తెలంగాణ: Ranganath on Prajavani: ప్రజావాణిలో స్వీకరించిన ఫిర్యాదుల్లో వాస్తవమెంత ఉందన్న విషయాన్నిగుర్తించేందుకు హైడ్రా కమిషనర్ రంగనాధ్ ఫీల్డు విజిట్ నిర్వహించారు. మండుటెండలోనే ఆయన అధికారులతో కలిసి తన పర్యటనను కొనసాగించారు. పటాన్ చెరు ప్రాంతంలో ప్రణీత్ కౌంటీకి ఆనుకుని వెళ్తున్న నక్కవాగునాలా కబ్జాకు సంబంధించిన గత సోమవారం అందిన ఫిర్యాదును కమిషనర్ పరిశీలించారు. నాలా వెడల్పు బఫర్ జోన్ తో కలిసి 36 మీటర్లు ఉండాల్సి ఉండగా, సగం వరకు కబ్జా అయినట్లు ఆయన గుర్తించారు.
నిర్మాణ అనుమతులకు సంబంధించిన పత్రాలు సమర్పించాలని ఆక్రమణల యజమానులకు కమిషనర్ సూచించారు. నిబంధనల ప్రకారం నాలా వెడల్పు లేని పక్షంలో, ఆక్రమణలకు గురైనట్లు నిర్థారణ అయితే ఆక్రమణలన్నీ తొలగించాలని కమిషనర్ అధికారులకు అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు. మసీదు బండ ప్రాంతంలోని జంగంకుంట తనదిగా చెప్పుకుని కబ్జా చేస్తున్నారని అందిన ఫిర్యాదును సైతం కమిషనర్ ఫీల్డు లెవెల్ లో పరిశీలించారు.
దీంతో పాటు అమీన్ పూర్ కిష్టారెడ్డి పేట లోని ప్రభుత్వం భూమి కబ్జా జరుగుతున్నట్లు వచ్చిన ఫిర్యాదును కూడా కమిషనర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఇప్పటికే అక్కడ కొందరు ఇండ్లు కట్టుకుని నివసిస్తున్నట్లు గుర్తించిన కమిషనర్, ఎవరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇకపై కబ్జాలు కాకుండా చూస్తామని వ్యాఖ్యానించారు. హైడ్రా పేరిట ఎవరైనా అవకతవకలకు, అక్రమాలకు, వసూళ్లకు పాల్పడితే వెంటనే హైడ్రా దృష్టికి తీసుకురావాలని కమిషనర్ స్థానికులకు సూచించారు.
Also Read: Fake RS 500 Notes: కేంద్రం హెచ్చరిక.. ఫేక్ కరెన్సీ తెగ వచ్చేసిందట.. బీ అలర్ట్
ఆ తర్వాత కమిషనర్ గచ్చిబౌలి లోని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లే అవుట్ ను పరిశీలించారు. లే అవుట్ రహదారులు, పార్కులను మొత్తం చెరిపేసి,అక్కడ కన్వెన్షన్ల పేరిట వ్యాపారపరంగా వినియోగిస్తున్న విషయాన్ని పరిశీలించారు. నెక్నాంపూర్ లో హైటెన్షన్ విద్యుత్ తీగల కింద రోడ్డు కు అడ్డంగా ప్రహరీ నిర్మించి,దారిని బంద్ చేశారంటూ వచ్చిన ఫిర్యాదును కమిషనర్ పరిశీలించారు. నెక్నాంపూర్ లే అవుట్ పార్కులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాల కబ్జా చేశారన్న ఫిర్యాదును సైతం ఫీల్డు లెవెల్ లో ఆయన పరిశీలించారు.
గండిపేట మండలం నెక్నాంపూర్ సర్వే నెంబర్ 20 లో ప్రభుత్వ భూమి కబ్జాను పరిశీలించినానంతరం గండిపేట చెరువును సందర్శించారు. ఖానాపూర్, నాగులపల్లి నుంచి వచ్చిన మురుగు నీరు బుల్కాపూర్ నాలా ద్వారా గండిపేట చెరువులో కలుస్తుందనే ఫిర్యాదును కూడా పరిశీలించారు. పైన ఉన్న నివాసాలు, వాణిజ్య సముదాయాలు , రిసార్టుల నుంచి వచ్చే మురుగు నీరు గండిపేట చెరువులో కలవకుండా, నిర్మాణాలు చేపట్టి మురుగు నీటిని మళ్లించాలని ఆయన అధికారులను ఆదేశించారు.
Also Read: స్వేచ్ఛ E పేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/