HC on Group 1: తెలంగాణలో గ్రూప్ 1 నియామకాలను తాత్కాలికంగా నిలిపివేయాలంటూ హైకోర్ట్ సింగిల్ బెంచ్ (High Court Single Bench) ఇటీవల ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించిన విద్యార్థుల్లో గందరగోళం ఏర్పండింది. ఈ క్రమంలో టీజీపీఎస్సీ (TGPSC) కీలక నిర్ణయం తీసుకుంది. సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై హైకోర్ట్ చీఫ్ జస్టిస్ తో కూడిన ధర్మాసనం రేపు విచారణ చేపట్టనుంది.
అంతకుముందు గ్రూప్ 1 పరీక్షల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ పలువురు అభ్యర్థులు హైకోర్ట్ లో పిటిషన్ దాఖలు చేశారు. మెయిన్స్ పరీక్షల మూల్యంకనం సరిగ్గా జరగలేదని కోర్టుకు విన్నవించారు. పరీక్షా కేంద్రాల కేటాయింపులోనూ అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. దీనిపై గతవారం విచారణ చేపట్టిన జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ధర్మాసనం.. గ్రూప్ 1 నియామకాలపై స్టే ఇచ్చారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేయాలంటూ మద్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. దీనిని సవాలు చేస్తూ టీజీపీఎస్సీ.. సీజే ధర్మాసనానికి అపీల్ చేసింది.
Also Read: Mahesh Kumar on KCR: కేసీఆర్.. దమ్ముందా? ఛాలెంజ్ అంటూ టీపీసీసీ చీఫ్ సవాల్!
ప్రభుత్వ శాఖల్లోని 563 పోస్టుల భర్తీకి గాను గతేడాది అక్టోబర్ 21 నుంచి 27 తేదీల మధ్య గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరిగాయి. ఈ ఎగ్జామ్స్ కు 21,093 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది మార్చి 10న గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలను టీజీపీఎస్సీ (TGPSC) విడుదల చేసింది. ఆ మర్నాడే గ్రూప్ 2 రిజల్ట్స్, అలాగే మార్చి 14న గ్రూప్ 3 ఫలితాలను బోర్డు విడుదల చేయడం గమనార్హం.