తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: YouTuber Arrest: పెళ్లి చేసుకుంటానని వివాహితను నమ్మించి వాంఛలు తీర్చుకుని ఆ తరువాత మాట మార్చిన యూ ట్యూబర్ ను అంబర్ పేట పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. నిందితునిపై బీఎన్ఎస్ 69, 79, 352, 351(4) సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. అంబర్ పేట సీఈ కాలనీకి చెందిన ముప్పయ్యేళ్ల మహిళకు 2007లో అలీం అనే వ్యక్తితో కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లయ్యింది. వివాహం తరువాత ఆమె ఇద్దరు కొడుకులకు జన్మనిచ్చింది. అయితే, విభేదాలు తలెత్తటంతో 2018లో అలీం ఆమెకు విడాకులిచ్చాడు.
ఆ తరువాత సదరు మహిళ లెక్చరర్ గా పార్ట్ టైం జాబ్ చేస్తూ జీవనం గడుపుతోంది. ఆ సమయంలో తన స్నేహితుని ద్వారా ఆమెకు న్యూస్ లైన్ యూ ట్యూబ్ చానల్ నడుపుతున్న తుర్కయంజాల్ నివాసి సీహెచ్.శంకర్ (36)తో పరిచయం ఏర్పడింది. బాధితురాలికి పెళ్లి కావటం…భర్త విడాకులు ఇవ్వటం తదితర విషయాలు తెలుసుకున్న శంకర్ ఆమె పట్ల సానుభూతి కనబరుస్తూ క్రమంగా దగ్గరయ్యాడు. ఓసారి తన కారులో ఆమెను శంషాబాద్ వైపు ఉన్న హైవే పైకి తీసుకెళ్లిన శంకర్ నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి వద్దని వారిస్తున్నా కోరిక తీర్చుకున్నాడు.
Also Read: MP Chamala Kiran Kumar: పార్లమెంటులో గొంతు నొక్కేస్తున్నారు’.. కాంగ్రెస్ ఎంపీ ఫైర్
ఆ తరువాత కూడా చాలాసార్లు ఇలాగే చేశాడు. బాధితురాలు సీఈ కాలనీకి మకాం మార్చిన తరువాత ఆ ఇంటికి కూడా పలుమార్లు వచ్చాడు. ఫిబ్రవరిలో ఆమె బర్త్ డేను కూడా సెలబ్రేట్ చేశాడు. ఇలా రోజులు గడిచి పోతుండటంతో ఇటీవల బాధితురాలు తనను పెళ్లి చేసుకొమ్మని శంకర్ ను అడిగింది. అపుడు ఇపుడు అంటూ కాలం గడిపిన శంకర్ ఇటీవల బెదిరించటం మొదలు పెట్టాడు. తాను న్యూస్ లైన్ అన్న యూ ట్యూబ్ చానల్ నడుపుతున్నానని, తనకు రాజకీయ అండ దండిగా ఉందని చెబుతూ పెళ్లి చేసుకొమ్మని వెంట పడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని భయ పెట్టాడు.
Also Read: Telangana Govt : తెలంగాణ యువతకు గుడ్ న్యూస్.. ఇక ఉద్యోగాల జాతరే..
నాతో సన్నిహితంగా ఉన్నపుడు తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తానని బ్లాక్ మెయిల్ చేయటం ప్రారంభించాడు. కాగా, తనకు జరిగిన అన్యాయం గురించి బాధితురాలు తన ట్విట్టర్ అకౌంట్ అయిన తెలంగాణ పిల్ల@ టీఎస్ పిల్లలో పరోక్షంగా పోస్టులు పెట్టింది. అయితే, ఈ ట్విట్టర్ అకౌంట్ కు నకిలీ అకౌంట్లు సృష్టించిన శంకర్ వాటిల్లో అసభ్యకర పదజాలంతో ఆమెను దూషిస్తూ పోస్టులు పెట్టాడు. మార్ఫింగ్ చేసిన ఫోటోలతో బెదిరించటం ప్రారంభించాడు. దాంతో బాధితురాలు అంబర్ పేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసులు నమోదు చేసి శంకర్ ను శనివారం అరెస్ట్ చేశారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు