తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: Sheep Distribution Scheme: సంచలనం సృష్టించిన గొర్రెల స్కాంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు దూకుడు పెంచారు. వందల కోట్ల రూపాయల ఈ కుంభకోణంలో ‘బ్లాక్ షీప్స్’ ఎవరన్నది తెలుసుకునే దిశగా చర్యలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస రావును ఈడీ కార్యాలయానికి పిలిపించి సుదీర్ఘంగా విచారించారు. గొర్రెల పంపిణీ పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని యూనిట్లను పంపిణీ చేశారు? ఏయే జిల్లాల్లో ఎన్ని యూనిట్లు ఇచ్చారు? లబ్దిదారులు ఎంతమంది? వారి వివరాలు ఏమిటి? అన్న అంశాలకు సంబంధించి ప్రశ్నించినట్టుగా సమాచారం. ఈ క్రమంలో శ్రీనివాస రావు కొంత సమాచారాన్ని ఈడీ అధికారులకు అందించినట్టుగా తెలిసింది.
డొంక కదిలింది ఇలా…
గత బీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పగా చెప్పుకున్న గొర్రెల పంపిణీ పథకం 2017లో ప్రారంభమైన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ పథకానికి 12వేల కోట్ల రూపాయలను కేటాయించారు. కాగా, ఈ స్కీంలో జరిగిన అక్రమాల డొంక 2024, జనవరిలో కదిలింది. అప్పట్లో పశు సంవర్ధక శాఖలో ఏడీలుగా పని చేసిన రవికుమార్, కేశవ్ తోపాటు ప్రైవేట్ కాంట్రాక్టర్ మొయినుద్దీన్ అతని కొడుకు ఇక్రముద్దీన్ లు 2023, ఆగస్టు 18న ఆంధ్రప్రదేశ్ పల్నాడు మండలం అంగలూరు గ్రామానికి చెందిన సన్నెబోయిన ఏడుకొండలుతోపాటు మరో 17మంది నుంచి 133 యూనిట్లు (ఒక్కో యూనిట్ లో 20 గొర్రెలు, 1 పొట్టేల్) కొనుగోలు చేశారు.
Also Read: Naini Coal Block: యావత్ తెలంగాణ గర్వించదగ్గ విషయ మిది.. భట్టి విక్రమార్క
ఈ క్రమంలో వారికి చెల్లించాల్సిన 2.10 కోట్ల రూపాయలను బ్యాంక్ ఖాతాల్లో వేస్తామని ఏడుకొండలుతోపాటు మిగితా 17మందికి సంబంధించిన బ్యాంక్ ఖాతాల వివరాలు, ఆధార్ కార్డులు తీసుకున్నారు. అయితే, డబ్బు మాత్రం జమ చేయలేదు. దాంతో అధికారులు చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోయిన ఏడుకొండలు, మిగితా 17మంది 2024, జనవరిలో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కాగా, ఈ కేసులు ఆ తరువాత ఏసీబీకి బదిలీ అయ్యాయి.
700కోట్లకు పైగా…
ఏసీబీ అధికారులు జరిపిన విచారణలో గొర్రెల పంపిణీ పథకంలో 700 కోట్ల రూపాయలకు పైగా అక్రమాలు జరిగినట్టుగా వెల్లడైంది. దర్యాప్తులో చాలామందికి గొర్రెలు పంపిణీ చేయకుండానే చేసినట్టుగా రికార్డుల్లో చూపించి ఈ స్కాంలోని సూత్రధారులు, పాత్రధారులు కోట్లాది రూపాయలను దిగమించినట్టుగా తెలిసింది. నిజానికి ఈ పథకాన్ని ప్రారంభించినపుడు ఒక్కో యూనిట్ ను 1.25లక్షలకు కొనుగోలు చేయాలని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, ప్రైవేట్ కాంట్రాక్టర్ మొయినుద్దీన్ అతని కుమారుడు ఇక్రముద్దీన్ తెర పైకి వచ్చిన తరువాత ఈ యూనిట్ ధరను 1.25 లక్షల నుంచి 1.75లక్షలకు పెంచినట్టుగా ఏసీబీ అధికారుల విచారణలో నిర్ధారణ అయ్యింది.
అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయకున్నా అనధికారికంగా యూనిట్ ధరను పెంచినట్టు స్పష్టమైంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలోని ఇద్దరు కీలక మంత్రుల కనుసన్నల్లోనే ఈ వ్యవహారం జరిగినట్టుగా బలమైన ఆరోపణలు వినిపించాయి. ప్రైవేట్ కాంట్రాక్టర్ అయిన మొయినుద్దీన్ కు ఆ ఇద్దరు మంత్రులతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నట్టుగా వార్తలొచ్చాయి. ఈ క్రమంలో మొయినుద్దీన్ చెప్పినట్టు వినాలని ఆ ఇద్దరు మంత్రులు గొర్రెల కొనుగోళ్లకు సంబంధించి నియమించిన నోడల్ అధికారులకు మౌఖికంగా ఆదేశాలు జారీ చేసినట్టుగా కూడా ప్రచారం జరిగింది.
అధికారుల అరెస్ట్…
ఈ క్రమంలో విచారణను ముమ్మరం చేసిన ఏసీబీ అధికారులు ఈ కేసులో గొర్రెల కొనుగోలుకు సంబంధించి నోడల్ అధికారులుగా వ్యవహరించిన కామారెడ్డి జిల్లా పశువైద్య శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ రవి, మేడ్చల్ జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఆదిత్య కేశవసాయి, రంగారెడ్డి జిల్లా భూగర్భ జల శాఖ అధికారి రఘుపతి రెడ్డి, వయోజన విద్య శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ గణేశ్, పశు సంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ అంజిలప్ప, అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణయ్య, రాష్ట్ర గొర్రెలు, మేకల సమాఖ్య అభివృద్ది సమాఖ్య ఎండీగా పని చేసిన రాంచందర్ నాయక్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వద్ద ఓఎస్డీగా పని చేసిన కళ్యాణ్ లను అరెస్ట్ చేశారు.
అసలైన బ్లాక్ షీప్స్ పరార్…
కాగా, ఈ కేసులో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలోని కీలక మంత్రుల అండతో చక్రం తిప్పిన ప్రైవేట్ కాంట్రాక్టర్ మొయినుద్దీన్, అతని కుమారుడు ఇక్రముద్దీన్ కేసులు నమోదు కాగానే దుబాయ్ పారిపోయారు. అప్పటి నుంచి తిరిగి రాలేదు. ఈ ఇద్దరిని విచారిస్తేనే ఈ కుంభకోణంలో అసలు సూత్రధారులు ఎవరన్నది వెల్లడయ్యే అవకాశాలున్నాయి. ఈ క్రమంలో ఏసీబీ ఈ ఇద్దరిపై లుక్ ఔట్ నోటీసులు కూడా జారీ చేసింది.
రంగంలోకి ఈడీ…
గొర్రెల కుంభకోణానికి సంబంధించి ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా గత సంవత్సరమే ఈడీ ఈసీఐఆర్ జారీ చేసింది. ఈ క్రమంలో నోడల్ ఆఫీసర్లుగా వ్యవహరించిన కొంతమంది అధికారులను అప్పట్లో పిలిపించిన ఈడీ అధికారులు వారిని విచారించారు. తాజాగా ఈ కేసులో ఈడీ అధికారులు దూకుడు పెంచారు. పశు సంవర్దక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్ రావును కార్యాలయానికి పిలిపించుకుని విచారణ చేశారు.
ఆయన నుంచి గొర్రెల పంపిణీ పథకానికి సంబంధించి కీలక వివరాలను తీసుకున్నట్టు సమాచారం. ఇక, ఇప్పటికీ దుబాయ్ లోనే ఉన్న ప్రైవేట్ కాంట్రాక్టర్ మొయినుద్దీన్ అతని కుమారుడు ఇక్రముద్దీన్ లను వెనక్కి రప్పించటానికి మరిన్ని చర్యలు తీసుకోవాలని ఈడీ అధికారులు నిర్ణయించినట్టుగా తెలిసింది. ఈ ఇద్దరిపై త్వరలోనే రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని భావిస్తున్నట్టు సమాచా అవసరమైతే పాస్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు కేసు వివరాలను పంపించి మొయినుద్దీన్, ఇక్రముద్దీన్ ల పాస్ పోర్టులను రద్దు చేయించాలని కూడా భావిస్తున్నట్టు తెలిసింది.
Also Read: స్వేచ్ఛ Eపేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/
ఈడీకి చెందిన ఓ సీనియర్ అధికారితో మాట్లాడగా ఈ కేసులోని డబ్బు విదేశాలకు కూడా తరలినట్టుగా తమకు సమాచారం ఉందన్నారు. ఈ క్రమంలోనే మనీలాండరింగ్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేసినట్టు చెప్పారు. మొయినుద్దీన్, ఇక్రముద్దీన్ లను అరెస్ట్ చేసి విచారిస్తే ఎంత డబ్బు దేశం దాటింది? ఈ కుంభకోణంలో అసలు సూత్రధారులు ఎవరు? అన్న వివరాలు వెలుగు చూస్తాయన్నారు. అందుకే వారిని వెనక్కి రప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.