సనా, స్వేచ్ఛ: ఇరాన్ మద్దతు(iran support)తో ఎర్ర సముద్రం(Red sea) గుండా వెళ్లే వాణిజ్య నౌకలపై నిత్యం దాడులు, దోపిడీలకు పాల్పడుతున్న యెమెన్‌లోని హౌతీ(Houthis) మిలిటెంట్లపై అగ్రరాజ్యం అమెరికా మెరుపు దాడికి(US Attack on Houthis) దిగింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలతో యెమెన్(Yemen) రాజధాని సనాతో పాటు సదా, అల్ బైదా, రాడాలే ప్రాంతాల్లో హౌతీ స్థావరాలపై అమెరికా సైనిక దాడులు జరిపింది. శనివారం జరిపిన ఈ దాడుల్లో 31 మంది హౌతీ మిలిటెంట్లు హతమయ్యారు. 100 మందికిపై తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో చిన్నారులు ఎక్కవగా ఉన్నారని హౌతీ అధికారికంగా నిర్ధారించింది. హౌతీల టైమ్ ముగిసిందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Trump) తీవ్ర హెచ్చరిక చేశారు.
ఎర్ర సముద్రంలో విధ్వంసక చర్యలు మానుకోకపోతే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని, కఠినమైన శిక్షలు అనుభవించాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. హౌతీలకు మద్దతిస్తున్న ఇరాన్‌ను కూడా ఆయన హెచ్చరించారు. హౌతీ గ్రూపునకు మద్దతివ్వడం తక్షణమే ఆపివేయాలని, అమెరికాకు ఎలాంటి ముప్పు తలపెట్టినా అతి తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికాకు ఏదైనా హాని జరిగితే ఇరాన్ సంపూర్ణ బాధ్యత వహించాల్సి ఉంటుందని, అదే జరిగితే తమ నుంచి మంచితనాన్ని అస్సలు ఆశించలేరని ఆయన పేర్కొన్నారు. ‘‘హౌతీలు అందరికీ హెచ్చరిక, మీ టైమ్ ముగిసింది. మీ దాడులు ఆపివేయాల్సిందే. ఈ రోజు నుంచే మొదలుపెట్టండి. దాడులు ఆపివేయకుంటే మీరు ఇదివరకెన్నడూ చూడని నరకాన్ని అనుభవిస్తారు’’ అంటూ ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ హెచ్చరించారు.
ఎర్ర సముద్రంలో మోహరించి ఉన్న హ్యారీ ఎస్ ట్రుమ్యాన్ అనే విమాన వాహక నౌకపై ఒక యుద్ధ విమానం సాయంతో ఈ దాడులు జరిపినట్టు అమెరికా మిలిటరీకి చెందిన ఓ అధికారి వెల్లడించారు. యెమెన్ అంతటా చేపట్టనున్న భారీ దాడికి ఇది ఆరంభం మాత్రమేనని మధ్యప్రాచ్యంలో యూఎస్ బలగాలను పర్యవేక్షించే అమెరికా మిలిటరీ సెంట్రల్ కమాండ్ వ్యాఖ్యానించింది. హౌతీ మిలిటెంట్లు తమ నౌకలు, విమానాలు, తమ బలగాలపై జరుపుతున్న దాడులను ఏమాత్రం సహించబోమని, ఈ విషయాన్ని ఇరాన్ గుర్తించాలని అమెరికా రక్షణ శాఖ మంత్రి పీటె హెగ్‌సెత్ వ్యాఖ్యానించారు. ఎర్ర సముద్రంపై నౌకలు నిరంతరాయంగా ప్రయాణించేందుకు అవకాశం కల్పించాల్సిదేనని వార్నింగ్ ఇచ్చారు. అమెరికా అధ్యక్షుడిగా ఈ ఏడాది జనవరిలో ట్రంప్ బాధ్యతలు స్వీకరించాక, మధ్యప్రాచ్య దేశాల్లో అత్యధిక వ్యయంతో అమెరికా మిలిటరీ చేపట్టిన ఆపరేషన్ ఇదే కావడం గమనార్హం.
యుద్ధ నేరం.. ఖండించిన హౌతీ
అమెరికా దాడులు ‘యుద్ధ నేరం’ అని హౌతి అభివర్ణించింది. ఈ మేరకు హౌతీ రాజకీయ విభాగం ఆదివారం స్పందించింది. ఉద్రిక్త పరిస్థితులను ఎదుర్కోవడానికి యెమెన్ సాయుధ బలగాలు పూర్తి స్థాయిలో సంసిద్ధంగా ఉన్నాయంటూ ఒక ప్రకటన విడుదల చేసింది. భయంకరమైన దాడులు జరిగాయని సనాలోని స్థానికులు చెప్పారు. భూకంపం వచ్చిందేమోనని భావించామని వారు తెలిపారు. హౌతీలు పెద్ద సంఖ్యలో నివసించే ఓ బిల్డింగ్‌లో దాడి జరిగిందని ఓ స్థానికుడు చెప్పాడు. పేలుళ్లు చాలా భయంకరంగా ఉన్నాయని, భూకంపం వచ్చిందేమోనని చుట్టుపక్కలవారు భయపడ్డారని వివరించాడు. ఆడవాళ్లు, పిల్లలు భయభ్రాంతులకు గురయ్యారని పేర్కొన్నాడు. ఇక సదా అనే ప్రాంతంలో జరిగిన దాడి ప్రభావంతో విద్యుత్ స్టేషన్ దెబ్బతిన్నదని, ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని స్థానిక మీడియా పేర్కొంది.