Investments in TG: ప్రజా ప్రభుత్వం తీసుకొచ్చిన క్లీన్ అండ్ గ్రీన్ న్యూ ఎనర్జీ పాలసీకి ఆకర్షితులై జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. హైదరాబాద్, రాజేందర్ నగర్ లోని తెలంగాణ ఇన్స్టిట్యూట్ రూరల్ డెవలప్మెంట్ సంస్థలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు సమక్షంలో రూ.29 వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి రెడ్కో తో ఎకోరేస్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, జీసీఆర్ఎస్ ఆర్య ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రతినిధులు ఎంవోయూ చేసుకున్నారు.
అనంతరం జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడారు. న్యూ ఎనర్జీ పాలసీ తీసుకురావడం వల్ల రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్లా శ్రీధర్ బాబులు దావోస్ వెళ్ళినప్పుడు సన్ పెట్రో కంపెనీ 3400 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ విద్యుత్తు ఉత్పత్తి చేయడానికి రూ. 20వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి ఎంఓయు చేసుకున్నదని గుర్తు చేశారు. అదే విధంగా మెగా కంపెనీ 1500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ఉత్పత్తి చేయడానికి 7500 కోట్లు పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చిందన్నారు.
Also Read: Sheep Distribution Scheme: ఆ స్కాంలో దూకుడు పెంచిన ఈడి.. విస్తుపోయే అంశాలు వెలుగులోకి!
ఈ రెండు కంపెనీలు డిపిఆర్ తయారు చేసే పనిలో ఉన్నాయని తెలిపారు. మరి కొద్ది రోజుల్లోనే ఈ రెండు కంపెనీలకు చెందిన కొత్త ప్రాజెక్టులు రాష్ట్రంలో మొదలవుతాయని చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ వల్ల రాష్ట్రంలో 27 వేల కోట్ల పెట్టుబడులతో 5600 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేయడానికి ఎకోరేస్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ముందుకొచ్చి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంతో ఎం ఓ యు చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి కోసం రాష్ట్రంలో వస్తున్న పెట్టుబడులతో రాష్ట్ర ప్రజల విద్యుత్ అవసరాలు అధిగమించడానికి త్వరితగతిన ముందుకెళ్లే అవకాశం ఉందన్నారు.
ఇక 2023 సంవత్సరంలో 15,623 మెగావాట్ల గరిష్ట పిక్ డిమాండ్ రాగా,ఈ సంవత్సరం మార్చి 20న 17,162 మెగావాట్ల గరిష్ఠ పీక్ డిమాండ్ చేరుకున్నప్పటికీ పకడ్బందీ వ్యూహంతో ఎలాంటి ఇంట్రప్షన్ లేకుండా నాణ్యమైన విద్యుత్తును వినియోగదారులకు సరఫరా చేశామని చెప్పారు. హైదరాబాద్ మహానగరం రోజు రోజుకి అభివృద్ధి చెందడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా చేపడుతున్న రీజినల్ రింగ్ రోడ్, మూసి పునర్జీవం, ఫ్యూచర్ సిటీ ఇలా అనేక రకాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో విద్యుత్ అవసరాలు పెరుగుతాయని కొన్ని సంస్థలు అధ్యయనం చేసి కేంద్రానికి పంపిన నివేదికల ఆధారంగా 2029-30 నాటికి 24,215 మెగావాట్ల గరిష్ట డిమాండ్, 2034- 35 నాటికి 31 809 మెగావాట్ల గరిష్ట డిమాండ్ పెరుగుతుందని అంచనా వేసుకొని దీనికి అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తికి, క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీకి ప్రణాళికలు తయారు చేసుకొని ప్రభుత్వం ముందుకెళ్తున్నదని వివరించారు .
2030 నాటికి 20వేల మెగావాట్లు, 2035 నాటికి మరో 20వేల మెగావాట్లు మొత్తం 40 వేల మెగావాట్లు గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు తయారు చేసుకొని యాక్షన్ ప్లాన్ తో ముందుకుపోతున్నదని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన న్యూ ఎనర్జీ పాలసీ పెట్టుబడులను ఆకర్షించే విధంగా ఉండటంతో చాలామంది రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేయడానికి ముందుకు వస్తున్నారని వెల్లడించారు.టీజీ రెడ్కో తో ఎంఓయూ చేసుకున్న ఎకోరేస్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు యాక్షన్ ప్లాన్ రూపొందించుకొని, క్యాలెండర్ ఫిక్స్ చేసుకొని నిర్దిష్ట గడువులోగా గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిని అందుబాటులోకి తీసుకురావాలని, ఇందు కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావలసిన సహాయ సహకారాలు అందిస్తామని వెల్లడించారు.
ఇందిరా గిరి సోలార్ జల వికాసం పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఈ పథకానికి సంబంధించిన విధి విధానాల ఖరారులో వేగం పెంచాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన మహాత్మ జ్యోతి రావు పూలే ప్రజాభవన్లో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
అడవులను పెంచుతూనే, గిరిజనులకు ఆదాయం సమకూర్చడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. ఈ పథకానికి 12,500 కోట్లు వెచ్చించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు డిప్యూటీ సీఎం అధికారులకు వివరించారు. గతంలో ఏ ప్రభుత్వము గిరిజనుల వ్యవసాయ అభివృద్ధికి ఇంత పెద్ద మొత్తంలో ఏకకాలంలో నిధులు కేటాయించలేదు అన్నారు. గిరిజనులకు ఆర్ వో ఎఫ్ ఆర్ చట్టం కింద కేటాయించిన భూములను సాగులోకి తీసుకొచ్చేందుకు గిరిజనులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఇందిరా సోలార్ జల వికాసం ఉపయోగపడుతుందన్నారు.
పట్టాలు పొందిన గిరిజనుల భూముల్లో జల వనరుల లభ్యత కోసం జియాలజికల్ సర్వే, తదుపరి బోర్లు వేయడం, సోలార్ పంపు సెట్లు బిగించడం అన్ని పనులు ఒకే ఏజెన్సీకి కేటాయించాలని తద్వారా జాప్యం జరగకుండా, గిరిజన రైతులు ఇబ్బందులు పడకుండా పథకం అమలు సులభతరం అవుతుంది అన్నారు. మొదట ఈ పథకాన్ని ఆదిలాబాద్, భద్రాద్రి- కొత్తగూడెం జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేసేందుకు ఆయా జిల్లా అధికారులతో సంప్రదింపులు జరపాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు.
మే రెండో వారంలోగా పథకం అమలుకు అవసరమైన అన్ని పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, అటవీశాఖ ప్రధాన కార్యదర్శి అహ్మద్ నదీమ్, గిరిజన శాఖ కమిషనర్ శరత్, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్, ముషారఫ్ ఫరూకి, ఉద్యాన శాఖ కమిషనర్ యాస్మిన్ భాష తదితరులు పాల్గొన్నారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు