Betting App Owners: వేలాది మంది జీవితాలతో చెలగాటం ఆడుతున్న బెట్టింగ్ యాప్స్ పై తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) దృష్టి సారించిన సంగతి తెలిసిందే. ఆర్టీసీ ఎంజీ సజ్జనార్ (Sajjanar) చొరవతో పోలీసులు రంగంలోకి దిగారు. కాసుల యావలో కనీస బాధ్యత మరిచిన ఇన్‌ప్లూయెన్సర్లు, సెలబ్రిటీలు ఒక్కొక్కరిపై కేసులు నమోదు చేస్తూ వచ్చారు. ఇప్పటివరకూ పదుల సంఖ్యలో సెలబ్రిటీలపై హైదరాబాద్ పోలీసులు కేసులు నమోదు చేశారు. దీంతో పలువురు సెలబ్రిటీలు విచారణకు సైతం హాజరయ్యారు. ఈ క్రమంలో బెట్టింగ్ యాప్స్ కేసుకు సంబంధించి ఆసక్తికర పరిణామం చోటుచేసుంది. సెలబ్రిటీల విషయంలో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఓనర్లపై కేసు నమోదు
డబ్బు ఆశ చూపి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న బెట్టింగ్ యాప్ ఓనర్ల (Betting App Owners)పై పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. కొద్ది రోజుల క్రితం వరకూ యూట్యూబ్ ఇన్ ఫ్లూయెన్సర్లు, సెలబ్రిటీలపై కేసులు నమోదు చేస్తూ వచ్చిన పోలీసులు.. తాజాగా వాటి యజమానులపై ఫోకస్ పెట్టారు. ఏకంగా 19 మంది బెట్టింగ్ యాప్స్ ఓనర్లపై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. యాప్ ఓనర్లే టార్గెట్ గా కఠినమైన సెక్షన్లు వారిపై నమోదు చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే వారిని అదుపులోకి తీసుకొని వారి స్టేట్ మెంట్ ను రికార్డు చేసే అవకాశముంది.
సాక్ష్యులుగా సెలబ్రిటీలు!
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కు సంబంధించి ఇప్పటికే 25 మంది సెలబ్రిటీలపై మియాపూర్ పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే ఇప్పుడు తాజాగా బెట్టింగ్ యాప్స్ ఓనర్లను సైతం కేసు పరిధిలోకి తీసుకురావడంతో.. సెలబ్రిటీలను సాక్ష్యులుగా ఉపయోగించుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ కేసులో సెలబ్రిటీల పేర్లు తెరపైకి రావడంతో ఇక వారు జైలుకు వెళ్లకతప్పదన్న ప్రచారం జరిగింది. అసలు వ్యక్తులను వదిలేసి సెలబ్రిటీలను పోలీసులు టార్గెట్ చేస్తున్నారన్న విమర్శలూ వచ్చాయి. ఈ క్రమంలో బెట్టింగ్ యాప్ ఓనర్లపై పోలీసులు కేసు నమోదు చేయడం ఆసక్తికరంగా మారింది.
యాంకర్ శ్యామల విచారణ
ఇదిలా ఉంటే బెట్టింగ్ యాప్స్ కేసుకు సంబంధించి ప్రముఖ యాంకర్, వైసీపీ నేత శ్యామల (Anchor Shyamala)ను పంజాగుట్ట పోలీసులు విచారించారు. దాదాపు 2 గంటలకు పైగా సాగిన ఈ విచారణలో పలు ప్రశ్నలను శ్యామలకు సంధించినట్లు తెలుస్తోంది. విచారణ అనంతరం బయటకు వచ్చిన శ్యామలను మీడియా ప్రశ్నించింది. అయితే కేసు విచారణ జరుగుతున్న సమయంలో మాట్లాడటం సమంజసం కాదని ఆమె సమాధానం ఇచ్చారు. పోలీసుల విచారణనకు పూర్తిస్థాయిలో సహకరిస్తున్నట్లు ఆమె తెలియజేశారు.
Also Read: AP Govt: ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. మీ ఫోన్ మోగిందా? డబ్బులు వచ్చినట్లే!
నటీనటుల వాదన
ప్రముఖ యూట్యూబర్లు విష్ణు ప్రియ, రితూ చౌదరి, శ్యామల, లోకల్ బాయ్ నాని సహ పలువురు బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన నేపథ్యంలో వారిపై కేసు నమోదు చేశారు. వారితో పాటు ప్రముఖ సెలబ్రిటీలు దగ్గుబాటి రానా, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్ వంటి నటులపైనా పోలీసులు కేసు పెట్టారు. ఈ క్రమంలో సినీ ప్రముఖల వాదన మరోలా ఉంది. చట్టబద్దమైన బెట్టింగ్ యాప్ లను మాత్రమే తాము ప్రమోట్ చేసినట్లు వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వాదనలను సామాజిక వేత్తలు తప్పుబడుతున్నారు. సెలబ్రిటీలకు నైతిక బాధ్యతను ప్రతీసారి గుర్తుచేయాలా అంటూ మండిపడుతున్నారు.