Musheerabad Murder Case: కనిపించకుండా పోయిన వృద్ధుడు దారుణ హత్యకు గురైన ఉదంతమిది. ఇచ్చిన బంగారు గొలుసును వాపస్ అడిగినందుకు హతుని స్నేహితుడే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్టు వెల్లడైంది. కేసులోని మిస్టరీని ఛేదించిన ముషీరాబాద్ పోలీసులు శనివారం నిందితున్ని అరెస్ట్ చేశారు. సెంట్రల్ జోన్ డీసీపీ కే.శిల్పవల్లి తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని బాదాం నెస్ట్ అపార్ట్ మెంట్ నివాసి గుణ్ దీప్ సింగ్ (35) వ్యాపారి. ఆయన బంధువు సత్నామ్ సింగ్ (59). ఈనెల 4న ఇంటి నుంచి బయటకు వెళ్లిన సత్నామ్ సింగ్ ఆ తరువాత ఆచూకీ లేకుండా పోయాడు.
అతని మొబైల్ కూడా స్విచాఫ్ కావటంతో ఆందోళన చెందిన గుణ్ దీప్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బంధువుల ఇళ్లతోపాటు పలు చోట్ల గాలించామని, అయినా సత్నామ్ సింగ్ ఆచూక తెలియదని పేర్కొన్నాడు. ఈ మేరకు మ్యాన్ మిస్సింగ్ గా కేసులు నమోదు చేసిన ముషీరాబాద్ పోలీసులు విచారణ ప్రారంభించారు. సత్నామ్ సింగ్ ముషీరాబాద్ ప్రాంతంలోని ఓ మెకానిక్ వద్దకు వెళ్లినట్టుగా గుణ్ దీప్ సింగ్ ఫిర్యాదులో తెలిపిన నేపథ్యంలో సీసీ కెమెరాల ఫుటేజీని సేకరించి విశ్లేషించారు.
Also Read: Mahesh Kumar Goud: తెలంగాణ దోపిడీకి బీజేపీ.. బీఆర్ఎస్ కుమ్మక్కు.. పీసీసీ చీఫ్ ఆగ్రహం!
దీని ద్వారా బోయిగూడలోని ఓ ఇంట్లోకి సత్నామ్ సింగ్ వెళ్లినట్టుగా నిర్ధారణ అయ్యింది. వెంటనే ఆ ఇంటికి వెళ్లిన పోలీసులు మూసి ఉన్న తలుపులను విరగ్గొట్టి లోపలికి వెళ్లి చూడగా తలపై బలమైన గాయాలతోపాటు కత్తిపోట్ల కారణంగా చనిపోయిన సత్నామ్ సింగ్ మృతదేహం వాటర్ సంపులో కనిపించింది. స్థానికుల ద్వారా ఆ ఇంట్లో నయన్ చంద్ర నాయక్ ఉండేవాడని పోలీసులకు తెలిసింది.
వెంటనే హత్యగా కేసును మార్చిన పోలీసులు నయన్ చంద్ర నాయక్ కోసం వేట ప్రారంభించారు. డీసీపీ శిల్పవల్లి ఆదేశాల మేరకు ప్రత్యేక పోలీసు బృందం కూడా నయన్ చంద్ర నాయక్ ను పట్టుకోవటానికి రంగంలోకి దిగింది. ఈ క్రమంలో అతను గోవాకు వెళ్లినట్టు తెలియటంతో ప్రత్యేక బృందం అక్కడకు చేరుకుంది. కాగా, తనను పట్టుకోవటానికి పోలీసు బృందం వచ్చినట్టు తెలుసుకున్న నయన్ చంద్ర నాయక్ గోవా నుంచి తప్పించుకుని హైదరాబాద్ వచ్చాడు.
Damodar Rajanarsimha: ఆహార నాణ్యతలపై కఠిన హెచ్చరికలు.. మంత్రి ఆకస్మిక పర్యటన!
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద అతను ఉండగా సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకువెళ్లి నయన్ చంద్ర నాయక్ ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో సత్నామ్ సింగ్ ను తానే హత్య చేసినట్టుగా అతను అంగీకరించాడు. కొన్ని రోజుల క్రితం తనకు డబ్బు అవసరమై సత్నామ్ సింగ్ ను అడుగగా అతను బంగారు గొలుసు ఇచ్చినట్టు వెల్లడించాడు. దానిని కుదువబెట్టి డబ్బు తీసుకున్నట్టు తెలిపాడు.
అయితే, ఇటీవలిగా తన బంగారు గొలుసు కోసం సత్నామ్ సింగ్ ఒత్తిడి చేస్తుండటంతో పథకం ప్రకారం ఇంటికి తీసుకెళ్లి హతమార్చినట్టు చెప్పాడు. నిందితున్ని అరెస్ట్ చేయటంలో కీలకపాత్ర వహించిన ఏసీపీ ఎల్.రమేశ్, సీఐ రాంబాబు, ప్రత్యేక బృందంలోని సిబ్బందిని డీసీపీ శిల్పవల్లి అభినందించారు. అందరికీ త్వరలోనే రివార్డులు అందచేయనున్నట్టు తెలిపారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు