BJP on GHMC Elections: జీహెచ్ఎంసీ మేయర్ పీఠంపై బీజేపీ పార్టీ కన్నేసిందా? అన్న ప్రశ్నకు ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు అవుననే సమాధానం చెబుతున్నాయి. 2020లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 40కి పైగా సీట్లు గెలిచిన బీజేపీ హైదరాబాద్ నగరంలో మజ్లీస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు వ్యూహాం సిద్దం చేసుకున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే హైదరాబాద్ నగరవాసులను ఆకట్టుకునేందుకు జీహెచ్ఎంసీ లోకల్ బాడీ ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేసినట్లు చర్చ జరుగుతుంది.
వాస్తవానికి లోకల్ ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచునే స్థాయిలో బీజేపీకి ఓటర్ల సంఖ్య లేకపోయినా, బరిలో నిలవటం వెనకా ఇదే ఉద్దేశం ఉండవచ్చునన్న వాదనలు కూడా ఉన్నాయి. గత 2020 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా 48 సీట్లను బీజేపీ పార్టీ కైవసం చేసుకున్న సంగతి తెల్సిందే. వీరిలో ఇద్దరు కార్పొరేటర్లు మృతి చెందగా, మరో ఆరుగురు బీఆర్ఎస్, కాంగ్రేస్ పార్టీల్లో చేరటంతో ప్రస్తుతం బీజేపీకి జీహెచ్ఎంసీ కౌన్సిల్ లో మొత్తం 40 మంది కార్పొరేటర్లున్నారు. జీహెచ్ఎంసీ లోకల్ బాడీ ఎమ్మెల్సీ స్థానికి ఎపుడు ఎన్నికలొచ్చినా, అధికార పార్టీ, మజ్లీస్ పార్టీల అవగాహనతో ఎన్నిక ఏకగ్రీవయ్యేది.
సుమారు 22 ఏళ్ల నుంచి కొనసాగుతున్న ఈ ప్రక్రియకు ఫుల్ స్టాప్ పెట్టి, ఎన్నిక అంటే ఏకగ్రీవం కాదని, ఖచ్చితంగా పోలింగ్ ప్రక్రియ జరగాలన్న సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు, ఈ దిశగా ప్రజలు ఆలోచించి, చైతన్యవంతులను చేసేందుకే లోకల్ ఎమ్మెల్సీ స్థానంలో బీజేపీ అభ్యర్థిని నిలిపినట్లు చర్చ జరుగుతుంది. ఇదే విషయాన్ని ఎంఐఎం అభ్యర్థి మీర్జా రియాజ్ ఉల్ హాసన్ ఎఫెండి సైతం వ్యాఖ్యానించారు.
ఎన్నికలో ఓడినా..
బీజేపీ పార్టీకి జీహెచ్ఎంసీ కౌన్సిల్ లో 40 మంది కార్పొరేటర్లున్నా, హైదరాబాద్ రెవెన్యూ జిల్లా పరిధిలో లోకల్ బాడీ పరిధిలోకి వచ్చే 25 మందికి మాత్రమే ఓటింగ్ అవకాశం దక్కింది. పోలింగ్ లో వీరంతా మూకుమ్మడిగా అభ్యర్థి డాక్టర్ గౌతంరావుకు ఓటు వేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అపజయం పాలైనప్పటికీ, ఓడి, గెలిచినట్టయిందన్న చర్చ జరుగుతుంది. అనుకున్న కాన్పెస్ట్ ను ప్రజల్లోకి తీసుకెళ్లగలిగామని ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి అభ్యర్థి లేకుండా కేవలం మజ్లీస్ పార్టీ నుంచి ఒక అభ్యర్థి మాత్రమే నామినేషన్ సమర్పించటం, ఆ తర్వాత ఎన్నిక ఏకగ్రీవం అవుతూ రావటం పట్ల అసలు లోకల్ బాడీ ఎమ్మెల్సీ స్థానం అంటే ఏమిటీ? ఎన్నిక ప్రక్రియ ఏమిటీ? ఇందులో ఎవరెవరు ఓటర్లు అన్న కనీసం అవగాహన నగరవాసుల్లో చాలా మందికి లేదు. కానీ ఇపుడు జరిగిన లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియతో ఈ విషయం చాల మందికి తెలిసిపోయింది.
ఇందులో బీజేపీ కూడా పోటీ చేసిందన్న విషయం తెలియటంతో చాలా మంది నగరవాసులకు ఓటు హక్కు లేకపోయినా, బీజేపీ గెలవాలని ఆకాంక్షించారు. ఏకగ్రీవం కాకుండా పోలింగ్ జరగాలన్న విషయాన్ని బీజేపీ బరిలో నిలిచి, చాలా తేలికగా, జనంలోకి తీసుకెళ్లగలింది. ఇంతటితో ఆగని బీజేపీ ఇకపై ఏ ఎన్నిక జరిగినా, నిబంధనల ప్రకారం ముందుకెళ్లాలని, గెలుపోటములను పక్కనబెడితే బీజేపీ పోటీలో ఉండాల్సిందేనని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
కాస్త ముందుగానే..
జీహెచ్ఎంసీ కౌన్సిల్ పదవీ కాలం ఇంకా తొమ్మిది నెలల్లో ముగియనున్నందున జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కార్పొరేటర్లు, కార్పొరేటర్లు లేని చోట డివిజన్ స్థాయి నాయకులు కాస్త ముందునుంచే ప్రజల్లోకి వెళ్లాలని పార్టీ అధినాయకులు ఆదేశించినట్లు సమాచారం. హిందూత్వ ఎజెండాతో జీహెచ్ఎంసీ ఎన్నికలకు వెళ్లాలని ఇప్పటికే నిర్ణయించుకున్న కాషాయ పార్టీ ప్రస్తుతం జరిగిన లోకల్ ఎమ్మెల్సీ ఎన్నిక తీరు, పోలింగ్ జరిగిన విధానం, బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు ఉన్నా, ఓటింగ్ వెళ్లొద్దని ఆదేశించటం, పోలింగ్ రోజున కనీసం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వైపు వెళ్లొద్దని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రధానాస్త్రంగా సంధించాలని భావిస్తున్నట్లు సమాచారం.
దీనికి తోడు అధికార కాంగ్రేస్ పార్టీ ఎంఐఎంకు మద్దతిస్తూ, తనుకున్న 14 ఓట్లను ఎంఐఎం పార్టీ అభ్యర్థికి వెయించిన తీరును కూడా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగితే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బాగా కలిసొచ్చే అవకాశముందని కమలదళం భావిస్తున్నట్లు సమాచారం. మేయర్ పీఠమే లక్ష్యంగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ముందుకెళ్లాలని ఆ పార్టీ భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు