Janajagran Abhiyan: వక్ఫ్ చట్టంపై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో ప్రజల్లో దీనిపై అవగాహన కల్పించేందుకు బీజేపీ గ్రామ స్థాయిలో జనజాగరణ్ అభియాన్‌ను చేపట్టనున్నది. రాష్ట్రమంతా ప్రచారం చేసేందుకు సీనియర్ నేతలకు ప్రత్యేకంగా వర్క్ షాప్‌ను స్టేట్ పార్టీ ఆఫీస్‌లో గురువారం నిర్వహిస్తున్నది. ఇందులో అవగాహన కలిగించిన తర్వాత ఈ నెల 20 నుంచి వచ్చే నెల 5 వరకు అన్ని గ్రామాలు కవర్ అయ్యే విధంగా అభియాన్‌ను రాష్ట్ర పార్టీ నిర్వహించనున్నది.
ముస్లిం జనాభా ఎక్కువగా ఉండే కాలనీలు, గ్రామాల్లో ఎక్కువ ఫోకస్ పెట్టాలనుకుంటున్నది. వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న విపక్షాల రాజకీయ ప్రయోజనాలను, ఓటు బ్యాంక్ పాలిటిక్స్ ను వివరించాలన్నది ఈ జాగరణ్ ప్రధాన ఉద్దేశం. కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగానే ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వారి అభివృద్ధిని అడ్డుకుంటున్నదని కిషన్ రెడ్డి ఆరోపించారు.
దీర్ఘకాలంగా ముస్లింలను కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకుగా మాత్రమే పరిగణించిందని, ప్రస్తుతం ఉన్న వక్ఫ్ భూములు కొద్దిమంది ముస్లిం పొలిటీషియన్లకు మాత్రమే ఉపయోగపడుతున్నాయని, దీని ఫలాలు ఆ కమ్యూనిటీలోని పేదలకు అందాల్సిన అవసరం ఉన్నదని, అందుకే వక్ఫ్ చట్టానికి సవరణలు చేశామని కిషన్‌రెడ్డి నొక్కిచెప్పారు.
వక్ఫ్ చట్టాన్ని కాంగ్రెస్ సహా దానికి రాజకీయంగా అనుబంధంగా ఉన్న పార్టీలు మత కోణంలోనే చూస్తున్నాయని, అందుకే దుష్ప్రచారం చేస్తున్నాయని, ముస్లింలను తప్పుదోవ పట్టిస్తున్నాయని, వాస్తవాన్ని వివరించేందుకే అభియాన్‌ను రూపొందించినట్లు వివరించారు. ఈ చట్టం కారణంగా మసీదులకు, కబర్‌స్థాన్‌లకు ఎలాంటి నష్టమూ జరగదన్నారు. ఇప్పటికే దేశంలో దాదాపు 80% వక్ఫ్ ఆస్తులు ఆక్రమణలకు గురయ్యాయని నివేదికల ద్వారా వెల్లడైందని కిషన్‌రెడ్డి గుర్తుచేశారు.
కంచ గచ్చిబౌలిపై సుప్రీం వ్యాఖ్యలు హర్షణీయం
కంచ గచ్చిబౌలి భూముల్లో బుల్డోజర్లను పెట్టి పర్యావరణానికి విఘాతం కల్గించడంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు మందలించడం ఆహ్వానించదగిన అంశమని, ఇప్పటికైనా తప్పును సవరించుకోవాలని కిషన్‌రెడ్డి సూచించారు. ఇప్పటికే ధ్వంసమైన 100 ఎకరాల ప్రాంతంలో మొక్కలు నాటి పర్యావరణానికి వెంటనే బీజం వేస్తే మంచిదన్నారు. సెలవులను అవకాశంగా తీసుకుని అర్ధరాత్రి సైతం ఫ్లడ్ లైట్ల వెలుతురులో చెట్లను రాత్రికిరాత్రి నరికేయడం దుర్మార్గమన్నారు. సుప్రీంకోర్టు బుధవారం ఏం చెప్పిందో ప్రధాని సైతం అదే చెప్పారని గుర్తుచేశారు.
Also read: Konda Surekha: దేవాదాయ శాఖపై సమీక్ష.. మంత్రి సురేఖ కీలక ఆదేశాలు!
రాష్ట్ర ప్రభుత్వ దుందుడుకు చర్యలను బీజేపీ మొదటి నుంచీ తప్పుపడుతూనే ఉన్నదని, విద్యార్థులకు అండగా నిలిచిందని గుర్తుచేశారు. భూముల అమ్మకం, అభివృద్ధి సంగతి తమకు అవసరం లేదని, కానీ ఆ చర్యలతో పర్యావరణం ధ్వంసం కావొద్దన్నారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ కాంక్రీట్ జంగిల్‌గా మారిన తరుణంలో చుట్టుపక్కల ప్రాంతాల్లోని వణ్యప్రాణులు, పక్షులు కంచ గచ్చిబౌలి ప్రాంతంలోని చెట్లను ఆవాసంగా మార్చుకున్నాయని గుర్తుచేశారు.