Revanth reddy today news(Latest political news telangana): త్వరలో లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. పార్టీలన్నీ గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ దూకుడుగా వ్యవహరిస్తోంది. 14 సీట్లే లక్ష్యంగా ముందుకు వెళ్తోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ తుక్కుగూడలో నిర్వహించిన జన జాతర సభ సక్సెస్ అయింది. ఈ సభలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిపక్షాలపై ఈటెల లాంటి పదునైన విమర్శనాత్మక బాణాలతో కూడిన వ్యంగ్యాస్త్రాల ప్రసంగానికి సభకి హాజరైన కాంగ్రెస్ శ్రేణుల నుండి వచ్చిన స్పందన చూస్తుంటే రేవంత్ రెడ్డి దక్షిణాది రాష్ట్రాల నుండి భవిష్యత్తులో ఒక బలమైన నేతగా ఎదగబోతున్న ఛాయలు స్పష్టంగా కనపడుతున్నాయి. షడ్రుచులు కలిగిన ఉగాది పచ్చడిలాగా కొనసాగిన రేవంత్ రెడ్డి ప్రసంగం లక్షలాది మంది హాజరైన సభ నుండి వచ్చిన స్పందనే రేవంత్ రెడ్డి బలాన్ని ఆవిష్కరించింది. నేను పెద్దలు జానారెడ్డి లాంటి వాడిని కాదు, నేను రేవంత్ రెడ్డిని. బిడ్డ అనే సున్నితమైన హెచ్చరికతో పాటు మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావుపై దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై చేసిన విమర్శలు కాంగ్రెస్‌కి ఎందుకు ఓటు వేయాలో చెప్పిన విధానం రేవంత్ రెడ్డి పరిణతికి అద్దం పడుతోంది. మా వంద రోజుల పాలన నచ్చితే 14 లోక్ సభ స్థానాలలో గెలిపించాలనే విజ్ఞప్తిలో రేవంత్ రెడ్డి ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది.
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి దేశ రాజకీయాలలో ఉత్తర భారత దేశ నాయకుల అధిపత్యమే కొనసాగుతోంది. దేశ రాజకీయాలను ఒక రకంగా ఉత్తరాది నాయకులు శాసిస్తున్నారనే అభిప్రాయం ఉంది. అయితే దక్షిణాది నుండి రాష్ట్రపతిగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఒకే ఒక్కరు నీలం సంజీవరెడ్డి. దక్షిణాది నుండి ప్రధాన మంత్రులుగా ఎంపికైన పీవీ నరసింహారావు, దేవెగౌడ, నేషనల్ ఫ్రంట్ చైర్మన్‌గా వ్యవహరించిన ఎన్టీ రామారావు, యునైటెడ్ ఫ్రంట్ చైర్మన్‌గా వ్యవహరించిన చంద్రబాబు నాయుడు, 2004, 2009లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణమైన రాజశేఖర్ రెడ్డి లాంటి నాయకులు దక్షిణాది నుండి బలమైన నేతలుగా ఎదిగి కొంత మేరకు ఉత్తరాది నాయకుల ప్రభావానికి అడ్డుకట్ట వేయగలిగారు. కానీ, భారతీయ జనతా పార్టీ కేంద్ర రాజకీయాలలో బలం పుంజుకున్న తర్వాత మళ్లీ జాతీయ రాజకీయాలలో ఉత్తరాది నాయకుల ప్రభావం పెరిగిపోయిందనే చెప్పాలి. ఈ ఉత్తరాది నాయకుల ప్రాబల్యానికి అడ్డుకట్ట వేసి దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడే బలమైన నాయకులు ఎవరు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ఈ తరం నాయకులలో ఉత్తరాది నాయకులను ఛాలెంజ్ చేసే విధంగా దక్షిణాది నుండి బలంగా ఎదిగే నేత ఎవరు అనే అంశం తెరపైకి వస్తోంది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ది, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిది రాష్ట్రం దాటి రాజకీయాలు చేసే మనస్తత్వం కాదు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావులు రాజకీయంగా చివరి అంకంలో ఉన్నారు. కాబట్టి దక్షిణాది నుండి ఒక బలమైన నేతగా ఎదగడానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పుష్కలమైన అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాల గళం వినిపించడానికి, ఇక్కడి ప్రయోజనాలు కాపాడటానికి రేవంత్ రెడ్డి భవిష్యత్ తరం నాయకుడిగా కనిపిస్తున్నారు.
కాంగ్రెస్ లాంటి ఒక సుదీర్ఘమైన చరిత్ర కలిగిన పార్టీలో తక్కువ వ్యవధిలోనే ముఖ్యమంత్రి స్థాయికి ఎదగటం అంతా ఆషామాషీ విషయం కాదు. పార్టీలో చేరిన ఏడు సంవత్సరాలలోనే అత్యున్నత అవకాశం అందిపుచ్చుకోవటం అంటే అది రేవంత్ రెడ్డి సమర్థతకు దక్కిన ఫలితంగానే భావించాలి. స్టాలిన్, జగన్మోహన్ రెడ్డి లాంటి వారికి ఉన్న వారసత్వ బలంతో అవకాశాలు దక్కించుకున్నారు. కానీ, ఎలాంటి రాజకీయ వారసత్వ మూలాలు లేకుండా ఒక జాతీయ పార్టీలో చేరిన అనతి కాలంలోనే అవకాశాలు దక్కించుకోవడం అంత సులభం కాదు. కానీ, రేవంత్ రెడ్డి సమర్థత నాయకత్వ లక్షణాలు, తెగింపు, పోరాటం, మాస్ ఇమేజ్, ధైర్యం, మొండితనం, తగ్గే కాడ తగ్గటం, నెగ్గే కాడ బలంగా నిలబడే లక్షణంతో తెలంగాణలోనే కాదు దక్షిణాదిలో కూడా ఒక బలమైన నేతగా ఎదగబోతున్నారనే అభిప్రాయం రాజకీయ వర్గాలలో వినపడుతోంది. దేశ రాజకీయాలను శాసించటానికి తయారవుతున్న సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న బలమైన నేత కేసీఆర్‌ని ఓడించి తెలంగాణలో అధికారం చేజెక్కించుకోవడంతో దేశవ్యాప్తంగా రేవంత్ రెడ్డి బలం అనూహ్యంగా పెరిగిందనే చెప్పాలి.
భవిష్యత్తులో దక్షిణాది రాష్ట్రాలకు జరగబోయే అన్యాయంపై బలంగా మాట్లాడగలిగే నేత అవసరం ఇప్పుడు ఏర్పడుతోంది. కేంద్ర ఆర్థిక సంఘం జనాభా ప్రాతిపదికగా నిధులను కేటాయించడం వలన దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందనే వాదన ఉంది. దక్షిణాది రాష్ట్రాలు జనాభా పెరుగుదల నియంత్రణకి అధిక ప్రాధాన్యత ఇవ్వటం వలన ఈ రాష్ట్రాలకి నిధులు తగ్గిపోతున్నాయి. కాబట్టి ప్రగతిశీల రాష్ట్రాలను ప్రోత్సహించే విధంగా కేంద్రం ఎక్కువ నిధులు కేటాయించాలని దక్షిణాది రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి. కానీ, పేద రాష్ట్రాలకు కాస్త ఎక్కువ నిధులు కేటాయిస్తే తప్పేమిటని కేంద్రం వాదిస్తోంది. అలాగే, దక్షిణాది రాష్ట్రాల నుండి కేంద్రానికి వచ్చే ఆదాయం ఎక్కువ. కానీ, కేంద్రం నుండి వచ్చేది తక్కువగా ఉండటం వలన దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని మిగిలిన పార్టీలు చెబుతున్నాయి. 2026లో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలలో లోక్ సభ స్థానాల సంఖ్య తగ్గిపోతుంది. బలం మరింత తగ్గిపోయి ఉత్తరాది రాష్ట్రాల ప్రభావం పెరుగుతుందనే ఆందోళన ఇక్కడి నాయకులలో వ్యక్తం అవుతున్న నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడటానికి, జరుగుతున్న అన్యాయంపై వివక్షతపై ప్రశ్నించడానికి ఈ ప్రాంతం నుండి ఒక బలమైన నేత ఎదగాల్సిన ఆవశ్యకత ఉన్న తరుణంలో భవిష్యత్ నేతగా రేవంత్ రెడ్డి ఎదుగుతారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తుక్కుగూడ సభలో కేంద్రంపై విమర్శలు చేస్తూ ఉత్తరాదికి దక్షిణాదికి మధ్య విభజన రేఖలు గీస్తున్నందుకు మోడీకి ఓటు వేయాలా అని ప్రశ్నించారు. అంటే దక్షిణాదికి అన్యాయం జరిగితే ప్రశ్నించడానికి నేను ముందుంటానని రేవంత్ రెడ్డి చెప్పకనే చెప్పినట్లుగా భావించాలి. భవిష్యత్తులో దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడటానికి ఈ ప్రాంతం నుండి ఒక బలమైన నేత ఎదగాల్సిన అవసరం ఉందని భావిస్తున్న తరుణంలో రేవంత్ రెడ్డి దక్షిణ పదానికి భవిష్యత్తు ఆశా కిరణంగా కనపడటంలో ఆశ్చర్యం లేదు. దక్షిణాదిపై కేంద్రం వివక్షతను ప్రశ్నించడానికి ఇక్కడి రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడటానికి ఒక బలమైన నేత అవసరం ఉంది. ఆ బాధ్యత రేవంత్ రెడ్డి లాంటి డైనమిక్ లీడర్ సమర్థవంతంగా నిర్వహిస్తారనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది.
డాక్టర్ తిరునహరి శేషు
రాజకీయ విశ్లేషకులు
కాకతీయ విశ్వవిద్యాలయం
9885465877