Duddilla Sridhar Babu: ప్రతి నియోజకవర్గంలో మహిళల కోసం ప్రత్యేకంగా పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. హైటెక్స్ లో జూన్ 12 నుంచి 14 వరకు నిర్వహించనున్న “ఫుడ్ ఏ ఫెయిర్” రెండో ఎడిషన్ బ్రోచర్ ను ఆయన లాంఛనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, హైటెక్స్ ఎగ్జిబిషన్స్, తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ సంయుక్త ఆద్వర్యంలో ఈ ప్రదర్శనను నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
ఆహార ఉత్పత్తిదారులు, ఆహార శుద్ధి నిపుణులు, ప్యాకేజింగ్ ఇండస్ట్రీ నిపుణులు, చెఫ్స్ తదితరులు ఈ ప్రదర్శనలో పాల్గొని వివిధ అంశాలపై మేధోపర చర్చలు చేస్తారన్నారు. ఐటీ, ఫార్మా మాదిరిగానే వ్యవసాయ, వ్యవసాయాధారిత పరిశ్రమల రంగంలోనూ తెలంగాణను దేశంలోనే మొదటి స్థానంలో నిలపడం తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పరిశ్రమల ఏర్పాటుకు తెలంగాణలో అనుకూల పరిస్థితులు ఉన్నాయన్నారు.
Also Read: Pastor Praveen’s death: పాస్టర్ ప్రవీణ్ కేసులో కొత్త షాకింగ్ నిజాలు.. క్లియర్ కట్ గా చెప్పేశారుగా!
ఇప్పటికే ఈ రంగంలో రూ.16వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, అవి వివిధ దశల్లో ఉన్నాయన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 7150 ఎకరాల్లో 14 స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్స్ ఉన్నాయని, రాబోయే రోజుల్లో టైర్ 2, టైర్ 3 నగరాలు, పట్టణాల్లో ఏర్పాటు చేసేందుకు ప్రాధాన్యమిస్తామన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 6800 కు పైగా మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఉన్నాయని, కొత్తగా ఏర్పాటు చేసే ఔత్సాహికులకు ప్రభుత్వం ఆర్థికంగా అండగా ఉంటుందన్నారు.
కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ కమిషనర్ మల్సూర్, తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ డైరెక్టర్ అఖిల్ “ఫుడ్ ఏ ఫెయిర్” నిర్వాహకులు శ్రీకాంత్, టీజీ శ్రీకాంత్, విశాల రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Also Read: Warangal Job Mela: వరంగల్ జాబ్ మేళాపై కీలక అప్ డేట్.. వారికి జాబ్స్ పక్కా!