Local body elections Mlc: జీహెచ్ఎంసీ లోకల్ బాడీ ఎమ్మెల్సీ స్థానానికి బుధవారం పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కార్పొరేటర్లు, ఎక్స్ అఫిషియో సభ్యుల కోసం వేర్వేరుగా ఏర్పాటు చేసిన రెండు పోలింగ్ బూత్ లలో ప్రజాప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. భారీ బందోబస్తు, జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం చుట్టుూ పోలీసులు కట్టుదిట్టంగా ఆంక్షలను అమలు చేస్తూ పోలింగ్ నిర్వహించారు.
ఉదయం ఎనిమిది గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ లో భాగంగా బీజేపీ ఎంపీలు కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్, డా. కే. లక్ష్మణ్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి లు తొలుత పోలింగ్ బూత్ నెంబర్-1 లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆ తర్వాత ఎంఐఎం హైదరాబాద్ ఎంపీ అసదుద్దిన్ ఓవైసీ, ఎమ్మెల్సీ బేగ్, ఎమ్మెల్యేలు అక్బరుద్దిన్ ఓవైసీ, మాజీద్ హుస్సేన్, కౌసర్ మోహియుద్దిన్, ముంతాజ్ ఖాన్, మిరాజ్ జాఫర్ హుస్సేన్, మహ్మద్ ముబిన్, అహ్మద్ బిన్ బిలాలాలు ఒకే సారి వరుసగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ప్రస్తుత లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, శ్రీగణేశ్ లతో పాటు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ , మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి లు తమ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ నెంబర్-2 లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తెలంగాణ జన సమితి ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Also read: Bangladeshis Arrested: జన్మ ధృవీకరణ నుంచి ఓటు హక్కు వరకు.. నకిలీ జీవితం ఎలా సాధ్యం?
మధ్యాహ్నాం కల్లా ఎంఐఎం పార్టీకి చెందిన కార్పొరేటర్లు, ఎక్స్ అఫిషియో సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జీహెచ్ఎంసీ పాలక మండలిలో అత్యధికంగా 49 ఓట్ల వరకు ఎంఐఎం పార్టీకి చెందిన ఓట్లు పోల్ కావటంతో మజ్లీస్ పార్టీ అభ్యర్థికి విజయం పట్ల కాన్పిడెన్స్ పెరిగింది. ఈ స్థానిక సంస్థ స్థానానికి బీజేపీ అభ్యర్ధిని బరిలో నిలిపినపుడు విముఖంగా వ్యవహారించిన గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే టి. రాజాసింగ్ పోలింగ్ బూత్ నెంబర్ 1లో మధ్యాహ్నాం రెండు గంటలకు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
పోలింగ్ సరళి
ఉదయం పది గంటల కల్లా 37.51 శాతం ఓట్లు నమోదయ్యాయి. మధ్యాహ్నాం పన్నెండు గంటల కల్లా సుమారు 77.68 శాతం ఓట్లు నమోదు కాగా, మధ్యాహ్నాం రెండు గంటల్లా 78.57 శాతం ఓట్లు పోలైనట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. మధ్యాహ్నాం రెండు నుంచి నాలుగు గంటల మధ్య ఓటింగ్ కోసం ఓటర్లెవ్వరూ రాకపోవటంతో నాలుగు గంటలకు పోలింగ్ ముగిసింది.
మధ్యాహ్నాం రెండింటి కల్లా బీఆర్ఎస్ పార్టీ మినహా మిగిలిన కాంగ్రేస్, బీజేపీ, ఎంఐఎం పార్టీకి చెందిన సుమారు 66 మంది కార్పొరేటర్లు, మరో 22 మంది ఆయా పార్టీలకు చెందిన ఎక్స్ అఫిషియో సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు ఓటింగ్ కు దూరంగా ఉంటారంటూ ప్రచారం జరిగినా, మధ్యాహ్నాం రెండున్నర గంటల తర్వాత పలువురు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వస్తున్నారంటూ ప్రచారం జరిగింది. కానీ ముందుగా ప్రకటించిన విధంగా ఓటింగ్ కోసం బీఆర్ఎస్ ఓటర్లెవరూ ముందుకు రాలేదు.
Also read: Harley Davidson Tariffs: భారతీయులకు ట్రంప్ గిఫ్ట్.. తక్కువ ధరకే ఖరీదైన బైక్స్.. భలే ఛాన్స్ లే!
ఎప్పటికపుడు పర్యవేక్షణ
ఎన్నికల పరిశీలకులు సురేంద్ర మోహన్ రిటర్నింగ్ అధికారితో కలిసి పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ సరళిని ఎప్పటికపుడు పర్యవేక్షించారు. పోలింగ్ ముగిసిన అనంతరం బ్యాలెట్ బాక్సులను రిసెప్షన్ సెంటర్ కు బందోబస్తుతో తీసుకువచ్చి పరిశీలనానంతరం జీహెచ్ఎంసీ ట్రెజరీ హాల్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూం లో భద్రపరిచారు. స్ట్రాంగ్ రూం వద్ద గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసారు. ఈ నెల 25న ఉదయం 8గంటలకు ఓట్ల లెక్కింపు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని ఫస్ట్ ఫ్లోర్ లోనున్న పన్వర్ హాల్ లో నిర్వహించనున్నట్లు జరుగుతుంది.
ప్రశాంతంగా ముగిసింది: రిటర్నింగ్ ఆఫీసర్ అనురాగ్ జయంతి
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి బుధవారం జరిగిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని ఎన్నికల రిటర్నింగ్ అధికారి అనురాగ్ జయంతి తెలిపారు. ఉదయం 8గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించగా, మధ్యాహ్నం 2 గంటల వరకే 78.57 శాతం ఓట్లు పోల్ అయ్యాయని తెలిపారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన రెండు పోలింగ్ కేంద్రాల్లో మొత్తం ఓటర్లు 112 మందిలో 88మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం 112 ఓటర్లలో ఎక్స్ అఫీషియో మెంబర్ 31 కాగా, అందులో 22 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.