెల్లడించారు. ఉగ్రదాడి బాధ్యులను చట్టం ముందు నిలబెట్టాల్సిందేనని ఈ సందర్భంగా స్పష్టంగా చెప్పినట్టు జైశంకర్ పేర్కొన్నారు. ‘‘పహల్గామ్ ఉగ్రవాద దాడి గురించి అమెరికా విదేశాంగమంత్రితో చర్చించాను. ఉగ్రదాడికి పాల్పడ్డవారు, మద్దతుదారులు, కుట్రదారులను చట్టం ముందు నిలబెట్టాలని అన్నాను” అని జైశంకర్ వివరించారు.
Also Read- CM Revanth Reddy: నన్ను నమ్మండి.. వారి విషపు చూపుల్లో చిక్కుకోవద్దు.. సీఎం రేవంత్
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ ఆర్మీ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోంది. జమ్మూ కాశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ పదేపదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి విపరీతంగా కాల్పులకు పాల్పడుతోంది. గురువారం (మే 1) నాడైతే ఏకంగా చిన్నస్థాయి ఆయుధాలను కూడా ఉపయోగించి కుప్వారా, ఉరీ, అఖ్నూర్ సెక్టార్లలోని సరిహద్దుల్లో కాల్పులకు పాల్పడినట్టు ఇండియన్ ఆర్మీ వర్గాలు చెప్పాయి. ఈ నేపథ్యంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో శాంతింపజేసే ప్రయత్నం చేశారు. కాగా, పహల్గామ్ ఉగ్రఘటన సరిహద్దు ఉగ్రవాదం ఫలితంగా జరిగినట్టు గుర్తించిన కేంద్రం, ఇప్పటికే పాకిస్థాన్‌పై పలు కీలకమైన చర్యలు తీసుకుంది. సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. అట్టారి-వాఘా సరిహద్దు మార్గాన్ని మూసివేసింది. న్యూఢిల్లీలోని పాకిస్థాన్ హై కమిషన్‌లో సలహాదార్లను తొలగించడంతో పాటు అక్కడ పనిచేసే సిబ్బందిని సైతం కుదించింది. ఇప్పటికే పాకిస్థాన్ విమానాలు భారత్ మీదుగా ప్రయాణించకుండా ఎయిర్‌స్పేస్‌ను కూడా బంద్ చేసింది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.