Indian Railways: ట్రైన్ లో ప్రయాణించాలనుకున్న ఓ ప్రయాణికుడు నిజాయితీగా టికెట్ కొన్నాడు. ఆ తర్వాత ట్రైన్ ఎక్కాడు. ప్రయాణికుల రద్దీ ఆ సమయంలో అధికంగా ఉంది. ఎలాగోలా హడావుడిగా రైలు ఎక్కేశాడు. రైలు కదిలింది.. ఆ తర్వాత రైల్వే టీసీ వచ్చారు. ఇక అంతే ప్రతి ఒక్కరు టీసీకి టికెట్ చూపిస్తున్నారు. అంతలోనే మన ప్రయాణికుడు కూడా టికెట్ చూయించేందుకు జేబులో చేయి పెట్టారు. అంతే షాక్.. టికెట్ లేదు.
టికెట్ కొనుగోలు చేసినా, టికెట్ పోగొట్టుకున్నారు. ఇక అంతే టీసీ ఫైన్ వేశారు. మన ప్రయాణికుడు పడ్డ బాధ అంతా ఇంతా కాదు. ఇలాంటి సమస్యలు ప్రయాణికులకు ఎదురుకాకుండా, ఇండియన్ రైల్వే పెద్ద ప్లాన్ వేసింది. అందరి కోసం యుటీఎస్ యాప్ తెచ్చింది. అయితే ఈ యాప్ ద్వారా టికెట్ ఎలా చూయించాలన్నదే ఇప్పుడు అందరి మదిలో మెదిలే ప్రశ్న.
రైల్వే స్టేషన్స్ వద్ద గల టికెట్ కౌంటర్స్ పెద్ద క్యూలను నియంత్రించేందుకు ఇండియన్ రైల్వే అన్‌రిజర్వ్డ్ టికెటింగ్ సిస్టమ్ (UTS) మొబైల్ యాప్ తెచ్చింది. ఈ యాప్ ద్వారా ప్రయాణికులకు అందే సేవలు అదరహో. అరచేతిలో ప్రపంచాన్ని చుట్టేసే రోజులు, మొబైల్ ఫోన్ ద్వారా మన దరికి చేరాయి. ఆ మొబైల్ యాప్ తోనే ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు రైల్వే కృషి చేస్తోంది.
ఈ యాప్ ద్వారా టికెట్ బుక్ చేసుకోవచ్చు. ప్లాట్ ఫామ్ టికెట్ కూడా పొందవచ్చు. అయితే యాప్ లో టికెట్ బుక్ చేసుకున్న అనంతరం, గంటలోగా ప్రయాణం ప్రారంభం కావాలి. లేకుంటే ఇబ్బందులు తప్పవని రైల్వే తెలుపుతోంది. ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే.. సాధారణంగా టికెట్ కౌంటర్ వద్ద టికెట్ పొందిన తర్వాత రద్దు చేసుకొనే అవకాశం ఉంటుంది. కానీ ఈ యాప్ లో మాత్రం అందుబాటులో ఉండదు.
ఇటీవల కొందరు రైల్వే ప్రయాణికులు యుటీఎస్ యాప్ ను అధికంగా వినియోగిస్తున్నారు. పేపర్ లెస్ టికెట్ పొందే సౌకర్యం రావడంపై వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కానీ టీసీ వచ్చిన సమయంలో టికెట్ ఎలా చూయించాలనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాధరాణంగా టికెట్ కౌంటర్ వద్ద టికెట్ కొనుగోలు చేసిన సమయంలో రైల్వే టీసీ వచ్చిన వెంటనే మనం టికెట్ చూయిస్తాం. అయితే యాప్ లో ఎలా అన్నదే ఇప్పుడు ప్రశ్న.
యాప్ లో టికెట్ బుక్ చేసుకున్న వారు, టీసీ వచ్చిన సమయంలో యాప్ ఓపెన్ చేసి అందులో గల Show My Ticket అనే ఆప్షన్ నొక్కాలి. అప్పుడే మీరు యాప్ ద్వారా బుక్ చేసుకున్న టికెట్ మీ ఎదుట ఉన్నట్లే. ఆ టికెట్ చూసిన టీసీ నిర్ధారించుకొని వెళ్తారు.
Also Read: Bank of baroda Jobs 2025: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. అదిరిపోయే ఉద్యోగాలు.. వేలల్లో జీతం!
మీకు ఇంకొక అనుమానం వచ్చిందా.. నెట్ లేకుంటే టికెట్ ఎలా చూయించాలని అనుకుంటున్నారా? ఒక్కసారి టికెట్ బుక్ చేసుకున్న తర్వాత, నెట్వర్క్ లేకుండానే Show My Ticket ఆప్షన్ పనిచేసేలా రైల్వే రూపొందించింది. టికెట్ పోగొట్టుకుంటామన్న భయం ఉన్న వారికి యూటీఎస్ యాప్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఓ వైపు రైల్వే ప్రయాణీకుల కోసం ఎన్నో సౌకర్యాలు కల్పిస్తూ, మరోవైపు రైల్వే సేవలను ప్రయాణికులకు సులభతరం చేస్తున్న ఇండియన్ రైల్వే కు ఓ సెల్యూట్ కొట్టేద్దాం.