Sarees theft Case: అటెన్షన్ డైవర్షన్ కి పాల్పడుతూ చీరలు దొంగిలిస్తున్న ముఠాను మియాపూర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఇందుకు సంబంధించిన వివరాలను శనివారం మియాపూర్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మియాపూర్ ఏసీపీ శ్రీనివాస్ కుమార్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లాకు చెందిన కొంతమంది ఓ ముఠాగా ఏర్పడి గార్మెంట్ దుకాణాలలోకి గుంపుగా వెళ్లి దుకాణ యజమాని, సేల్స్ సిబ్బంది అటెన్షన్ డైవర్షన్ చేసి విలువైన చీరలను దొంగిలిస్తున్నారు.
కాగా ఈనెల 3వ తేదీన మియాపూర్ ఫ్రెండ్స్ కాలనీలోని ఓ చీరల దుకాణంలో ఖరీదైన చీరలు దొంగిలించారంటూ మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదు పై దర్యాప్తు చేపట్టిన పోలీసులు చీరల దొంగల ముఠా గుట్టును రట్టు చేశారు. కొంతమంది సభ్యులు గుంపుగా ఏర్పడి బట్టల దుకాణాల్లోకి వెళ్లి అక్కడున్న వారిని మాటలతో మభ్యపెట్టి చీరలు దొంగిలించడాన్ని పోలీసులు గుర్తించారు.
Also read: Duddilla Sridhar Babu: మహిళలకు గుడ్ న్యూస్.. మీ కోసమే పారిశ్రామిక పార్కులు.. ఎక్కడంటే!
ఇదే తరహాలో మధురానగర్, సరూర్ నగర్, కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో చీరలు దొంగిలించినట్లు గుర్తించారు. ఈ ముఠా గత 30 సంవత్సరాలుగా దొంగతనాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. ఈ మేరకు కనుమూరి వెంకటేశ్వరరావు, కట్ట యశోద, కంప రమణ, దేవరకొండ సుభాషిని, సదుపాటి తిరుపతమ్మ, సదుపాటి వెంకటేశ్వరమ్మ, సురుగంటి వెంకటేశ్వర్లను అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు. చాకచక్యంగా చీరల దొంగ ముఠాను పట్టుకోవడంలో కృషిచేసిన మియాపూర్ ఇన్స్పెక్టర్ క్రాంతి, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రమేష్ నాయుడు, కానిస్టేబుళ్లు ప్రేమ్ కుమార్, చంద్రబోస్, పుల్యా నాయక్, పూర్ణచందర్, సాయి కృష్ణ లను ఏసీబీ ప్రత్యేకంగా అభినందించారు.