Sekhar Basha: దేశంలో మహిళలపై దాడులు నానాటికి పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో పురుషులు సైతం కొందరు మహిళల కారణంగా బాధలు అనుభవిస్తున్నారు. భార్య వేధింపులు తాళలేక ఇటీవల పలువురు భర్తలు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో స్త్రీలకు మహిళల నుంచి రక్షణ ఉన్నట్లే పురుషులకు సైతం వారి నుంచి చట్టపరమైన భద్రత కావాలన్న వాదన రోజు రోజుకు పెరిగిపోతోంది. ఈ క్రమంలో హైదరాబాద్ లో మహిళలకు రక్షణగా ఉన్న షీ టీమ్స్ తరహాలోనే హీ టీమ్స్ కూడా ఉండాలని పలువురు పురుషులు ధర్నాకు దిగడం ఆసక్తికరంగా మారింది.
అసలేం జరిగిందంటే
మహిళల రక్షణకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన షీ టీమ్స్ తరహాలోనే పురుషుల కోసం ప్రత్యేకంగా హీ టీమ్స్ ను ఏర్పాటు చేయాలన్న డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. తాజాగా ఈ విషయం గురించి పట్టుబడుతూ పలువురు మగవారు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద నిరసనలకు దిగారు. సమాజంలో స్త్రీల వల్ల నలిగిపోతున్న పురుషులకు అండగా నిలవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో బిగ్ బాస్ ఫేమ్ శేఖర్ భాషాతో పాటు అడ్వకేట్లు, పలువురు సామాజిక కార్యకర్తలు, భార్య బాధితులు పాల్గొన్నారు.
శేఖర్ భాషా ఏమన్నారంటే
SHE టీమ్స్ తరహాలో HE టీమ్స్ ఏర్పాటు చేయాలని బిగ్ బాస్ ఫేమ్ శేఖర్ బాషా అన్నారు. ఆడవారు తలెత్తుకొని తిరగాల్సిందేనన్న ఆయన.. అలాగానీ మగవారు పిరికివారిగా ఉండిపోకూడదు కదా అని ప్రశ్నించారు. తప్పు చేయకపోయినా తప్పు మాదే అన్న విధంగా కొందరు మగవారు బతకాల్సిన పరిస్థితి ప్రస్తుత సమాజంలో తలెత్తిందని చెప్పారు. ప్రస్తుతం స్త్రీల పక్షాన ఉన్న బలమైన చట్టాల కారణంగా మగవారు నోరు మెదపలేని పరిస్థితి తలెత్తుతున్నట్లు చెప్పారు. ఆడవారు దుర్భషలాడినా మౌనం వహించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: Meenakshi Natarajan: హెచ్ సీయూ వివాదంపై ఏఐసీసీ ఫోకస్.. రంగంలోకి మీనాక్షి నటరాజన్.. సమస్యకు చెక్ పెడతారా?
లావణ్య విషయంలో..
రాజ్ తరుణ్ – లావణ్య కేసుకు సంబంధించి అప్పట్లో పెద్ద ఎత్తున శేఖర్ భాష పేరు వినిపించింది. ఈ వ్యవహారంలో రాజ్ తరుణ్ పక్షాన నిలిచిన అతడు.. లావణ్య వ్యతిరేకంగా పలు డిబేట్లు పాల్గొన్నాడు. అటు లావణ్య సైతం అదే డిబేట్లలో పాల్గొని శేఖర్ బాషాను దుర్భాషలాడింది. ఓ షోలో అయితే ఏకంగా చెప్పుతో దాడి చేసింది. ఈ వ్యవహారంతో ఒక్కసారిగా పాపులర్ అయిన శేఖర్ బాషా.. ఈ క్రమంలోనే బిగ్ బాస్ షోలోనూ అడుగుపెట్టారు. అయితే కొద్ది వారాలకే బయటకు వచ్చేశారు.