Congress revanth reddy news(Political news today telangana): దశాబ్దాల తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను నిజం చేయాలనే సంకల్పానికి కట్టుబడిన కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా భారీ మూల్యాన్ని చెల్లించుకుందనే చెప్పాలి. రాష్ట్ర విభజనకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ వరుసగా రెండుసార్లు అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉంది. కానీ, రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్‌లో తన రాజకీయ ఉనికిని కోల్పోయిందనే చెప్పాలి. తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ అప్పటి జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ చొరవతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిందనే అభిప్రాయం ఉన్నా ఆ సానుకూలతను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా ఉపయోగించుకోవటంలో విఫలం అవటం వలన తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీపై ప్రజలలో అభిమానం ఉన్నప్పటికీ ఒక దశాబ్దం పాటు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేకపోయింది. దీంతో ఎమ్మెల్యేలు, ఎంపీలు, కీలకమైన బలమైన నాయకులు కాంగ్రెస్‌ని వీడటం వలన ఒకరకంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలహీన పడిందనే చెప్పాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత జరిగిన 2 శాసనసభ ఎన్నికలలో, 2 లోక్‌సభ ఎన్నికలలో స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీకి దారుణమైన ఓటమి ఎదురై పార్టీ నిస్తేజంగా నిద్రాణంగా ఉన్న దశలో 2021లో ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు రేవంత్ రెడ్డి చేపట్టిన తర్వాత పార్టీ గమనం మారిందనే చెప్పాలి.
కాంగ్రెస్ పార్టీ వలసలతో కుదేలై లెజిస్లేటివ్ పార్టీ ఉనికి కోల్పోయి ఉన్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి 2 సంవత్సరాల కాలంలోనే కాంగ్రెస్ పార్టీకి కాయకల్ప చికిత్స చేసి అధికారంలోకి తీసుకురావటం మామూలు విషయం కాదు. తాను అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన హుజరాబాద్ మునుగోడు శాసనసభ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్లు కోల్పోయినా అధైర్యపడని రేవంత్ రెడ్డి 2023 తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీని గెలుపు ముంగిట నిలిపిన వైనం రాజకీయ వర్గాలనే ఆశ్చర్యచకితులను చేసింది. బలమైన బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్‌ని ఓడించటం రేవంత్ రెడ్డితో ఏమి సాధ్యమవుతుందనే అభిప్రాయం నెలకొన్న దశలో ఒకవైపు బిఆర్ఎస్ పార్టీపై ప్రభుత్వంపై క్షేత్రస్థాయిలో పోరాటం చేస్తూ, మరొకవైపు నిస్తేజంలో ఉన్న పార్టీలో జవసత్వాలు నింపుతూ ఎన్నికలనాటికి పార్టీని విజయతీరాలకు చేర్చారు. ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ జోడోయాత్రను విజయవంతం చేయటం, సునీల్ కనుగోలు వ్యూహాలను అమలు చేయడం, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ప్రజలలోకి తీసుకపోవటంలో అధ్యక్షుడిగా తన బాధ్యతలను పూర్తిస్థాయిలో నిర్వహించి విజయాన్ని అందుకోవటంవలనే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేసిందనే విషయాన్ని గమనించాలి.
Also Read: ఆకాశమంత స్ఫూర్తి.. అంబేద్కర్
తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావాలనే కాంగ్రెస్ పార్టీ కల రేవంత్ రెడ్డి నాయకత్వంలోనే సాధ్యమైందని కాంగ్రెస్ పార్టీ బలంగా విశ్వసిస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ నాలుగు నెలల కాలంలో ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను గ్యారెంటీలను అమలు చేయడానికి చేస్తున్న కృషికి ప్రజల నుండి ప్రశంసలు లభిస్తున్నాయి. అంతేకాదు పార్టీని ప్రభుత్వాన్ని సమన్వయంతో నడిపిస్తున్న తీరు తెలంగాణలో రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ బలం మరింత పెరిగిందనే చెప్పాలి. మరొకవైపు గత ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందు పెడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యతలను ప్రజల లోకి తీసుకు వెళ్ళటం వలన రేవంత్ రెడ్డి తన నాయకత్వ సమర్థతను మరింత పెంచుకున్నారని చెప్పాలి. గతంలో పార్టీలో తన నాయకత్వానికి వ్యతిరేకంగా ఉన్నవారు కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి పనితీరుని ప్రశంసించడం చూస్తుంటే రేవంత్ రెడ్డి అటు పార్టీలో ఇటు ప్రజలలో తన బలం పెంచుకున్నారని చెప్పాలి.
2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలకు ముందు ఏ ఎన్నికలు జరిగినా ఓటమిని మూట గట్టుకున్న కాంగ్రెస్ పార్టీ, గత రెండు లోక్ సభ ఎన్నికలలో తెలంగాణలో రెండు లేదా మూడు స్థానాలకే పరిమితమైన కాంగ్రెస్ పార్టీ, నేటి లోక్‌సభ ఎన్నికల నాటికి దేశంలోని 28 రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ అత్యంత బలంగా ఉన్న రాష్ట్రంగా తెలంగాణ ఉందని ప్రీ పోల్ సర్వేలు చెబుతున్నాయి అంటే రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాహుల్ గాంధీ సహకారంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఒక పెట్టని కోటగా మారిందనే చెప్పాలి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 17 స్థానాలలో ఎన్నికలు జరగకముందే ఫలితాలు రాకముందే మెజార్టీ లోక్ సభ స్థానాలలో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో మెజార్టీ లోక్ సభ స్థానాలలో గెలిపించడానికి రేవంత్ రెడ్డి రాజకీయ వ్యూహాలు బలంగా ఉన్నాయనే అభిప్రాయం కలుగుతుంది. పార్టీ బలహీనంగా ఉన్న సెంట్రల్ తెలంగాణలో రేవంత్ రెడ్డి తన రాజకీయ వ్యూహాలతో అక్కడ ఉన్న లోక్‌సభ స్థానాలలో కూడా గెలుపు అవకాశాలను మెరుగుపరచాడనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల, మెదక్ స్థానాలలో పార్టీ బలాన్ని గణనీయంగా పెంచడానికి రేవంత్ రెడ్డి రాజకీయ వ్యూహాలు ఎత్తుగడలు కాంగ్రెస్ బలాన్ని పెంచాయనే చెప్పాలి.
Also Read: దక్షిణానికి భవిష్యత్ ఆశాకిరణం
దక్షిణ భారత దేశంలో కాంగ్రెస్ ఎక్కువ లోక్‌సభ స్థానాలు తెలంగాణ నుండే గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశ రాజకీయాలలో ఉత్తరాది ప్రభావం ఉన్నా తెలంగాణ రాష్ట్రానికి కూడా ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. దేశ రాజకీయాలను ప్రభావితం చేసే ఒక రాజకీయ కేంద్రంగా నేడు తెలంగాణ రాష్ట్రం ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీకి ఒక బలమైన కేంద్రంగా మార్చటంలో రేవంత్ రెడ్డిదే కీలకమైన భూమిక. బీహార్‌లో రాజకీయ సంక్షోభం వచ్చినా, హిమాచల్ ప్రదేశ్‌లో రాజకీయ ఇబ్బంది వచ్చినా తెలంగాణ సీఎం ఇక్కడి నుంచే వారికి మార్గనిర్దేశం చేసి పార్టీని కాపాడుకునేందుకు ముందుకు రావటాన్ని బట్టి నేడు తెలంగాణ కాంగ్రెస్‌కి ఒక బలమైన కోటగా రూపొందిందని అర్థమవుతోంది. దీనికి సీఎం రేవంత్ రెడ్డి దూరదృష్టి, నాయకత్వ లక్షణాలే ప్రధాన కారణాలని చెప్పటం అతిశయోక్తి కాబోదు.
-డాక్టర్ తిరునహరి శేషు రాజకీయ విశ్లేషకులు (కాకతీయ విశ్వవిద్యాలయం)