Tirumala News: ఇంట్లో గొడవ పడ్డాడు. తన తల్లిదండ్రులకు చెప్పకుండా తిరుమలకు వచ్చాడు. వచ్చిన ఆ యువకుడు, ఆత్మహత్యకు యత్నించాడు. ఎట్టకేలకు పోలీసులు రావడంతో, యువకుడి ప్రాణాలు రక్షించగలిగారు. ఈ ఘటన తిరుమలలో శుక్రవారం జరిగింది. పూర్తి వివరాలలోకి వెళితే..
తిరుమల క్షేత్రానికి ఎందరో భక్తులు వస్తుంటారు. అయితే కొందరు మానసిక స్థైర్యాన్ని కోల్పోయి శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి వస్తారు. అలా వచ్చిన వారు కొందరు ఆత్మవిశ్వాసం కోల్పోయి, ఆత్మహత్యలకు యత్నింస్తుంటారు.
అందుకే తిరుమల పోలీసులు తిరుమల పరిసరాల్లో నిఘా ఏర్పాటు చేశారు. దీనితో పోలీసులు, ఎన్నో ప్రాణాలను కాపాడారని చెప్పవచ్చు. అలా జరిగిన ఘటనే ఇది. బెంగుళూరుకు చెందిన ఓ యువకుడు ఆత్మహత్యకు యత్నించగా, పోలీసులు సకాలంలో స్పందించి ప్రాణాలు కాపాడారు.
బెంగుళూరుకు చెందిన చేతన్ అనే యువకుడు మార్చి 22 న ఇంట్లో గొడవపడ్డాడు. ఆ తర్వాత అలిగి తిరుమలకు చేరుకున్నాడు. వారం రోజులుగా తిరుమల క్షేత్రంలో తిరుగుతూ ఉన్నాడు చేతన్. ఇంటికి వెళ్లలేని పరిస్థితిని ఎదుర్కొన్న చేతన్, ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా పాండవ తీర్థం వద్దకు చేరుకున్నాడు. అక్కడ గల గాజు పెంకులతో కోసుకొని చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడే ఆపద్భాంధవుల వలె తిరుమల పోలీసులు అక్కడికి చేరుకున్నారు.
Also Read: Tirumala News: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఇక నుండి రద్దీ సమాచారం.. మీచేతిలోనే..
ఇంకేముంది ఆత్మహత్యను నివారించారు. ఆ తర్వాత ప్రశాంతంగా కూర్చోబెట్టి చేతన్ వివరాలు ఆరా తీశారు. జరిగినదంతా చెప్పిన చేతన్, తన తల్లిదండ్రుల వివరాలు తెలిపాడు. పోలీసులు వెంటనే చేతన్ తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. అలాగే చేతన్ కు కూడా కౌన్సిలింగ్ ఇచ్చి, ఇలాంటి చేష్టలకు పాల్పడవద్దని హితవు పలికారు. ఆత్మహత్యకు యత్నించిన చేతన్ ను కాపాడిన పోలీసులకు అతని కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.