Miss World 2025 (image credit:AI)
హైదరాబాద్

Miss World 2025: ప్రపంచ అందాలన్నీ తెలంగాణ వైపు.. మే 31న మిస్ వరల్డ్ ఫైనల్ పోటీ..

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ : Miss World 2025: మిస్ వరల్డ్ (72వ) పోటీలకు తెలంగాణ ఆతిథ్యమివ్వనుంది. ఈ ఈవెంట్ తో ప్రపంచం యావత్ దృష్టి తెలంగాణపై కేంద్రీకరించనుంది. అత్యంత ప్రతిష్టాత్మక పోటీలను తెలంగాణలో నిర్వహించడం వల్ల బ్రాండ్ ఇమేజ్ పెరగడంతో పాటు టూరిజం గణనీయంగా పెరిగే అవకాశముంది. తెలంగాణలోని ప్రఖ్యాత చారిత్రక, వారసత్వ కట్టడాలు కలిగిన ప్రాంతాల్లో ఈ మెగా ఈవెంట్ కు వేదికలుగా మారనున్నాయి. మే 6వ తేదీ నుంచే కంటెస్టెంట్స్ రాకతో హైదరాబాద్ సందడిగా మారనుంది.

మొత్తం 27 రోజుల్లో 22 ఈవెంట్లు జరగనున్నాయి. పాశ్చాత్య సంస్కృతికి భిన్నంగా మిస్ వరల్డ్ పోటీలను నిర్వహించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ పోటీలను భారతీయ సాంప్రదాయ పద్ధతుల్లో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ గ్లోబల్ బ్రాండ్ ఇమేజ్ ను బలోపేతం చేయడంలో భాగంగా ‘తెలంగాణ.., జరూర్ ఆనా’ అనే ట్యాగ్ లైన్ తో ప్రపంచస్థాయి పర్యాటకులను ఆకర్షించాలని ప్రభుత్వం ఏర్పాట్లను చేపడుతోంది.

ప్రపంచంలోని 140 దేశాలకు చెందిన కంటెస్టెంట్స్ ఈ పోటీల్లో పాల్గొననున్నారు. కాగా వారంతా మే 6, 7 తేదీల్లో హైదరాబాద్ కు చేరుకుంటారు. కాగా మే 10వ తేదీన గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో మిస్ వరల్డ్ ఓపెనింగ్ సెర్మనీని నిర్వహించనున్నారు. మే 13న హైదరాబాద్ హెరిటేజ్ వాక్ పేరిట చార్మినార్, లాడ్ బజార్ లో మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ సందర్శించనున్నారు. మే 14న వరంగ ల్ లోని కాళోజీ కళాక్షేత్రంలో విద్యార్థులు, వివిధ రంగాలకు చెందిన ప్రతినిధులతో అమెరికా, కరీబియన్ (గ్రూప్ 1) మిస్ వరల్డ్ కు వచ్చిన కంటెస్టెంట్స్ ఇంటరాక్ట్ అవ్వనున్నారు. అదేరోజు కాకతీయ హెరిటేజ్ టూర్ లో భాగంగా రామప్పను సందర్శించనున్నారు.

యూరప్(గ్రూప్ 2) కు చెందిన మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ స్పిరిచువల్ టూర్ లో భాగంగా మే 15న యాదగిరిగుట్టను సందర్శించనున్నారు. ఆపై పోచంపల్లి హ్యాండ్ లూమ్స్ ఇండస్ట్రీని పరిశీలించనున్నారు. మెడికల్ టూరిజంలో భాగంగా ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్(గ్రూప్ 3) మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ మే 16న అపోలో, ఏఐజీ, యశోద హాస్పిటల్స్ సందర్శనకు వెళ్లనున్నారు. ఇదిలాఉండగా మిస్ వరల్డ్ స్పోర్ట్స్ ఫినాలే గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో మే 17న జరగనుంది. కాంటినెంటల్ ఫినాలే మే 20, 21 తేదీల్లో టీ హబ్ వేదికగా జరగనున్నాయి. రీజియన్ల వారీగా ఫాస్ట్ ట్రాక్ సెలక్షన్ కోసం కాంటినెంటల్ క్లస్టర్స్ పోటీలు టీ హబ్ లో నిర్వహిస్తున్నారు. కరీబియన్, ఆఫ్రికా, ఆసియా, యూరప్ కు చెందిన దేశాలు ఈ ఈవెంట్ లో పాల్గొంటాయి.

మిస్ వరల్డ్ టాలెంట్ ఫినాలేకు శిల్పకళా వేదిక ఆతిథ్యమివ్వనుంది. మే 22న ఈ ఈవెంట్ జరగనుంది. హెడ్ టు హెడ్ చాలెంజ్ ఫినాలే మే 23న గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో నిర్వహిస్తున్నారు. మిస్ వరల్డ్ టాప్ మోడల్, ఫ్యాషన్ ఫినాలేను మే 24న హైటెక్స్ లో నిర్వహించనున్నారు. ఈ పోటీలో తెలంగాణకు సంబంధించిన ఫ్యాషన్ డిజైనర్లతో ఇంటరాక్షన్ కూడా ఉండనుంది.

మే 25న హైటెక్స్ లో జ్యుయెలరీ, పెరల్ ఫ్యాషన్ షో నిర్వహిస్తున్నారు. మిస్ వరల్డ్ ఫైనల్ పోటీలు హైటెక్స్ వేదికగా జరగనున్నాయి. మే 31న ఈ గ్రాండ్ ఫినాలే జరగనుంది. అంతటితో ఈ పోటీ ముగియనుంది. అయితే ఈ పోటీలో విజేత తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 2న రాజ్ భవన్ లో గవర్నర్, ముఖ్యమంత్రిని కలుసుకోనున్నారు.

72వ మిస్ వరల్డ్ ఈవెంట్ తో అంతర్జాతీయ వేదికపై తెలంగాణ పేరు మార్మోగనుంది. తెలంగాణ టూరిజానికి ఊతమిచ్చేలా ఈ ప్రోగ్రామ్ ను ప్లాన్ చేశారు. ఈ ఈవెంట్ లో మరో ప్రత్యేకత కూడా ఉంది. పోటీల్లో పాల్గొనే కంటెస్టెంట్లలో 140 దేశాలకు చెందిన వైద్యులు, ఇంజినీర్లు, క్రీడా అథ్లెట్లు, సామాజిక కార్యకర్తలు, న్యాయవాదులు, సృజనాత్మక కళాకారులు, పారిశ్రామికవేత్తలు వంటి విభిన్న నేపథ్యాలకు చెందిన వారు ఉండటం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా 3000 మందికి పైగా మీడియా ప్రతినిధులు కవరేజ్ కోసం తెలంగణకు రానున్నారు.

Also Read: ‘స్వేచ్ఛ’ ఎఫెక్ట్.. మెట్రో రైళ్లపై ఇప్పుడే తొలగిస్తాం.. మెట్రో ఎండీ

ప్రాచీన సంప్రదాయాలు, ఆధునిక ఆకాంక్షలకు అనుగుణంగా ఉన్న తెలంగాణ ప్రత్యేకత ప్రపంచానికి సాక్షాత్కరించనుంది. ఈ మిస్ వరల్డ్ పోటీల ద్వారా టూరిజం అభివృద్ధితో పాటు తెలంగాణకు భారీగా పెట్టుబడులు సైతం వచ్చే అవకాశముంది. ఎందుకంటే విదేశాల నుంచి వచ్చే కంటెస్టెంట్స్, సందర్శకుల కోసం కట్టుదిట్టమైన భద్రత, మెరుగైన సౌకర్యాలు కల్పిస్తుండటంతో టూరిజానికి డెస్టినేషన్ గా తెలంగాణ నిలవనుంది.

మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా తెలంగాణ సాంస్కృతిక, పర్యాటక అంశాలతో పాటు స్థానిక కళాకారుల హస్తకళలను ప్రదర్శించడం నుంచి మొదలు సాంప్రదాయ నృత్యాలు, సంగీత ప్రదర్శనలను ఇవ్వనున్నారు. తెలంగాణ స్పెషల్ వంటకాలను ప్రత్యేకంగా చేయించనున్నారు. ఎకో-టూరిజం, ఎకో సఫారీలు జీవవైవిధ్య పరిరక్షణలో తెలంగాణ నిబద్ధతను ప్రపంచస్థాయికి తీసుకెళ్లనున్నాయి.

Also Read: సీఎం సార్.. నా అన్వేష్ ను అరెస్ట్ చేయండి.. ఇమ్రాన్ ఎమోషనల్‌ పోస్ట్‌..

ఫిల్మ్, ఎంటర్ టైన్మెంట్ టూరిజానికి ఊతంగా ఈ ఈవెంట్ మారనుంది. విమానయాన సంస్థలు, హోటళ్లు, టూర్ ఆపరేటర్లు, ట్రావెల్ ఏజెన్సీలకు, ఈవెంట్లు నిర్వహించే ప్రాంతాల్లో స్థానికులకు ఉపాధి మరింత పెరగనుంది. మిస్ వరల్డ్ కు సంబంధించిన వివరాలను వెబ్ సైట్, యాప్ ద్వారా పర్యాటక ప్రదేశాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రయాణ వనరులపై సమగ్ర సమాచారం అందించనున్నారు.

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?