Hardik Pandya: ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండు గాడు.. ఈ ఫేమస్ తెలుగు సినిమా డైలాగ్ ..సూపర్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాకు సరిగ్గా సరిపోతుంది.
గాయాలతో కెరీర్ లో ఒడిదుడుకులు.. విడాకులతో వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు.. గతేడాది ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా ఎదుర్కొన్న చేదు అనుభవాలు ఇవన్నీ అతన్ని మరింత రాటు దేల్చాయి.
ఇనుమును కొలిమిలో కాల్చి..సుత్తితో కొడితే కత్తైనట్లుగా ..సమస్యలు చుట్టుముట్టినా వెరవక ధైర్యంగా ఎదుర్కొన్నాడు. రోహిత్ ను కాదని అతన్ని కెప్టెన్ గా చేసినందుకు ఫ్యాన్స్ అతన్ని నిందించారు. వాంఖడేలోనే అతన్ని ఫ్యాన్స్ ఎగతాళి చేశారు. ఎక్కడికెళ్లినా.. ఏ స్టేడియంలో ఆడినా అతనికి వెక్కిరింతలే ఎదురయ్యాయి. అంతేకాదు వరుసగా ముంబై జట్టు పరాజయాలు.. పాయింట్ల టేబుల్ లో ఆఖరి స్థానం.. ఇక వేరే ఎవరైనా అయితే అంతే.. ఇక కోలుకునే పనే లేదు. అంతలా ట్రోల్ అయినా పాండ్యా తేరుకున్నాడు. తిట్టినోళ్లతోనే జేజేలే కొట్టించుకున్నాడు.
Also Read- Dhoni@43: ధోనీ..నీకు దండాలు సామీ..!
తొలుత పాండ్యా కీలక ప్లేయర్ గా నిలిచింది.. తనెంత విలువైన ఆటగాడో తెలిసేలా చేసింది టీ20 ప్రపంచకప్. ప్రతి మ్యాచ్ లోనూ బౌలింగ్ , బ్యాటింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని రంగాల్లో రాణించాడు. ముఖ్యంగా ఫైనల్లో సూర్యకుమార్ యాదవ్ పట్టిన మిల్లర్ క్యాచ్ గురించే అందరూ మాట్లాడుతారు కానీ.. ఆ బంతి వేసింది పాండ్యానే.. అదే మనకు ప్రపంచకప్ తెచ్చిపెట్టింది. అనంతరం ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ.. 50 ఓవర్ల ఫార్మాట్ లోనూ ఓపెనింగ్ బౌలర్ గా.. డెత్ ఓవర్లోనూ బౌలింగ్ చేస్తూ.. చివరలో ఫినిషర్ గా తన ప్రతిభతో అదరగొట్టాడు. సెకండ్ సీమర్ గా తనవంతు పాత్ర పోషించి .. టీమిండియా చాంపియన్ గా నిలవడంలో కీరోల్ ప్లే చేశాడు.
అతన్ని బూయింగ్ చేసినా హార్దిక్ వెనుదిరగలేదు. కానీ ప్రస్తుత సీజన్ కు ఆ సీన్ మారింది.. అతను పూర్తి ఫిట్ గా ఉన్నాడు. ఫూర్తి ఫాంలో కనిపిస్తున్నాడు. బ్యాటింగ్ లో దూకుడు మరింత పెరిగింది. గత ఏడాది కాలంగా ఎన్ని సమస్యలు ఎదురైనా తట్టుకుని నిలబడ్డాడు.
కాలం అన్ని గాయాలు మాన్పుతుందన్నట్లుగా హార్దిక్ ఇక చాలా హ్యాపీగా ముంబై జట్టును నడిపించే అవకాశం ఉంది. జట్టులోని సూపర్ స్టార్స్ అందరితో అతనికున్న స్పర్థలు మాయమైనట్లే కనిపిస్తోంది. రోహిత్, సూర్య, తిలక్ వర్మ, బుమ్రా లాంటి స్టార్లతో కూడిన ముంబై జట్టును నడిపించే సత్తా పాండ్యాకు ఉంది.
అంతేకాదు తన చుట్టూ ఏమి జరగినా.. ఆటతోనే సమాధానం చెప్పడం అతనికి అలవాటైంది. ఇప్పుడు ఏడాది కాలంలో వరుసగా రెండు ఐసీసీ ట్రోఫీలు గెలిచిన జట్టులో ప్లేయర్ గా తనమీద తనకున్న నమ్మకం అతన్ని మళ్లీ నిలబెట్టింది.
గత సీజన్ లో నిరాశ పరిచినా.. ప్రస్తుత సీజన్ కు మాత్రం కథ వేరేలా ఉండేలా కనిపిస్తోంది. బుమ్రా ఫిట్ అయి వస్తే ..ఇప్పుడున్న పరిస్థితిలో ముంబై జట్టు ఆరో టైటిల్ కొట్టేది ఖాయమే. మరి పాండ్యానా మజాకానా..?
Also Read: IPL 2025: అభిషేక్ .. మాస్ ..ఊరమాస్..