Fake Tickets Scam: మోసాలలో ఇలాంటి మోసం వేరయా.. ఇంతటి మోసం కనీవినీ ఎరుగరు. అది కూడా రైల్వే ప్రయాణికులే లక్ష్యంగా కొందరు చేస్తున్న మోసాన్ని సెంట్రల్ రైల్వే విజిలెన్స్ బృందం బట్టబయలు చేసింది. ఈ విషయం తెలుసుకున్న రైల్వే ప్రయాణికులు అప్రమత్తమై తమ టికెట్స్ చెక్ చేసుకుంటున్నారు. మీరు తరచూ ట్రైన్ జర్నీ చేస్తుంటారా? అయితే ఇలాంటి మోసగాళ్ల పట్ల తస్మాత్ జాగ్రత్త సుమా.. లేకుంటే ఫైన్ కట్టే పరిస్థితి ఖాయం. ఆ మోసం ఏమిటి? అసలెక్కడ బయటపడిందో తెలుసుకుందాం.
సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు వారి టార్గెట్. ముందుగా మాటలు కలుపుతారు. ఆ తర్వాత మేమున్నాం అంటారు. మన చేతిలో టికెట్ పెట్టేస్తారు. ఇంకేముంది సమయానికి దేవుడిలా వచ్చాడంటూ మనం తెగ ఆనందించి దీవెనలు అందిస్తాం. ఈ అమాయకత్వమే వారి పాలిట వరం. అందుకే మనం రైల్వే టికెట్ కొనుగోలు చేసిన వెంటనే, ఆ టికెట్ ఒరిజినల్ కాదా అనేది చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
అత్యవసర ప్రయాణ సమయంలో రైల్వే టికెట్ దొరకని పరిస్థితిలో ప్రయాణికులు కాస్త గాబరా పడడం కామన్. అదే ఆసరాగా చేసుకొని కొందరు నకిలీ టికెట్స్ విక్రయిస్తూ, రైల్వే విజిలెన్స్ సిబ్బందికి పట్టుబడ్డారు. తీగ లాగితే డొంక కదిలింది అన్నట్లుగా, ఈ స్కామ్ మొత్తం వెలుగులోకి వచ్చింది. ఇక అసలు విషయంలోకి వెళితే.. రైల్వే స్టేషన్స్ వద్ద ప్రయాణీకుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఇండియన్ రైల్వే అధ్వర్యంలో టికెట్ ఏజెంట్స్ ను ఏర్పాటు చేశారు. ఇలా ఏర్పాటు చేసిన ఓ టికెట్ ఏజెంట్ చేసిన నిర్వాకం ఇది.
నకిలీ టికెట్స్ విక్రయిస్తున్నట్లు సమాచారం అందుకున్న రైల్వే విజిలెన్స్ అధికారులు, లోకమాన్య తిలక్ టెర్మినస్ (LTT) నుండి గోరఖ్‌పూర్‌కు వెళ్లే గోడాన్ ఎక్స్‌ప్రెస్ (రైలు నం. 11055), LTT నుండి జైనగర్ వెళ్లే పవన్ ఎక్స్‌ప్రెస్ (రైలు నంబర్ 11061) రైళ్లను తనిఖీ చేశారు. ఆ తనిఖీ సమయంలో పలువురు ప్రయాణికుల వద్ద నకిలీ టికెట్స్ ను అధికారులు గుర్తించారు. అత్యవసరమంటూ చెప్పిన వెంటనే, తమకు ముంబైలోని ఓ టికెట్ ఏజెంట్ ఈ టికెట్స్ ఇచ్చినట్లు ప్రయాణికులు తెలిపారు.
అచ్చం రైల్వే టికెట్స్ ను పోలినట్లుగా ముద్రించి ప్రయాణికులను మోసం చేస్తున్నట్లు గుర్తించిన అధికారులు, టికెట్ ఏజెంట్ల కోసం గాలింపు చేపట్టారు. తమ విషయం బయటకు పొక్కడంతో ఆ ఏజెంట్స్ అక్కడి నుండి పరారైనట్లు తెలుస్తోంది. ఇక చేసేదేమి లేక చివరకు అధిక డబ్బులు ఇచ్చి టికెట్ కొనుగోలు చేసిన ప్రయాణికులకు అధికారులు జరిమానా విధించారు.
Also Read: Indian Railways: రైల్వే టికెట్ పోగొట్టుకున్నారా? ఈ ఆప్షన్ మీకు తెలుసా!
పాపం ఆ ప్రయాణికులు.. ఓ వైపు మోసపోయారు.. మరోవైపు జరిమానా చెల్లించారు. అందుకే మనం ఎక్కడ టికెట్ తీసుకున్నా, ఆ రైల్వే టికెట్ ఒరిజినల్ కాదా అన్నది నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉంది. తస్మాత్ జాగ్రత్త సుమా.. ఇలాంటి వారి బారిన పడవద్దు!