ఆంధ్రప్రదేశ్ ఎలూరు స్వేచ్చ: ఒంటరిగా ఉన్న మహిళలే అతని టార్గెట్.. సైలెంట్‌గా వస్తాడు..దొరికిన కాడికి దోచుకెళ్తాడు. ఎవరైనా అడ్డొస్తే ఎంతకైనా తెగిస్తాడు. హత్య చేసి ఆనవాళ్లు కూడా లేకుండా చేస్తాడు. పోలీసులకు సైతం దొరకకుండా తప్పించుకు తిరుగుతాడు. ఎవరికీ దొరకకుండా సవాల్ విసురుతున్న ఈ కేటుగాడు చివరకు పోలీసులకు చిక్కాడు. పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఈ రోజు నిందితుడిని ఏలూరు పీజేసీజే కోర్టులో హాజరుపరచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.
మార్చి 27న ఏలూరు జిల్లా, వెన్నవల్లి వారి పేటలో నివాసముండే 65 ఏళ్ల చిట్ల రమణమ్మ అనే వృద్ధురాలు ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకి చొరబడి ఆమెను అత్యంత దారుణంగా హత్య చేశాడు. నిందితుడు నైలాన్ తాడుతో ఆమె గొంతు కోసి, చేతులు, కాళ్ళు కట్టేసి, ఆ తర్వాత ఆమె బంగారు ఆభరణాలను దోచుకున్నాడు. తన నేరానికి ఎలాంటి ఆనవాళ్లు ఉండకుండా చేసేందుకు ఆమె శరీరంపై పెట్రోల్ పోసి నిప్పంటించే ప్రయత్నం చేశాడు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఏలూరు పోలీసులు, జిల్లా ఇన్‌చార్జ్ ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మీ పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. అదనపు ఎస్పీ (అడ్మిన్) ఎన్. సూర్యచంద్రరావు, ఏలూరు ఎస్‌డిపిఓ డీ శ్రావణ్ కుమార్ నేతృత్వంలో ఈ దర్యాప్తు కొనసాగింది.
మార్చి 30న ఉదయం, ఏలూరు పట్టణంలోని పంపుల చెరువు రోడ్డు సమీపంలో మోటార్ సైకిల్ నడుపుతున్న నిందితుడు ఏలూరులోని సత్యనారాయణ పేటకు చెందిన చనాపతి దుర్గాప్రసాద్‌ను పోలీసులు పట్టుకున్నారు. అతడిని విచారించగా, తన నేరాన్ని అంగీకరించాడు. నిందితుడిగా గుర్తింపు పొందిన ఏలూరు సత్యనారాయణ పేటకు చెందిన చనాపతి దుర్గాప్రసాద్‌ను అరెస్టు చేశారు.
పోలీసులు నిందితుడి వద్ద నుంచి 57 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.1000 నగదు, మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని ఏలూరు పీజేసీజే కోర్టులో హాజరుపరిచి, జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.
ఈ కీలక కేసును వేగంగా పరిష్కరించిన పోలీసు బృందాన్ని జిల్లా ఇన్‌చార్జ్ ఎస్పీ శ్రీ అద్నాన్ నయీమ్ అస్మీ (ఐపీఎస్) అభినందించారు.
Also Read: Hyderabad Metro: హైదరాబాద్ నగరవాసులకు గుడ్ న్యూస్.. ఇకపై మెట్రో సేవలు మరింతగా..