GHMC Employees: జీహెచ్ఎంసీ పర్మినెంట్ ఉద్యోగుల మెడికల్ బిల్లులు దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్నాయని, వాటిని వెంటనే మంజూరు చేయించాలని కోరుతూ భారతీయ మజ్దూర్ సంఘ్ గుర్తింపు పొందిన భాగ్యనగర్ మున్సిపల్ జీహెచ్ఎంసీ ఎంప్లాయీస్ యూనియన్ కమిషనర్ ఇలంబర్తిని కోరింది. ఈ మేరకు కమిషనర్ కు వినతి పత్రం అందజేసినట్లు యూనియన్ నేతలు తెలిపారు. యూనియన్ జనరల్ సెక్రటరీ, బీఎంఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు టి. కృష్ణ నేతృత్వంలో కమిషనర్ కు ఈ వినతి పత్రాన్ని సమర్పించినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా టి. కృష్ణ మాట్లాడుతూ చాలా మంది పర్మినెంట్ ఉద్యోగులకు ఇంకా హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులు అందలేదని, వారంత ఇబ్బందులు పడుతున్న విషయాన్ని కూడా కమిషనర్ కు విన్నవించినట్లు ఆయన తెలిపారు. కొద్ది నెలల ముందు వరకు పర్మినెంట్ ఉద్యోగుల వద్దనున్న హెల్త్ కార్డులు కాలం చెల్లినట్లు గుర్తించి, ఈ విషయాన్ని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లగా, సానుకూలంగా స్పందించిన ఆయన ఇన్సూరెన్స్ కంపెనీని ఎంపిక చేసేందుకు వీలుగా టెండర్ల ప్రక్రియ నిర్వహించగా, ఓరియంటల్ ఇన్సూరెన్స్ సర్వీస్ సంస్థ ఎంపికైనట్లు తెలిపారు.
Also Read; CM Revanth Reddy: అక్కడైనా.. ఎక్కడైనా.. తెలంగాణ తగ్గేదేలే.. జపాన్ లో ఏం జరిగిందంటే?
ఏజెన్సీ ఖరారైనప్పటికీ, అత్యవసర పరిస్థితులు, అపస్మారక స్థితి వంటి పరిస్థితుల్లో ఆసుపత్రులను ఆశ్రయిస్తున్న ఉద్యోగులకు ఎలాంటి సేవలందటం లేదని కమిషనర్ కు వివరించినట్లు ఆయన వెల్లడించారు. గత్యంతరం లేని, తప్పని పరిస్థితుల్లో ఉద్యోగులే హాస్పిటల్ బిల్లులు చెల్లించి, రియంబర్స్ మెంట్ కోసం దరఖాస్తులు చేసుకోగా, చాలా కాలం నుంచి బిల్లులు పెండింగ్ లో ఉంటున్నాయని, బిల్లులు చెల్లించిన నగదును వడ్డీకి తీసుకురావటంతో నెలసరి మిత్తీలు చెల్లించలేక ఉద్యోగులు అనేక రకాల ఇబ్బందుల పాలవుతున్నారని వెల్లడించారు. పెండింగ్ లో ఉన్న బిల్లులకు రియంబర్స్ మెంట్ చెల్లించేలా కమిషనర్ సర్క్యులర్ ఇవ్వాలని కోరినట్లు కృష్ణ తెలిపారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు