Swetcha Effect: బెట్టింగ్ యాప్స్ లో హైదరాబాద్ మెట్రో.. వీడియో వైరల్ పేరిట ‘స్వేచ్ఛ’ రాసిన కథనంపై హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి స్పందించారు. గత కొద్ది రోజులుగా హైదరాబాద్ మెట్రో పై పలువురు నెటిజన్స్ విమర్శలు కురిపిస్తూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం అనధికార బెట్టింగ్ యాప్ లపై విస్తృత ప్రచారం చేసిన సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లు లక్ష్యంగా పోలీసులు కేసులు నమోదు చేస్తున్న విషయం కూడా తెలిసిందే. చిన్న చిన్న యూట్యూబర్ లతో పాటు సెలబ్రిటీల వరకు కేసుల నమోదు వ్యవహారం వెళ్లిందంటే పోలీసులు బెట్టింగ్ యాప్ ల పై కొరడా ఝుళిపిస్తున్నారని చెప్పవచ్చు. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ దారి పట్టి బెట్టింగ్ ప్రమోషన్స్ సాగించిన తీరు గురించి వివరణ ఇస్తున్నారు.
ఇది ఇలా ఉంటే హైదరాబాద్ మెట్రో రైళ్లపై బెట్టింగ్ యాప్ గురించి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడంతో దీని సంగతేంటి అంటూ పలువురు నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ సాగిస్తున్న పరిస్థితిని హైదరాబాద్ మెట్రో ఎదుర్కొంది. హైదరాబాద్ మెట్రోపై తగిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయాన్ని ‘స్వేచ్ఛ’ ప్రచురించగా ఎట్టకేలకు హైదరాబాద్ మెట్రో ఎండి ఎన్విఎస్ రెడ్డి స్పందించారు.
Also Read: Pareshan Boys Imran: సీఎం సార్.. నా అన్వేష్ ను అరెస్ట్ చేయండి.. ఇమ్రాన్ ఎమోషనల్ పోస్ట్..
కొన్ని మెట్రో రైళ్లపై బెట్టింగ్ కు సంబంధించిన వాణిజ్య ప్రకటనలు ఉన్నాయని తన దృష్టికి వచ్చిందని, ఆ ప్రకటనలను తక్షణమే తీసివేయాలని ఎల్ అండ్ టి సంబంధిత అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీలను తాను ఆదేశించినట్లు ఎన్ వి ఎస్ రెడ్డి తెలిపారు. ఈ రాత్రికి మెట్రో రైళ్లపై గల అటువంటి ప్రకటనలను పూర్తిగా తీసివేస్తామని ఎన్విఎస్ రెడ్డి ప్రకటించారు.
ఎట్టకేలకు హైదరాబాద్ మెట్రో రైళ్లపై గల బెట్టింగ్ వాణిజ్య ప్రకటనలను తీసివేస్తున్నట్లు ప్రకటించడంతో నెటిజన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇప్పటివరకు ప్రచారం చేసిన తీరుకు హైదరాబాద్ మెట్రో ఏం సమాధానం చెబుతుందం టూ మరికొందరు నెటిజెన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు. మరి ఈ విషయంపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటారోనన్న చర్చ సాగుతోంది.