Fake Doctors: రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో వైద్యాధికారులు నకిలీ వైద్యులపై కొరడా ఝులిపిస్తున్నారు. ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తుండడంతో తనిఖీలను ముమ్మరం చేశారు. ఈ తనిఖీలలో విస్తుగొలిపే బాగోతాలు బయటపడుతున్నాయి. కొంతమందికి ఎలాంటి అర్హత లేకున్నా డాక్టర్లుగా చలామణి అవుతూ వైద్యం చేస్తున్నారు. మరికొన్ని చోట్ల ఆర్‌ఎంపీలు అర్హతకు మించి వైద్యం చేస్తూ, నర్సింగ్ హోమ్ తరహాలో బెడ్లు వేసి ఆస్పత్రులను నిర్వహిస్తున్నారు.
అబార్షన్లు చేసిన ఉదంతాలు కూడా అక్కడక్కడా బయటపడుతున్నాయి. నిబంధనల ప్రకారం ఆర్‌ఎంపీలు ప్రాథమిక చికిత్స మాత్రమే చేయాలి. ఇంజక్షన్లు కూడా ఇవ్వరాదు. కానీ అర్హతకు మించి చికిత్సలు చేస్తున్నారు. ఎక్కువ మోతాదులో స్టెరాయిడ్స్, యాంటీబయటిక్ ఇస్తున్నారు. గర్భిణులకు, చిన్నపిల్లలకు వైద్యం చేయరాదు. కానీ వీరికి కూడా వైద్యం చేస్తున్నారు.
Also Read: LB Nagar Crime: ఫ్రెండ్ బిడ్డపైనే కన్నేశాడు.. పదేళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు
బయటపడుతున్న నకిలీల బాగోతాలు
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్‌లో జరిపిన తనిఖీల్లో నిబంధనలకు విరుద్దంగా నిర్వహిస్తున్న నాలుగు క్లినిక్‌లను సీజ్ చేయడంతోపాటు, మరో నాలుగు క్లినిక్‌లకు షోకాజ్ నోటీసులను జారీ చేశారు. మేడ్చల్ జిల్లా బాచుపల్లి లో సహజ పాలి క్లినిక్, బుచ్చిబాబు ఫస్ట్ ఎయిడ్ సెంటర్లో నకిలీ జనరల్ ఫిజీషియన్ బాగోతం బయటపడింది. ఇక్కడ యాంటీబయాటిక్స్ రాయడం, ఇంజక్షన్లు ఇవ్వడం గుర్తించారు.
క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం ఉల్లంఘించినందున క్లినిక్ ను సీజ్ చేశారు. మల్కాజిగిరిలో మనోహర్ రెడ్డి పాలి క్లినిక్ లో అల్ట్రాసౌండ్ యంత్రాన్ని సీజ్ చేశారు. రిజిస్టర్ నిర్వహించకపోవడం, ఆన్లైన్లో ఎంట్రీ చేయకపోవడం, సీఈఏ చట్టాన్ని ఉల్లంఘించడంతో సీజ్ చేశారు. జగద్గిరిగుట్టలో శివనాగుల శ్రీనివాస్ నిర్వహిస్తున్న హాసిని క్లినిక్ తనిఖీ చేయగా, ఫార్మ్ డి అర్హత ఉన్న ప్రతీక్ అనే వ్యక్తి జనరల్ ఫిజీషియన్ గా అవతారం ఎత్తి చికిత్స చేస్తున్నట్టు గుర్తించారు. అంతేగాక మూడు పడకలు వేసి ఆసుపత్రిని నిర్వహిస్తున్నారు.
AlSO Read: Minister Jitender Singh: రైతులకు గుడ్ న్యూస్.. ఈ ఎరువులతో పంట సురక్షితమన్న కేంద్ర మంత్రి
దీంతో క్లినిక్ ను సీజ్ చేసి నిర్వాహకులకు నోటీసు జారీ చేశారు. మల్కాజిగిరిలో కృష్ణ ఆసుపత్రిలో స్కానింగ్ మిషను సీజ్ చేశారు. డిఎం ఆస్పత్రిలో తనిఖీ చేసి నోటీసు జారీ చేశారు. బొల్లారం రిసాల బజార్ లోని భవానీ క్లినిక్ లో నకిలీ వైద్యుడిని గుర్తించి క్లినిక్ ను సీజ్ చేశారు. వాయుపురిలో ప్యూర్ ఆర్థో ఆసుపత్రి, శ్రీరక్ష ఆసుపత్రులలో తనిఖీ చేసి నిర్వహణ లోపాలు గుర్తించారు.
ఇవే కాకుండా పెద్ద ఆసుపత్రులలో కూడా పిసిపి, ఎన్‌డిపి సదుపాయాలపై తనిఖీలు నిర్వహించారు. చెంగిచర్లలోని భవిష్య వెల్ విషర్ ఆసుపత్రి తనిఖీలో విస్తుబోయే లోపాలు వెలుగుజూడడంతో యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేయించడంతోపాటు రూ.5లక్షల జరిమానా విధించారు. ఆసుపత్రి రిజిస్ట్రేషన్‌ను 60 రోజుల పాటు సస్పెండ్ చేశారు. వైద్యాధికారులు వరుసగా చేపడుతున్న దాడులతో నకిలీ డాక్టర్లు బెంబేలెత్తిపోతున్నారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు