MLC Local Body elections: హైదరాబాద్ లో పొలిటికల్ హీట్ అమాంతం పెరిగిపోయింది. లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలు (Local Body MLC Elections) బుధవారం జరగనున్న నేపథ్యంలో ఈసీతో పాటు నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ముమ్మర భద్రతా చర్యలు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే ఎన్నికల ఏర్పాట్లపై తాజాగా ఈసీ స్పందించింది. కీలక విషయాలను వెల్లడించింది.
ఎన్నికలకు సర్వం సిద్ధం
లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలు ఎలాంటి ఆటంకం లేకుండా సవ్యంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి అనురాగ్ జయంతి (Anurag Jayanthi) స్పష్టం చేశారు. జీహెచ్ ఎంసీ (GHMC)పరిధిలో స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులుగా ఉన్న 112 మంది ఓటర్లు.. ఒక స్థానానికి సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికలో ఓటు వేస్తారని పేర్కొన్నారు. ఇందుకోసం జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో రెండు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దాదాపు 500 మంది ఎలక్షన్ సిబ్బంది డ్యూటీలో పాల్గొంటారని తెలిపారు.
ట్రైనింగ్ పూర్తి
మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికను ఎలా నిర్వహించాలో సిబ్బందికి ఇప్పటికే ట్రైనింగ్ ఇచ్చినట్లు రిటర్నింగ్ అధికారి అనురాగ్ జయంతి స్పష్టం చేశారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనున్నట్లు మరోమారు స్ఫష్టం చేశారు. జీహెచ్ఎంసీ ఆఫీసులో మాత్రమే పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో కార్యాలయ పరిసరాల్లో 200 – 250 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. పోలింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందే చర్యలు తీసుకుంటున్నట్లు రిటర్నింగ్ అధికారి చెప్పారు.
రేపు వారికి సెలవు
జీహెచ్ఎంసీ పరిధిలో ఈ ఎమ్మెల్సీ ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఉద్యోగులకు (GHMC Employees) ఎన్నికల రిటర్నింగ్ అధికారి అనురాగ్ జయంతి గుడ్ న్యూస్ చెప్పారు. రేపు జీహెచ్ఎంసీ ఉద్యోగులకు సెలవును ప్రకటించారు. కాబట్టి ఉద్యోగులు ఎవరూ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. దీంతో జీహెచ్ఎంసీ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: UPSC CSE 2024 toppers: సివిల్స్ ఫలితాల్లో తెలుగువారి మార్క్.. మన టాపర్లు వీరే!
ఎన్నిక ఏకగ్రీవం!
బుధవారం జరగబోయే హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ స్థానం ఎన్నికకు అధికార కాంగ్రెస్ తో పాటు విపక్ష బీఆర్ఎస్ (BRS) దూరంగా ఉండనున్నట్లు ప్రకటించాయి. దీంతో ఎంఐఎం (MIM), బీజేపీ (BJP) అభ్యర్థుల మధ్య ప్రధాన పోటీ నెలకొని ఉంది. వాస్తవానికి ఓట్ల సంఖ్యాబలం పరంగా ఎంఐఎం చాలా స్ట్రాంగ్ గా ఉంది. దీంతో ఆ పార్టీ అభ్యర్థి ఎన్నిక ఏకగ్రీవం అవుతుందని అంతా భావించారు. అయితే సడెన్ గా పోటీలోకి వచ్చిన భాజపా.. ఎన్నికలను అనివార్యం చేసింది.