Revolutionary Dreamer, Founder Of People's War Group K.S
Editorial

KS: విప్లవ స్వాప్నికుడు, పీపుల్స్ వార్ గ్రూప్ వ్యవస్థాపకుడు కె.ఎస్..

Revolutionary Dreamer, Founder Of People’s War Group K.S: వ్యవస్థ మార్పు కోసం, సమ సమాజ స్థాపన కోసం తన జీవితాన్ని అంకితం చేసి పోరాడిన త్యాగశీలి, మార్గదర్శకుడు కొండపల్లి సీతారామయ్య. అలియాస్ కె.ఎస్. అనుచరులు ముద్దుగా ‘పెద్దాయన’ అని పిలిచేవారు. పీపుల్స్ వార్ గ్రూప్ వ్యవస్థాపకుడుగా, పేరున్న విప్లవ నేతగా నేడు ఆయన పేరు చాలామందికి తెలియక పోవచ్చు గానీ, 1980ల ప్రాంతంలో ఈ రెండక్షరాల పేరు యావత్తు దేశాన్నీ ప్రత్యేకించి తెలుగునేలను ఉర్రూతలూపింది. కె.ఎస్ కేకేస్తే గోల్కొండ ఘొల్లుమనేది. సచివాలయం దద్దరిల్లిందా అనే వాతావరణం ఉండేది.

కమ్యూనిస్టులకు పుట్టిల్లయిన కృష్ణా జిల్లా గుడివాడ రెవెన్యూ డివిజన్ నందివాడ మండలం లింగవరం కొండపల్లి సీతారామయ్య సొంతూరు. 1914లో జన్మించిన సీతారామయ్య పెరిగింది మాత్రం ఆ పక్కనున్న జొన్నపాడు గ్రామంలో. చిన్నతనంలోనే కమ్యూనిస్టుల ప్రభావంతో పెరిగి పెద్దయిన సీతారామయ్య ఆనాటి ప్రముఖ నాయకుడు చండ్ర రాజేశ్వరరావు ప్రభావంతో కమ్యూనిస్టు పార్టీలో చేరారు. చండ్ర రాజేశ్వరరావే ఆయనకి కోటేశ్వరమ్మకి పెళ్లి చేశారని చెబుతారు.చాలా చిన్నవయసులోనే ఆయన కమ్యూనిస్టు పార్టీ కృష్ణా జిల్లా శాఖకు కార్యదర్శిగా పని చేశారు. కమ్యూనిస్టుల సారథ్యంలో నడిచిన తెలంగాణ సాయుధ పోరాటంలోనూ ఆయన చురుగ్గానే పాల్గొన్నారు. సాయుధ పోరాటాన్ని విరమించిన తీరుపై భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేసిన వారిలో సీతారామయ్య కూడా ఒకరొకరు. ఆ తర్వాత కమ్యూనిస్టు పార్టీ 1964లో చీలిపోయింది.

Also Read: కాంగ్రెస్ బలోపేతమే రేవంత్ లక్ష్యం

ఆ చీలిక సమయంలో తీవ్ర నిరాశ నిస్పృహలకు గురైన సీతారామయ్య వరంగల్ వెళ్లి సెయింట్ గాబ్రియల్స్ హైస్కూలులో టీచర్‌గా పని చేశారు. ఆ సమయంలో సీపీఐ పార్టీ తెలంగాణ సాయుధ పోరాటాన్ని విరమించి, పాలక వర్గాలతో సామరస్య విధానాలు కొనసాగిస్తూ రివిజనిస్ట్ విధానాలు చేపట్టగా దానిని వ్యతిరేకించి సీపీఎం పార్టీ ఏర్పడగానే అందులో చేరి పనిచేశారు. కొద్దికాలంలోనే సీపీఎం సైతం అదే బాట పట్టటంతో సిపిఎంలోని విప్లవ కారుడైన కామ్రేడ్ చారుమజుందార్ నాయకత్వంలో 1969లో సీపీఐ(ఎంఎల్) పార్టీ ఏర్పడింది. మరో విప్లవనాయకుడైన కేజీ సత్యమూర్తితో కలిసి కె.యస్ అందులో చేరి రాష్ట్ర కమిటి నాయకుడుగా పని చేయటం, అనతి కాలంలోఆ పార్టీకే నాయకత్వం వహించడం చకచకా జరిగిపోయాయి.

నక్సల్ బరి ఉద్యమంపై నాటి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపటంతో సిపిఐ(యంయల్) కేంద్ర నాయకత్వంలోని కామ్రేడ్ చారుమజుందార్‌తో సహా కీలక నేతలు 1972లో అమరులయ్యారు. కేంద్ర కమిటి దెబ్బతినిపోవటంతో పార్టీ శ్రేణులు చెల్లా చెదురయ్యాయి. ఆ సమయంలో పార్టీలో సైద్ధాంతిక గందరగోళం పెరగి పార్టీ శ్రేణులు ఎక్కడికక్కడ పని చేయాల్సి వలసిన అనివార్య స్థితిలో పదుల సంఖ్యలో సిపిఐ(యంయల్ )పేరుతోనే అనేక నక్సలైట్ గ్రూప్‌లు ఏర్పడ్డాయి. ఈ స్థితిలో కామ్రేడ్ సీతరామయ్య నాయకత్వంలో కొండపల్లి గ్రూప్ పేరు కూడా ఏర్పడింది. ఆ తరువాత 1980లో సిపిఐ(యంయల్).. పీపుల్స్ వార్ పార్టీగా మారింది. కామ్రేడ్ చారుమజుందార్ అమరుడైన తర్వాత సుమారు రెండు దశాబ్దాల పాటు భారత విప్లవ కమ్యూనిస్టు సైద్ధాంతిక రాజకీయ నిర్మాణంలో సీతారామయ్య కీలక పాత్ర నిర్వహించారు. ఉద్యమ పునర్నిర్మాణంలో భాగంగా దెబ్బతిన్న ఆంధ్ర రాష్ట్ర కమిటీలోని నేతలతో మాట్లాడి, చీలికలను నివారించారు. తద్వారా శ్రీకాకుళ వర్గ పోరాట రాజకీయాలను ముందుకు తీసుకుపోయారు. నక్సల్బరీ, శ్రీకాకుళ పోరాటాల మీద నిర్బంధం పెరిగిన క్రమంలో వందలమంది అమరులయ్యారు. మరెందరో ఉద్యమం నుంచి తప్పుకున్నారు. కానీ, కె.ఎస్ తన సిద్ధాంత పటిమతో, విమర్శలను తిప్పికొట్టి, అనుమానాలను దూరం చేసి పార్టీ శ్రేణులను ఉత్తేజపరచి పార్టీని ముందుకు నడిపించారు.

Also Read: ఆకాశమంత స్ఫూర్తి.. అంబేద్కర్

విప్లవోద్యమం తాత్కాలిక వెనుకంజ గురి కావడానికి కారణమైన తప్పులను, సాధించిన విజయాలను విశ్లేషించి, తగిన గుణపాఠాలు నేర్చుకునేందుకు ‘సెల్ఫ్ క్రిటికల్ రిపోర్ట్’ పేరుతో సమీక్షించారు. ఈ ప్రయత్నం ఉద్యమపు పాజిటివ్ అంశాలను నిలబెట్టి, ప్రజలను, ప్రజాసంఘాలను సంఘటిత పరచింది. వరంగల్, కరీంనగర్ రైతాంగ ఉద్యమాలు ఆంధ్ర రాష్ట్రానికి, ఇతర రాష్ట్రాలకు విస్తరింపజేయడంలో ప్రజాపునాది కలిగిన మిలిటెంట్ పార్టీ నిర్మించడంలో కె.ఎస్ గొప్ప నిర్మాణ దక్షతను ప్రదర్శించారు. ఉత్తర తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించి పార్టీ మౌలిక పంథాను వివరిస్తూ, ఈ ఉద్యమానికి గెరిల్లా జోన్ దృక్పథాన్ని ఏర్పరచి, దీనిని దండకారణ్యానికి విస్తరింపజేశారు.

కమ్యూనిస్టు విప్లవం అంటే పీడిత వర్గాలతో మమేకం అవుతూ భూస్వామ్య పెట్టుబడిదారీ వర్గాలకు వ్యతిరేకంగా రాజీలేని వర్గ పోరాటాన్ని కొనసాగించటమేనని నిరూపించి, భారత కమ్యూనిస్టు నమూనాను ప్రపంంచ స్థాయిలో చర్చకు నిలిపిన ఘనత కామ్రేడ్ కొండపల్లి సీతారాయమ్యదే. దేశంలో వివిధ యంయల్ పార్టీలలో చీలికలు నిరంతరం జరుగుతున్నప్పటికీ పీపుల్స్ వార్ పార్టీలో అవి నామమాత్రంగానే జరిగాయి. అనేక విప్లవ సంస్థలు మావోయిస్టు పార్టీలో ఐక్యం కావడానికి విప్లవకారుల మధ్య ఐక్యతకు నాడు కె.ఎస్ రూపొందించిన మార్గదర్శకాలే ఆధారంగా నిలిచాయి. మనదేశంలోని కుల సమస్యను, జాతుల సమస్యను, పాలకుల ఫాసిజాన్ని, ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని, మితవాద అవకాశవాద రాజకీయాలకు వ్యతిరేకంగా, శత్రువుకు వ్యతిరేకంగా మిత్ర వర్గాలతో ఐక్య సంఘటన కట్టే విషయములో, పార్టీ నిర్మాణరంగంలో, ప్రజా సంఘాల నిర్మాణంలో, ప్రజా సాహిత్యం ప్రజా కలలను అభివృద్ధి చేయడంలో, గెరిల్లా జోన్స్ మిలిటరీ నిర్మాణాలు అభివృద్ధి చేయడంలో కామ్రేడ్ కొండపల్లి సేవలు ఎన్నటికీ మరువలేనివి. భారతదేశపు నిర్దిష్ట పరిస్థితులను మార్క్సిస్టు లెనినిస్టు దృక్పథంతో అర్థం చేసుకొని పార్టీకి అనేక సైద్ధాంతిక నిర్మాణాత్మక రచనలూ పెద్దాయన చేశారు.

Also Read: దక్షిణానికి భవిష్యత్ ఆశాకిరణం

3500 పేజీలకు పైగా ఉన్న ఆయన రచనలు క్రింది స్థాయి కేడర్‌కు సైతం సులభంగా అర్థమయ్యేలా, ఆకర్షించేలా, ఉద్యమకారుల అవగాహనను పెంచేలా ఉండటం విశేషం. రెండు దశాబ్దాల పాటు నాటి పీపుల్స్ వార్ పార్టీ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన కామ్రేడ్ కె యస్ పార్టీలో తలెత్తిన కొన్ని నిర్మాణ సమస్యలు, వృద్ధాప్యం, పార్కిన్‌సన్ వ్యాధితో ఉద్యమానికి దూరమవటం విషాదం. దాదాపు దశాబ్దకాలం పాటు అల్జీమర్స్ వ్యాధితో బాధపడి 2002 ఏప్రిల్ 12న ఆయన తన సుదీర్ఘ విప్లవ ప్రయాణాన్ని ముగించారు. భారత దేశ కమ్యునిస్ట్ విప్లవ ఉద్యమ చరిత్రలో కామ్రేడ్ కొండపల్లి సీతారామయ్యది ఎన్నటికీ నిలిచిపోతుంది. వినమ్రంగా విప్లవ జోహార్లు.

– జంపన్న( మార్క్సిస్ట్ లెనినిస్ట్ నాయకుడు)

Just In

01

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు