Kamareddy Suicide Case: ఆన్ లైన్ గేమ్స్‌కు అలవాటు పడిన ఓ యువకుడు అప్పులపాలయ్యాడు. ఆ అప్పులు ఎలా తీర్చాలో తెలియక ఇంట్లో ఉరేసుకోని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కామారెడ్డి(Kamareddy) పట్టణంలో చోటుచేసుకుంది. కామారెడ్డి టౌన్ సిఐ నరహరి తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని ఓంశాంతి కాలనీకి చెందిన వల్లందేసి శ్రీకర్(Srikar) (30) ఓ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఏడాదిన్నర కాలం నుండి శ్రీకర్ ఆన్లైన్ గేమింగ్ కు అలవాటు పడ్డాడు. తద్వారా సుమారు 20 లక్షల వరకు అప్పులయ్యాడు. అప్పుల బాధలు భరించలేక ఇల్లు అమ్మి కొన్ని అప్పులు చెల్లించారు. అయినా ఇంకా అప్పులు తీరలేదు.
Also Read: TG Police Reforms: ఇక రాచకొండ కమిషనరేట్ క్లోజ్.. వ్యవస్థలో భారీ మార్పులు
ఎంత పిలిచినా పలకలేదు
ఇంటి ఆర్థిక పరిస్థితి కూడా అంతగా బాగాలేదు. తల్లి గోదావరి కూరగాయలు కొనడానికి మార్కెట్ కు వెళ్ళింది. ఆ సమయంలో శ్రీకర్ ఒక్కడే ఇంట్లో ఉన్నాడు. తిరిగి వచ్చేసరికి ఇంటి లోపలికి వెళ్లి చూడగా బెడ్ రూమ్ తలుపు మూసి ఉండటంతో ఎంత పిలిచినా శ్రీకర్ పలకలేదు. వెంటనే గోదావరి తన పెద్ద కొడుకు శ్రీనాథ్ కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది. ఇద్దరు కలిసి తలుపులను బలంగా నెట్టడంతో తెరుచుకోగా గదిలో చీరతో ఉరేసుకుని వేలాడుతున్న శ్రీకర్ ను చూసి షాకయ్యారు. శ్వాస లేకపోవడంతో వెంటనే ఆటోలో కామారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్‌కు తీసుకెళ్లగా అప్పటికే శ్రీకర్ మృతి చెందాడని డాక్టర్లు స్పష్టం చేశారు. శ్రీకర్ మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. తల్లి గోదావరి ఫిర్యాదు మేరకు కామారెడ్డి పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ నరహరి తెలిపారు.
Also Read: Outdoor Advertising: ఔట్ డోర్ మీడియా ఆగడాలకు ఇక చెక్.. హైదరాబాద్‌లో బెంగళూరు పాలసీ..?

