Mark Carney: కెనడా కొత్త ప్రధానిగా మార్క్ కార్నీ (Mark Carney) ఎన్నికయ్యారు.కెనడా లిబరల్ పార్టీ (Canada Libaral Party) అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో విజయం సాధించడంతో ఆయన నూతన పీఎంగా ఎన్నికయ్యారు. అంతర్గతంగా జరిగిన ఈ పార్టీ ఎన్నికల్లో 59 ఏళ్ల కార్నీకి ఏకంగా 86శాతం ఓట్లు పడటం విశేషం. ఆయనతో పోటీ పడ్డ మాజీ ఆర్థిక మంత్రి క్రిస్టినా ఫ్రీలాండ్ రెండో స్థానానికి పరిమితమయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో కెనడా కొత్త ప్రధాని మార్క్ కార్నీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కెనడాను అమెరికాలో అంతర్భాగం చేసుకుంటామని హెచ్చరిస్తున్న అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump)కు గట్టి వార్నింగ్ ఇచ్చారు.
‘ట్రంప్ ను గెలవనివ్వను’
అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. కెనడాను తమ దేశంలో 51వ రాష్ట్రంగా చేసుకుంటామని పదే పదే మాట్లాడుతూ వస్తున్నారు. దీనిపై నూతనంగా ఎన్నికైన 59ఏళ్ల మార్క్ కు ప్రశ్న ఎదురైంది. దీనిపై ఆయన స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ అమెరికాలో భాగం కాబోమని తేల్చి చెప్పారు. కెనడాను కలుపుకొని దేశంలోని వనరులు, నీరు, భూమి వంటిని అమెరికా హస్తగతం చేసుకోవాలని చూస్తోందని మార్క్ అన్నారు. అదే జరిగితే కెనడాకు తీవ్ర నష్టం తప్పదని పేర్కొన్నారు. కాబట్టి ఈ ప్రయత్నంలో ట్రంప్ ను ఎట్టి పరిస్థితుల్లో గెలవనివ్వనని స్పష్టం చేశారు. మరోవైపు అమెరికా పన్నులకు ప్రతీకారంగా ఆ దేశ దిగుమతులపై విధించిన అదనపు సుంకాలు కొనసాగుతాయని మార్క్ పేర్కొన్నారు.
ఏకపక్షంగా మార్క్ కు మద్దతు
అధికార లిబరల్ పార్టీ నేతగా గత ప్రధాని జస్టిన్ ట్రూడో.. 9 ఏళ్లుగా కెనడాను పాలిస్తూ వచ్చారు. అయితే పదవి నుంచి వైదొలుగుతున్నట్లు జనవరిలో ప్రకటించారు. దీంతో నూతన సారథి ఎన్నికకు లిబరల్ పార్టీ శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా కొత్త పార్టీ అధ్యక్షుడితో పాటు ప్రధానిని ఎన్నుకునే బాధ్యతను పార్టీ సభ్యులుగా కల్పించింది. దీంతో పార్టీలో సభ్యులుగా ఉన్న 1,50,000 మంది ఎన్నికల్లో పాల్గొని ఓటు వేశారు. ఈ క్రమంలో మార్క్ కార్నీకి 1,31,674 ఓట్లు (85.9%) ఓట్లు వచ్చాయి. రెండో స్థానంలో నిలిచిన క్రిస్టియా ఫ్రీలాండ్ కు కేవలం 11,134 మంది మద్దతు లభించింది.
Also Read: Meenakshi Natarajan: ‘వన్ మాన్-వన్ పోస్ట్’… ఎమ్మెల్సీ ఎంపికలో.. మీనాక్షి మార్క్
ఎవరీ మార్క్ కార్నీ
మార్క్ కార్నీ వ్యక్తిగత, రాజకీయ ప్రయాణం విషయాలకు వస్తే ఆయన 1965లో కెనడాలోని ఫోర్ట్ స్మిత్‌లో జన్మించారు. 2003లో బ్యాంక్ ఆఫ్ కెనడా డిప్యూటీ గవర్నర్‌గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఏడాదికే పదవికి రాజీనామా చేసిన ఆయన లిబరల్ పార్టీలో చేరి ఆర్థిక మంత్రిగా పనిచేశారు. 2008లో సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టి.. ఆ సమయంలో ప్రపంచాన్ని కుదిపేసిన ఆర్థిక సంక్షోభం ప్రభావం కెనడాపై పడకుండా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2013లో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ గవర్నర్‌గా ఎన్నికై తొలి నాన్ – బ్రిటిష్ గవర్నగా చరిత్ర సృష్టించారు. 2020లో పదవి నుంచి తప్పుకొని ఐరాస ఆర్థిక, వాతావరణ మార్పుల విభాగం రాయబారీగా సేవలందించారు. ఎన్నడూ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయని ఆయన ట్రోడో రాజీనామాతో కెనడా కొత్త ప్రధానిగా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు.