తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: Motor Fre Tap Drive: హైదరాబాద్ మహా నగరంలో అక్రమ మోటార్ వాడకాన్ని అరికట్టడానికి, నీటి వృథాను నివారించేందుకు జలమండలి మోటార్ ఫ్రీ టాప్ డ్రైవ్‌ను ప్రారంభించింది. ఈ డ్రైవ్ లో ప్రధానంగా లో ప్రెజర్ ఉన్న ప్రాంతాల్లో మోటార్లను వినియోగించే వినియోగదారులను గుర్తించి చర్యలు తీసుకోనున్నారు. ఈ డ్రైవ్‌లో ఎండీ నుంచి క్షేత్ర స్థాయిలో సిబ్బందితో కలిసి పాల్గొని కొన్ని ప్రాంతాల్లో మొదటి రోజే 64 మోటార్లను సీజ్ చేసి, 84మంది వినియోగదారులకు పెనాల్టీలను విధించారు. ఈ డ్రైవ్ ప్రారంభించిన జలమండలి ఎండీ అశోక్ రెడ్డి విజిలెన్స్, స్థానిక అధికారులతో కలిసి మాదాపూర్ లోని కాకతీయ హిల్స్ లో నీటి సరఫరా సమయంలో పర్యటించి తనిఖీలు నిర్వహించారు.
కొంతమంది అపార్ట్ మెంట్ వాసులతో ముచ్చటించిన ఎండీ దాదాపు 150 కిలో మీటర్ల నుంచి పెద్ద పంపులు, భారీ పైపుల ద్వారా నగర పౌరులకు జలమండలి నీటి సరఫరా చేస్తుందని, వెయ్యి లీటర్లు శుద్ధి చెయ్యడానికి రూ. 50 వరకు ఖర్చు చేసి తాగునీరు సరఫరా చేస్తున్నామని, అలాంటి నీటిని మొక్కలకు, ఫ్లోర్, వాహనాలు కడగడానికి వినియోగించరాదని సూచించారు. ఈ సందర్బంగా ఎండీ మాట్లాడుతూ జలమండలి సుదూర ప్రాంతాల నుంచి నీటిని శుద్ధి చేసి సరఫరా చేస్తున్నామని, నీటిని వృథా చేయకుండా వాటిని తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించాలని కోరారు.
ఇప్పటికే నగరంలో భూగర్భ జలాలు అడుగంటిపోగా, కొన్ని ప్రాంతాల్లో ట్యాంకర్లకు డిమాండ్ పెరిగిందన్నారు. రానున్నరోజులలో నీటికి ఇబ్బంది ఏర్పడే అవకాశమున్నందున ప్రజలు తాగేందుకు సరఫరా చేసే శుద్ధమైన నీటిని గార్డెనింగ్, నిర్మాణం తదితర అవసరాలకు వృధా చేయకూడని విజ్ఞప్తి చేసారు. నల్లాలకు మోటార్లు బిగించి నీటిని తోడితే మిగితా వినియోగదారులకు లో ప్రెషర్ తో నీటి సరఫరా కావడంతో ఇబ్బంది పడుతున్నారని వివరించారు. అలాగే నీటి సరఫరా అవసరాలకు సరిపోక ట్యాంకర్ బుక్ చేస్తున్నారని, దీంతో ట్యాంకర్ డిమాండ్ పెరుగుతున్నట్లు చెప్పారు.
Also Read: Uppal balu on Aghori: లేడీ అఘోరీని ‘బావా’ అంటూ శ్రీవర్షిణి పిలుపు.. ఉప్పల్ బాలు ఫైర్..
ఇలాంటి సమస్యలను, ఇబ్బందులను అధిగమించేందుకే ఈ డ్రైవ్ చేపట్టినట్టు వెల్లడించారు. ఈ డ్రైవ్ జలమండలి పరిధిలోని అన్ని డివిజన్ ప్రాంతాల్లో నిర్వహిస్తామని, ఈడీ నుంచి కిందిస్థాయి లైన్ మెన్ వరకు పాల్గొని అక్రమ మోటార్లు ను సీజ్ చేసి నీటి వృధా అరికట్టాలని సూచించారు. అంతకు ముందు ప్రాంతంలోని అపార్ట్‌మెంట్ వాసులు జలమండలి పైపులైనుకు నేరుగా విద్యుత్ మోటార్లు బిగించి నీటిని అక్రమంగా తోడుతున్న వినియోగదారులను గుర్తించి జలమండలి విజిలెన్స్ సిబ్బంది మోటార్లు సీజ్ చేసారు. అత్యధికంగా అపరేషన్ అండ్ మెుయింటనెన్స్ డివిజన్ లో 6 ఎస్ఆర్ నగర్ పరిధిలో 25 మోటార్లు సీజ్ చేసి పెనాల్టీలు విధించినట్లు ఎండీ తెలిపారు.
నల్లా మోటర్ బిగించడం చట్టరీత్యా నేరం: ఎండీ అశోక్ రెడ్డి
మహా నగరానికి తాగు నీరు అందించేందుకు ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి సుదూర ప్రాంతాల నుంచి పైపు లైన్ల ద్వారా తాగునీరు సరఫరా చేస్తున్నామని, అందరికి నీరు సమపాళ్లలో పంపిణీ కావాలి, కానీ కొన్ని ప్రాంతాల్లో వినియోగదారులు తమ నల్లాలకు అక్రమంగా మోటార్లు అమర్చి నీటిని తోడుతున్నారని, ఇదీ చట్టరీత్యా నేరమని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి అన్నారు. కొందరి వల్ల మిగిలిన వినియోగదారులకు లో ప్రెషర్‌తో నీటి సరఫరా జరుగుతోందని, ఎవరైనా వినియోగదారులు ఇలా తమ నల్లాలకు మోటార్లు బిగించి పట్టుబడితే, వారిపై జలమండలి నిబంధనల ప్రకారం జరిమానా విధించడంతోపాటు మోటార్లు సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఒకటికి రెండు సార్లు పట్టుబడితే కేసులు నమోదు చేస్తామని కూడా స్పష్టం చేశారు. వినియోగదారులెవరూ నల్లాకు మోటార్లు బిగించకూడదని, ఒకవేళ తక్కువ ప్రెషర్‌తో నీరు సరఫరా అయినా, లేదా నీటి సరఫరాలో ఏవైనా ఇతర సమస్యలు తలెత్తినా సంబంధిత మేనేజర్, డీజీఎం, జీఎం అధికారులను సంప్రదించాలని, వారు స్పందించని పక్షంలో జలమండలి కస్టమర్ కేర్ నంబర్ 155313కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని ఎండీ తెలిపారు.
Also Read: స్వేచ్ఛ Eపేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/