Sangareddy News: ముగ్గురు పిల్లలు చనిపోయారు. కానీ ఆ తల్లికి తెలియదు. అసలు ఏమి జరిగిందో తెలియదు. బిడ్డలు మృత్యువు ఒడిలోకి, తల్లి అపస్మారక స్థితిలోకి.. ఈ విషాద ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. పూర్తి వివరాల లోకి వెళితే..
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ రాఘవేంద్ర కాలనీలో చెన్నయ్య, రజిత అనే దంపతులు నివసిస్తున్నారు. వీరికి ముగ్గురు సంతానం. ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి కాగా, రజిత ప్రవేట్ పాఠశాల టీచర్ గా పనిచేస్తున్నారు. అలాగే చెన్నయ్య డ్రైవర్ గా పనిచేస్తున్నట్లు సమాచారం. రోజువారీ మాదిరిగానే రజిత తన బిడ్డలకు అన్నం తినిపించి, ఆ తర్వాత పెరుగన్నం తినిపించారు. ఆ తర్వాత నిద్రలోకి జారుకున్నారు. అంతలోనే రజిత అనారోగ్యానికి గురయ్యారు. ఆ తర్వాత ముగ్గురు పిల్లలు కూడా అస్వస్థతకు గురి కాగా, కుటుంబ సభ్యులు వైద్యశాలకు తరలించారు.
వైద్యశాలలో చికిత్స పొందుతున్న ఆ ముగ్గురు చిన్నారులు, ఆరోగ్యం క్షీణించి మృతి చెందారు. రజిత మాత్రం అపస్మారక స్థితిలోకి వెళ్లారు. వీరు అస్వస్థతకు గురి కావడానికి కారణం పెరుగన్నం అంటూ ప్రచారం సాగుతోంది. ఆ పెరుగన్నంలో విషం కలిసిందా? లేక ఆహారం విషంగా మారిందా అనేది ప్రస్తుతం స్థానికుల మధ్య చర్చ సాగుతోంది. మొత్తం మీద సమాచారం అందుకున్న పోలీసులు అసలేం జరిగి ఉండవచ్చని ఆరా తీస్తున్నారు.
Also Read: Fake Tickets Scam: రైల్వే టికెట్ చెక్ చేయండి.. ఇలాంటి మోసాలతో తస్మాత్ జాగ్రత్త!
వీరి మధ్య విభేదాలు ఉన్నాయా? ఆ సమయంలో చెన్నయ్య ఎక్కడున్నారు? అసలేం జరిగిందనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే తన ముగ్గురు బిడ్డలు చనిపోయారని, ఆ తల్లికి ఇప్పటికీ తెలియక పోవడం విశేషం. ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళడంతో బిడ్డల మరణం ఆమెకు తెలియని పరిస్థితి. నవమాసాలు మోసి పెంచిన ముగ్గురు బిడ్డలు లేరని తెలిస్తే ఆ తల్లి పడే బాధ అంతా ఇంతా కాదు. అయితే ఇక్కడ మరో ప్రచారం సైతం సాగుతోంది. తల్లే పెరుగన్నంలో విషం కలిపి ఉండవచ్చని కొందరు భావిస్తుండగా, అలా జరిగి ఉండదని మరికొందరు భావిస్తున్నారు. ఏదిఏమైనా చిన్నారుల మృతికి గల కారణాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.