Pakistan Man In Hyderabad: అసలే మన దేశానికి పాకిస్తాన్ కు ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఇలాంటి సమయంలో హైదరాబాద్ కు చెందిన ఓ యువతిని పాకిస్తాన్ యువకుడు పెళ్లాడడం ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే ఈ కథకు హైదరాబాద్ పోలీసులు శుభం కార్డు వేసినట్లు సమాచారం.
కాశ్మీర్ ఉగ్రదాడిలో 28 మంది మన దేశ పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనతో యావత్ భారత్ రోదించింది. అయితే ఈ ఘటనకు పాల్పడిన పాకిస్తాన్ అంతు తేల్చాలని భారతీయులందరూ ముక్తకంఠంతో నినదిస్తున్నారు. దీనితో కేంద్రం కూడా సీరియస్ యాక్షన్ లోకి దిగింది. ఇప్పటికే పాకిస్తాన్ దిమ్మతిరిగేలా సింధు నదీ జలాలను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు దేశంలో ఉన్న పాకిస్తాన్ పౌరులు వారం రోజుల్లోగా దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది.
కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల యావత్ భారత్ హర్షించింది. దీనితో అన్ని రాష్ట్రాలలో ఎక్కడెక్కడ పాకిస్తాన్ పౌరులు ఉన్నారన్న కోణంలో ఇంటలిజెన్స్ అధికారులు దృష్టి సారించారు. అయితే తెలంగాణ, ఏపీలో పోలీసులు అలర్ట్ కాగా, విజయవాడ, హైదరాబాద్ లలో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ డిజిపి జితేందర్ ఓ హెచ్చరిక జారీ చేశారు. పాకిస్తాన్ పౌరులు హైదరాబాద్ లో ఉన్నట్లు తమకు సమాచారం ఉందని, వారు వెంటనే దేశం విడిచి వెళ్లాలని కీలక ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఏపీలో కూడా పాకిస్తాన్ పౌరుల ఏరివేత సాగుతోంది.
మన దేశ రక్షణకు సంబంధించిన అంశం కావడంతో పోలీసులు నిఘా పెంచారు. ఈ క్రమంలో హైదరాబాద్ లో ఓ ఘటన జరిగినట్లు సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారింది. హైదరాబాద్ కి చెందిన యువతిని పాకిస్తాన్ యువకుడు మహమ్మద్ ఫయాజ్ వివాహం చేసుకున్నాడు. ఆ యువతిని కలిసేందుకు పాక్ నుంచి నేపాల్ మీదుగా హైదరాబాద్కు ఫయాజ్ చేరుకున్నాడు. ఈ విషయాన్ని పసిగట్టిన హైదరాబాద్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
Also Read: Aghori RGV: ఆర్జీవీని కన్ఫ్యూజ్ చేసిన అఘోరీ.. ఇదెలా జరిగిందబ్బా!
అతడిని పూర్తి స్థాయిలో విచారిస్తున్నట్లు తెలుస్తోంది. అసలే ఇప్పుడు పాకిస్తాన్ అంటేనే మన రక్తం ఉడుకుతున్న వేళ, దొంగ దారిలో దేశంలోకి చొరబడం, అలాగే నేరుగా హైదరాబాద్ కు రావడంతో పోలీసులు అన్ని కోణాల్లో ఆ యువకుడిని విచారిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇదంతా సోషల్ మీడియాలో ప్రచారం అయినప్పటికీ, ఇందులో ఏ మేరకు వాస్తవం ఉందన్నది పోలీసుల నిర్ధారణతో వెల్లడి కావాల్సి ఉంది.