Nalgonda Murder Case: తన కూతురు కాపురం నాశనం కావడానికి కారణమంటూ అల్లుడి సోదరుడిని మామ హత్య చేయించాడు. ఇటీవల నల్లగొండ పట్టణంలో మణికంఠ కలర్ ల్యాబ్ యాజమాని సురేశ్ హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మీడియాకు వివరాలను వెల్లడించారు. హైదరాబాద్‌లోని కొత్తపేటకు చెందిన రిటైర్డ్ ఎక్సైజ్ సీఐ మాతరి వెంకటయ్య తన కూతురు గద్దపాటి ఉమామహేశ్వరి నకిరేకల్ పట్టణానికి చెందిన గద్దపాటి నరేశ్‌తో 2017లో వివాహం జరిగింది. ఉమామహేశ్వరి ఎంబీబీఎస్ వైద్యురాలు.
అయితే కొన్నాళ్లపాటు సజావుగానే సాగిన కాపురంలో కలతలు మొదలయ్యాయి. నరేశ్ మరో స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో పాటు భార్య ఉమామహేశ్వరిని మానసికంగా, శారీరకంగా వేధించేవాడు. ఈ క్రమంలోనే భార్యభర్తల మధ్య కోర్టు కేసులు నడుస్తున్నాయి. అయితే నరేశ్ సోదరుడు మణికంఠ కలర్ ల్యాబ్ యజమాని సురేశ్ ప్రోత్సాహం వల్ల నరేశ్ అలా తయారయ్యాడని ఉమామహేశ్వరి, ఆమె తండ్రి మాతరి వెంకటయ్య భావించారు. సురేశ్‌ను అంతమొందిస్తే.. తన అల్లుడు నరేశ్‌కు బుద్ది వచ్చి కూతురుతో సజావుగా కాపురం చేస్తారని భావించారు. దీంతో తండ్రీకూతుళ్లు పక్కా ప్లాన్ వేశారు.
అందులో భాగంగానే హైదరాబాదులోని కొత్తపేటకు చెందిన స్కౌట్ డిటెక్టివ్ ఏజెన్సీకి చెందిన చిక్కు కిరణ్ కుమార్ అలియాస్ సీకే కుమార్‌ను సంప్రదించి అతడి ద్వారా నిఘా పెట్టించాడు. దర్యాప్తులో నరేష్ మరో మహిళతో సహజీవనం చేస్తూ ఒక పాపను కన్నాడని సమాచారం వచ్చింది. ఈ తతంగానికి సురేషే ప్రోత్సాహకుడేనని నమ్మిన వెంకటయ్య, అతని కూతురు ఉమా మహేశ్వరి ఇద్దరు బలంగా నిర్ణయించుకుని అతడిని హత్య చేయించాలని నిర్ణయించుకున్నారు.
ఇదే విషయం కిరణ్ కుమార్‌కు చెప్పగా, అందుకు తాను నేను గతంలో నేవీలో కమ్యూనికేషన్ వింగ్‌లో పని చేశానని, ఆధారాలు ధోరక్కుండా హత్య ఏ విధంగా చేయాలో తనకు బాగా తెలుసునని చెప్పాడు. అందుకోసం రూ.15లక్షలు ఇస్తే హత్య చేస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు. అంధులో భాగంగా రూ.2లక్షల అడ్వాన్స్ ముట్టజెప్పారు. ఈ పథకంలో భాగంగానే చిక్కు కిరణ్ కుమార్ నెల రోజుల క్రితం తన బంధువు ముషం జగదీష్‌ను చేరదీసి అతడికి రూ.3 లక్షలు ఇస్తానని ఆశ చూపించారు.
Also Read; Damodara Rajanarsimha: ఉద్యోగాలు సాధించే మార్గాలు.. మంత్రి దామోదర సూచనలు
దీంతో ముషం జగదీష్ నెల రోజులుగా నల్లగొండలో తిరుగుతూ గద్దపాటి సురేశ్ కదలికలపై హత్య గురించి రెక్కీ నిర్వహించారు. అనంతరం ఈనెల 11న కిరణ్ కుమార్, ముషం జగదీష్ కలిసి రాత్రి 10.20 గంటల సమయంలో మణికంఠ కలర్ ల్యాబ్ వద్దకు చేరుకున్నారు. అర్జెంటుగా ఫొటోలు ప్రింట్ కావాలని మాటల్లో పెట్టారు. పనిలో నిమగ్నమైన సురేశ్‌పు కత్తులతో దాడి చేసిన గొంతు కోసి హత్య చేశారు.
అనంతరం ద్విచక్ర వాహనంపై చెర్వుగట్టుకు వెళ్లి రక్తం అంటిన బట్టలు, కత్తులు కారులో పెట్టుకుని మూసీ వాగు సమీపంలో చెట్ల పొదల్లో విసిరేసి హైదరాబాద్ పారిపోయారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. హత్యకు ఉపయోగించిన కారు, ద్విచక్ర వాహనాలు, మొబైల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును నల్లగొండ డీఎస్పీ కె.శివరాంరెడ్డి ఆధ్వర్యంలో నల్లగొండ టూటౌన్ సీఐ ఎస్.రాఘవరావు, శాలిగౌరారం సీఐ కొండల్ రెడ్డి, నల్లగొండ వన్ టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి, ఎస్ఐలు వై.సైదులు, సైదాబాబు, విష్ణుమూర్తి, సాయిప్రశాంత్, సిబ్బంది నాలుగు బృందాలుగా ఏర్పడి చేధించారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు