TG Police Reforms: రాష్ట్ర ప్రభుత్వం పోలీసు కమిషనరేట్ల పరిధిలో భారీ మార్పులు చేపట్టింది. రాచకొండ కమిషనరేట్ ఆఫ్ పోలీస్ పరిధిని మూడు జిల్లాలకు విస్తరిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. రంగారెడ్డి జిల్లా పరిధిలోని పోలీస్ స్టేషన్లను ఫ్యూచర్ సిటీగా, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పరిధిలోని పోలీస్ స్టేషన్లను మల్కాజిగిరిగా, యాదాద్రి భువనగిరి జిల్లాను ఎస్పీ పరిధిలోకి విభజిస్తూ రాచకొండ కమిషనరేట్‌ను ఎత్తివేసింది. దీంతో సైబరాబాద్ పరిధిలో ఉన్న షాద్‌నగర్, చేవెళ్ల, అమన్‌గల్, రాచకొండ పరిధిలోని ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాల పోలీస్ స్టేషన్లు కొత్తగా ఏర్పడిన ‘ఫ్యూచర్ సిటీ’ కమిషనరేట్ పరిధిలోకి రానున్నాయి. అలాగే రాచకొండ పరిధిలోని ఎల్బీనగర్, ఉప్పల్, మేడ్చల్ నియోజకవర్గాల స్టేషన్లు మల్కాజిగిరి కమిషనరేట్ అధీనంలో ఉండనున్నాయి. మరోవైపు శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్ స్టేషన్లతో పాటు ఇబ్రహీంపట్నంలోని ఆదిబట్ల, బడంగ్‌పేట్ పరిధిలోని మీర్‌పేట్, పహాడీషరీఫ్ స్టేషన్లు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే కొనసాగనున్నాయి.
జీహెచ్ఎంసీ హద్దులోనే కమిషనరేట్లు
ప్రజలకు పరిపాలన సౌలభ్యం, మెరుగైన పౌర సేవలు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పోలీసు విభాగంలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. గతంలో రాచకొండ కమిషనరేట్ ఏర్పాటులో ఉన్న అవకతవకలను సరిదిద్దుతూ, విస్తరించిన జీహెచ్ఎంసీ పరిధిని హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కమిషనరేట్ల పరిధిలోకి తీసుకువచ్చింది. గతంలో రాచకొండ కమిషనరేట్ పేరు ఉన్నప్పటికీ, ఆ ప్రాంతం పరిధిలో లేకపోవడం, ఆ తర్వాత సంస్థాన్ నారాయణపురం మండలాన్ని చేర్చడం వంటి నిర్ణయాలతో గందరగోళం ఉండేది. యాదాద్రి భువనగిరి జిల్లా మొత్తాన్ని, అలాగే మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, కల్వకుర్తి నియోజకవర్గంలోని మాడ్గుల మండలాన్ని రాచకొండలో కలిపి ప్రజలకు ఇబ్బందులు కలిగించారు. అప్పట్లో కమిషనరేట్ కార్యాలయం మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని నేరెడ్‌మెట్‌లో ఉండటంతో, సుదూర ప్రాంతాల ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి అధికారులను కలవలేకపోయేవారు. ఈ దుస్థితికి ప్రస్తుత ప్రభుత్వం చెక్ పెట్టింది. కమిషనరేట్లను భౌగోళికంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
Also Read: LPG Price Hike: సామాన్యులకు బిగ్ షాక్.. 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.111 పెంపు
రూరల్ ప్రాంతాలకు విముక్తి
గత ప్రభుత్వ హయాంలో రంగారెడ్డి జిల్లా పాలనలో ఉన్న గందరగోళానికి ప్రస్తుత ప్రభుత్వం తెరదించింది. జిల్లా కలెక్టరేట్ ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఉండటం, పోలీసు పరిధి సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల మధ్య విడిపోవడంతో జిల్లాకు ఒక నిర్దిష్ట కేంద్రం లేకుండా పోయింది. దీనివల్ల ప్రజలు పరిపాలన పరంగా ఒక చోట, క్రైమ్ సమస్యల కోసం మరోచోట అధికారులను కలవలేక తీవ్ర ఇబ్బందులు పడేవారు. గతంలో జిల్లా పరిషత్ సమావేశాల్లో నాటి అధికార పార్టీ ఎమ్మెల్యేలే స్వయంగా ఈ సమన్వయ లోపాన్ని ఎండగట్టిన దాఖలాలు ఉన్నాయి. ఈ సమస్యలన్నింటికీ చెక్ పెడుతూ రంగారెడ్డి జిల్లా రూరల్ ప్రాంతాలను ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలోకి తీసుకువచ్చారు.
నూతన కమిషనరేట్ స్వరూపం
ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలో మహేశ్వరం, మొయినాబాద్, షాద్‌నగర్ డీసీపీ స్థాయి మూడు జోన్లు ఉండనున్నాయి. అలాగే ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, చేవెళ్ల, మొయినాబాద్, అమన్‌గల్, షాద్‌నగర్ ఎసీపీ స్థాయి ఆరు డివిజన్లు పనిచేస్తాయి. ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, కడ్తాల్, మహేశ్వరం, ఫార్మాసిటీ, చేవెళ్ల, మోకిల్లా, శంకర్ పల్లి, మొయినాబాద్, షాబాద్, శంషాబాద్, అమన్‌గల్లు, కేశంపేట్, మాడ్గుల, తలకొండపల్లి, చౌదరిగూడ, కొందుర్గు, కొత్తూర్, నందిగామ, షాద్‌నగర్ సహా మొత్తం 22 పోలీస్ స్టేషన్లు ఇకపై ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ఆఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో పని చేయనున్నాయి. దీనివల్ల రూరల్ ప్రాంతాల్లో పోలీసు నిఘా పెరగడంతో పాటు ప్రజలకు ఉన్నతాధికారులు మరింత అందుబాటులో ఉండనున్నారు.
Also Read: Crime News: మేడ్చల్లో కొకైన్ కలకలం.. ఏడుగురిని అరెస్టు చేసిన పోలీసులు

