Rythu Mahotsavam Program ( image credit: swetcha reporter)
నిజామాబాద్

Rythu Mahotsavam Program: రైతు మహోత్సవ ప్రారంభం.. మంత్రుల సందడి, శాస్త్రవేత్తల సమీక్ష!

Rythu Mahotsavam Program: రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఈ నెల 21 నుండి 23 వరకు కొనసాగనున్న రైతు మహోత్సవం కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభం అయ్యింది. రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతు మహోత్సవాన్ని లాంచనంగా ప్రారంభించారు. హైదరాబాద్ నుంచి మంత్రితో కలిసి హెలికాప్టర్ లో విచ్చేసిన సహచర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ ఆలీ తదితరులు ఈ మహోత్సవంలో పాల్గొన్నారు.

వీరితో పాటు ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల కలెక్టర్లు రాజీవ్ గాంధీ హనుమంతు, ఆశిష్ సంగ్వాన్, ఐఏఎస్ అధికారులు భవాని శ్రీ, గోపి, వ్యవసాయ, అనుబంధ శాఖల ఉన్నతాధికారులు, కార్పొరేషన్ల చైర్మన్లు భాగస్వాములు అయ్యారు. రైతు మహోత్సవ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ, అనుబంధ రంగాల స్టాల్స్ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆధునిక వ్యవసాయ యంత్రాలు, పనిముట్లు, వ్యవసాయ ఉత్పత్తులు, అధిక దిగుబడులను అందించే అధునాతన వంగడాలు, మేలు జాతి పశువులు, ఆహార పదార్థాల ప్రదర్శనకు దాదాపు సుమారు 150 స్టాళ్లు ఏర్పాటు చేశారు.

 Also Read; Waragal Gurukulam: గురుకుల ప్రవేశాల్లో నియమాల మాయం.. విద్యార్థులపై అన్యాయం ఎవరి బాధ్యత?

సేంద్రీయ విధానంలో పంటల సాగు, ఆధునిక పద్ధతుల్లో లాభసాటి వ్యవసాయం, తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులను అందించే వంగడాలు తదితర వాటి గురించి వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులు, ఆదర్శ రైతుల ద్వారా అన్నదాతలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి ఐదు జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు హాజరయ్యారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు స్టాల్స్ సందర్శించి, నూతన ఆవిష్కరణలు, ఆధునాతన వంగడాలు, వ్యవసాయ, అనుబంధ రంగాల ఉత్పత్తులను పరిశీలిస్తూ, వాటి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, సేంద్రియ వ్యవసాయం తోపాటు, ఆధునిక సాంకేతికతను జోడించి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఆర్జించే విధంగా వ్యవసాయ మెళుకువలను అందించడానికి రైతు మహోత్సవ కార్యక్రమం ఎంతగానో ఉపకరిస్తుందని, దీనిని రైతులు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అందరి కోరిక మేరకు నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేసినందుకు కేంద్రానికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. బోర్డును పూర్తి స్థాయిలో వినియోగంలోకి తెచ్చి పసుపు రైతులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు, పసుపు ఆధారిత పరిశ్రమలు, ఉత్పత్తులకు కూడా కేంద్రం చొరవ చూపాలని కోరారు.

 Also Read: Srinivas on Chennamaneni Ramesh: బీఆర్ఎస్ నేతపై ప్రభుత్వ విప్ ఫైర్.. క్రిమినల్ కేసుకు డిమాండ్!

ఈ మేరకు కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రత్యేకంగా కోరుతామని తెలిపారు. ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతుల ప్రయోజనాలే పరమావధిగా పంట రుణాల మాఫీ కింద రైతుల ఖాతాలలో 33 వేల కోట్ల రూపాయలను జమ చేశామని అన్నారు. త్వరలోనే రైతు భరోసా నిధులను కూడా రైతుల ఖాతాలలో జమ చేస్తామని మంత్రి తుమ్మల తెలిపారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు దెబ్బతిన్న రైతాంగానికి నష్ట పరిహారం సైతం అందించే ఏర్పాట్లు చేస్తామని ప్రకటించారు.

దేశంలోనే మరెక్కడా లేనివిధంగా రైతుల నుండి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా పెద్ద ఎత్తున వరి ధాన్యం కొనుగోలు చేస్తూ, సకాలంలో బిల్లుల చెల్లింపులు జరుపుతున్నామని అన్నారు. తెలంగాణాలో ఉన్నది రైతు ప్రభుత్వమని, రైతాంగ సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. ప్రకృతి పరంగా, క్రిమికీటకాలు రూపంలో పంటల సాగుకు అనేక అవరోధాలు ఎదురవుతున్నాయని, అయినా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ రైతు నష్టపోకుండా వారికి అన్ని విధాలా అండగా నిలువాలన్నదే తమ ప్రభుత్వ అభిమతమని వెల్లడించారు. ఇతర దేశాల్లో ఎలాంటి పంటలు పండించి లాభం పొందుతున్నారు, ఆధునిక సాగు, కొత్త పంటల పై రైతులకు మూడు రోజుల ఈ మహోత్సవంలో శాస్త్రవేత్తలు, నిపుణులు అవగాహన కల్పిస్తారని, దీనిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

అత్యంత లాభదాయకమైన పంట పామాయిల్ అని, దీనిని జంతువులు , చీడ పురుగులు నష్టం చేయవని, అందువల్ల పామాయిల్ పంటను రైతులు సాగు చేయాలని పిలుపునిచ్చారు. జిల్లాలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయించే బాధ్యత తనదేనని భరోసా కల్పించారు. కాగా, వ్యవసాయమే ప్రధాన ఆధారంగా ఉన్న నిజామాబాద్ జిల్లాలో వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని మంత్రి తుమ్మల తెలిపారు. వ్యవసాయ యాంత్రీకరణ, డ్రిప్ ఇరిగేషన్ లను మళ్లీ పునరుద్ధరిస్తూ, నిజామాబాద్ జిల్లాకు వీటి మంజూరీలో ప్రాధాన్యత ఇస్తామని అన్నారు.

 Also Read: Hyderabad-2 Depot Conductor: ఆర్టీసీ బస్సులో మహిళకు కాన్పు.. శెభాష్ అన్న వీసీ సజ్జనార్

రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, రైతులకు ఎంతో ఉపయుక్తంగా నిలిచే ఈ తరహా సదస్సులను ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. ఉమ్మడి జిల్లాలోని నిజాంసాగర్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టులలో పూడికతీత పనుల కోసం ఈ నెలాఖరులోగా టెండర్ ప్రక్రియను పూర్తి చేస్తామని, పూడిక తొలగింపు ద్వారా లక్షల ఎకరాల అదనపు ఆయకట్టుకు నీటి వసతి సమకూరుస్తామని ప్రకటించారు. కాళేశ్వరం 20, 21, 22 ప్యాకేజీల పెండింగ్ పనులతో పాటు గుత్ప ఎత్తిపోతల పథకం మిగులు పనుల పూర్తికి అవసరమైన నిధులను కేటాయించి పనులను పూర్తి చేయిస్తామని అన్నారు.

భూగర్భ జలాలు వృద్ధి చెందేలా అవసరమైన చోట విరివిగా చెక్ డ్యామ్ లు నిర్మించేలా చూస్తామని అన్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు సాగు నీరు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. గత ప్రభుత్వం నీటిపారుదల రంగానికి లక్షా 81 వేల కోట్ల రూపాయలను వెచ్చించినప్పటికీ, సాగు రంగానికి ఒనగూరిన ప్రయోజనం శూన్యంగా మారిందని ఆక్షేపించారు. అనాలోచిత నిర్ణయాలతో కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టి లక్షా 25 వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేశారని, ఉమ్మడి జిల్లాలో ప్రాణహిత చేవెళ్ల ప్యాకేజీల పనులను కూడా పూర్తి చేయలేకపోయారని దుయ్యబట్టారు.

 Also Read: Southern Railway Jobs: దక్షిణ రైల్వేలో జాబ్స్.. వెంటనే, ఈ ఉద్యోగాలకు అప్లై చేయండి!

తమ ప్రభుత్వం వచ్చాక, కాళేశ్వరం ప్రాజెక్టు చుక్క నీటిని కూడా వినియోగించకుండానే రాష్ట్రంలో ఇదివరకు ఎన్నడూ లేనివిధంగా దేశంలోనే అత్యధికంగా వరి పంటను పండించి సరికొత్త రికార్డును సృష్టించామని హర్షం వెలిబుచ్చారు. గత ఖరీఫ్, రబీ సీజన్లను కలుపుకుని 281 లక్షల మెట్రిక్ టన్నుల వరి పంట తెలంగాణాలో ఉత్పత్తి అయ్యిందని, దేశంలోని మరే ఇతర రాష్ట్రాలలో ఇంత పెద్ద ఎత్తున వరి సాగు కాలేదని తెలిపారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వపరంగా కొనుగోలు చేస్తూ, వారికి పూర్తిస్థాయి మద్దతు ధర అందిస్తున్నామని, సన్నాలు అదనంగా క్వింటాకు రూ. 500 చొప్పున బోనస్ చెల్లిస్తున్నామని గుర్తు చేశారు.

పంట విక్రయించిన రెండు రోజులలోనే రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేస్తున్నామని, కేంద్రాలలో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంచామన్నారు. ఎక్కడ కూడా గన్నీ బ్యాగుల కొరత లేదని, ఎక్కడైనా గన్నీ బ్యాగులు సమకూర్చడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సంబంధిత అధికారులను సస్పెండ్ చేస్తామని ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా అవసరమైన అన్ని ప్రాంతాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను నెలకొల్పి, రైతులకు ఇబ్బందులు లేకుండా ప్రణాళికాబద్ధంగా ధాన్యం సేకరణ చేస్తున్నామని తెలిపారు.

కాగా, దేశంలోనే మరెక్కడా లేనివిధంగా తెలంగాణలోని 84 శాతం జనాభాగా ఉన్న సామాన్య, పేద కుటుంబాలకు కూడా తమ ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేస్తోందని అన్నారు. ఇదివరకు దొడ్డు రకం బియ్యం 2.81 కోట్ల మందికి పంపిణీ చేసేందుకు 10625 కోట్ల రూపాయలను వెచ్చించేవారని, కానీ 70 నుండి 80 శాతం మంది దొడ్డు బియ్యాన్ని భోజనానికి వినియోగించేవారు కాదని అన్నారు. దీంతో రేషన్ బియ్యం రీసైక్లింగ్ వంటి అక్రమ దందాలు జరిగేవని తెలిపారు. ప్రస్తుతం తమ ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేస్తుండడం వల్ల ఆ తరహా అక్రమాలకూ కళ్లెం పడిందని, రాష్ట్రంలోని 84 శాతం జనాభాగా ఉన్న 3.10 కోట్ల మందికి సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని వివరించారు. ఎంత ఖర్చు అయినా భరిస్తామని, సన్నబియ్యం పంపిణీని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

 Also Read: BRS Silver jubilee celebrations: రజతోత్సవ సభ కోసం వాగులు పూడ్చేశారా? ఇదేందయ్యా ఇదెక్కడా చూడలా!

జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ, రైతాంగానికి తమ ప్రభుత్వం పూర్తిస్థాయిలో వెన్నుదన్నుగా నిలుస్తుందని అన్నారు. గత ప్రభుత్వ నిర్వాకంతో రాష్ట్ర ఖజానా ఆర్ధిక ఇబ్బందుల్లో కూరుకుపోయినప్పటికీ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలతో పాటు ఇతర అనేక సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలిపారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుండి రాష్ట్రాన్ని 64 సంవత్సరాల పాటు పాలించిన 21 మంది ముఖ్యమంత్రులు 64 వేల కోట్ల రూపాయల అప్పులు చేస్తే, వాటిపై సంవత్సరానికి 6 వేల కోట్ల రూపాయల వడ్డీ అయ్యేదని అన్నారు.

అయితే, గత ప్రభుత్వం కేవలం పది సంవత్సరాల వ్యవధిలోనే రాష్ట్ర అప్పును 8 లక్షల కోట్లకు చేర్చిందని, ఫలితంగా ప్రస్తుతం తమ ప్రభుత్వం ప్రతీ నెల వడ్డీ రూపంలోనే 6 వేల కోట్లు, సంవత్సరానికి 70 వేల కోట్ల రూపాయలు కట్టాల్సిన దుస్థితి నెలకొందని అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఇప్పటివరకు లక్షా 40 వేల కోట్ల రూపాయలను అప్పులపై వడ్డీల కింద చెలియించాల్సి వచ్చిందని ఆవేదన వెలిబుచ్చారు. అయినప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని అన్నారు.

కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ, వ్యవసాయ ఆధారిత జిల్లాలో రైతు మహోత్సవం ఏర్పాటు చేయడం ఎంతో సంతోషం కలిగించిందని, ఆయా జిల్లాల రైతులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వ్యవసాయ యాంత్రీకరణ, పంట మార్పిడి, ఆధునిక సాగు పద్ధతులు, అధునాతన వంగడాలు, వ్యవసాయ అనుబంధ రంగాలలో అధిక లాభాల సాధనకు పాటించాల్సిన పద్ధతుల గురించి వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులతో పాటు ఆదర్శ రైతులు అవగాహన కల్పిస్తారని అన్నారు. రైతులు కూడా తమ అనుభవాలను పంచుకోవచ్చని, సాగు రంగానికి సంబంధించి సలహాలు, సూచనలు అందించవచ్చని అన్నారు.

 Also Read; CM Revanth Reddy: అక్కడైనా.. ఎక్కడైనా.. తెలంగాణ తగ్గేదేలే.. జపాన్ లో ఏం జరిగిందంటే?

ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీలు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, డాక్టర్ భూపతిరెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ, రాకేష్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో ప్రసంగించారు. రాష్ట్ర వ్యవసాయ, రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, ఆయా కార్పొరేషన్ల చైర్మన్లు ఈరవత్రి అనిల్, అన్వేష్ రెడ్డి, మానాల మోహన్ రెడ్డి, తాహెర్ బిన్ హందాన్, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, నుడా ఛైర్మన్ కేశ వేణు, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులుగా ఎంపిక చేసిన రైతులకు సబ్సిడీతో కూడిన ఆధునిక వ్యవసాయ యంత్ర, పరికరాలు పంపిణీ చేశారు.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ  https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..