Hyderabad Crime: ఈ ఆధునిక యుగంలో మానవత్వం క్రమంగా క్షీణిస్తూ వస్తోంది. కొందరు వ్యక్తులు తమ దురహంకార పూరిత చర్యలతో సభ్య సమాజం తలదించుకునేలా చేస్తున్నారు. పగ, ప్రతీకార భావనలు మనసులో పెట్టుకుని, క్షణికావేశంలో దాడులకు పాల్పడటమే కాకుండా, హత్యల వరకూ వెళ్లడానికి కూడా సంకోచించడం లేదు.
ఇటువంటి ఘటనలు మానవ సంబంధాలను దెబ్బతీస్తూ, సామాజిక విలువలను క్షీణింపజేస్తున్నాయి. కొందరు స్నేహాలు, బంధుత్వాలకు విలువ ఇవ్వకుండా ఘోరాలకు పాల్పడుతున్నారు. మరి కొందరైతే రక్తం పంచుకుపుట్టిన వారిని కూడా కడతేరుస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని ఓ మహిళ ఘెరానికి పాల్పడింది. కన్న బిడ్డనే కడతేర్చింది. అదికూడా 14 రోజుల పసికందు కావడం స్థానికులను విస్మయానికి గురిచేస్తున్నది.
హైదరాబాద్‌లోని మైలార్‌దేవ్‌పల్లిలో గురువారం జరిగిన ఈ దారుణ సంఘటన స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది. కేవలం 14 రోజుల వయస్సు ఉన్న ఒక పసికందు మరణించింది. ఆ బిడ్డ మరణానికి కారణం ఎవరూ ఊహించని విధంగా కన్న తల్లి కావడం దారుణం. పసికందును చంపి ప్రమాదంగా చిత్రీకరించేందుకు తల్లి ప్రయత్నించింది. ఈ ఘటనలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేయగా, ఆర్థిక ఇబ్బందులతో కూడిన ఒక విషాదకర నిజం బయటపడింది.
Also Read: ముగ్గురు బిడ్డలు మృత్యు ఒడిలోకి.. ఆ తల్లి కోమాలోకి.. అసలేం జరిగిందంటే?
మైలార్దేవ్పల్లిలో నివాసం ఉంటున్న ఓ మహిళ తన 14 రోజుల పసికందును ఒక బకెట్ నీటిలో ముంచి చంపినట్లు పోలీసులు గుర్తించారు. అయితే, ఈ ఘటనను కప్పిపుచ్చేందుకు ఆమె స్నానం చేయడానికి వెళ్లిన సమయంలో బిడ్డ బకెట్‌లో పడి చనిపోయిందని నాటకం ఆడింది. స్థానికుల నుండి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని విచారణ మొదలుపెట్టారు. పసికందు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం పంపారు.
తల్లిని అదుపులోకి తీసుకుని విచారించగా, ఆమె ఆర్థిక సమస్యలతో ఈ దారుణానికి పాల్పడినట్లు అంగీకరించింది. పోలీసులు కేసు నమోదు చేసి మరింత దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.